Brother and Sister Frauds : వారిద్దరు 30 సంవత్సరాలలోపు వయసున్న అన్నాచెల్లెళ్లు. కానీ వారు అడ్డదారిలో మాత్రం రూ. కోట్లు ఆర్జించడంలో ఆరితేరారు. అలా వచ్చిన నగదుతో అధికారం ప్రదర్శించేవారు. వారి గుట్టును తాజాగా పోలీసులు రట్టు చేశారు. దీంతో ఆ ఇద్దరు పరారయ్యారు. ఇప్పుడు ఆ అన్నాచెల్లెళ్ల కోసం ఇప్పుడు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, పశ్చిమ బంగాల్ తదితర నాలుగు రాష్ట్రాల పోలీసులు వెతుకున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి.
Police Investigation on Brother and Sister Frauds : హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో ఇటీవల కిడ్నాప్‌నకు గురైన గిగ్లైజ్ సాఫ్ట్‌వేర్ సంస్థ నిర్వాహకుడు వాకాటి రవిచంద్రారెడ్డి (29), ఆయన సోదరి చందనారెడ్డి అలియాస్ యామిని అలియాస్ సౌమ్య (27) మోసాల చిట్టా ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తోంది. దీనిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్న నేపథ్యంలో రవిచంద్రారెడ్డి తన సంస్థలో 1200 మందిని బ్యాక్‌డోర్‌లో నియమించుకున్నారని గుర్తించారు. వేతనాలు చెల్లించకుండా వారంతా సక్రమమైన పద్దతిలో ఉద్యోగంలోకి రాలేదనే కారణంతో వారందరినీ తొలగించినట్లు పోలీసులు నిర్ధారించారు. ఇదే మోసానికి సంబంధించి నిందితుడు రవిచంద్రారెడ్డి సహా మరికొందరిపై రాయదుర్గం పోలీస్ స్టేషన్లో దాదాపు 115 మంది ఫిర్యాదులు చేసినట్లు గుర్తించారు.
Vakati Ravichandra Reddy Case Updates : రవిచంద్రారెడ్డి ఏపీలో ఒక గుడికి రాసిచ్చిన రూ.కోటి చెక్కు బౌన్స్ కావడంతో అతనిపై మరో కేసు నమోదైంది. మరోవైపు అతడు దాదాపు 25కుపైగా కంపెనీల్లో డైరెక్టర్‌గా ఉన్నట్లు చూపాడు. అంతే కాకుండా ఫోర్బ్స్ పుస్తకంలో 2.5 బిలియన్ల వ్యాపారం చేస్తున్నట్లు, సేవారంగంలో ఉన్నట్లు కథనం వచ్చిందని ఉద్యోగులను నమ్మించే ప్రయత్నం చేశాడు. నిందితుడు తరచూ శ్రీలంకకు, అతని సోదరి దుబాయికి వెళ్లి జల్సాలు చేస్తున్నట్లు పోలీసులు నిర్ధారించారు. పశ్చిమ బంగలో దాదాపు రూ.800 కోట్ల కుంభకోణంలో రవిచంద్రారెడ్డి పాత్ర ఉన్నట్లు పోలీసుల దృష్టికి వచ్చింది.
2023లోనే ఫిర్యాదులు : సౌమ్యపై మాదాపూర్‌లో 2023లోనే ఉద్యోగాల పేరుతో మోసం చేసినట్లు మూడు ఫిర్యాదులు ఉన్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. బెంగళూరులో ఒక సంస్థ పెట్టి దాదాపు రూ.12 కోట్లు, విజయవాడ ఒక సంస్థ పేరుతో రూ.15 కోట్ల మేర కాజేసినట్లు నిర్ధారించారు. ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లోనూ చందనారెడ్డిని నంద్యాల ఎంపీగా లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ తరపున బరిలో నిలిచారు.
ఈ సందర్భంగా ఆమె 6 ఫార్చ్యూనర్ అద్దె కార్లను, 30 మంది బౌన్సర్లను ఒక్కరోజు అద్దెకు, గిగ్లైజ్ కంపెనీలో ఉద్యోగ అవకాశం కల్పించిన దాదాపు 150 మందికిపైగా ఉద్యోగులను నామినేషన్ సందర్భంగా అక్కడికి తీసుకెళ్లి హంగామా చేసినట్లు తేలింది. జూబ్లీహిల్స్‌లో రవిచంద్రారెడ్డి నివాసం ఉంటున్న ఇంటి అద్దె రూ.2.50 లక్షలని, ప్రత్యేక జాతికి చెందిన 3 కుక్కలను పెంచుతున్నట్లు గుర్తించారు. మరోవైపు మూడు నెలలుగా అద్దె ఇవ్వడం లేదని తెలుసుకుని పోలీసులు విస్తుపోయారు.