Police Investigation on EX MLA Pinnelli : మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని కోర్టు అనుమతితో, పల్నాడు జిల్లా గురజాల పోలీసులు విచారణ చేశారు. ఈ నేపథ్యంలో పోలింగ్ రోజున పల్నాడు జిల్లా రెంటచింతల మండలం పాల్వాయిగేటు పోలింగ్ కేంద్రానికి తాను వెళ్లలేదని పిన్నెల్లి చెప్పారు. ఈవీఎంను పగలగొట్టలేదని, నంబూరి శేషగిరిరావు ఎవరో తనకు తెలియదని పేర్కొన్నారు. ఆరోజు తన వెంట గన్‌మెన్లు లేరని తెలిపారు. ఈ ఘటనలకు సంబంధించి సాక్ష్యాలు ఉన్నా అందులో తాను లేనని పోలీసులకు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సమాధానమిచ్చారు.
EX MLA Pinnelli Case Updates : పాల్వాయిగేటు పోలింగ్ కేంద్రంలో ఈవీఎంను ధ్వంసం చేయడమే కాకుండా, అడ్డొచ్చిన టీడీపీ ఏజెంట్ నంబూరి శేషగిరిరావుపై పిన్నెల్లి రామకృష్ణారెడ్డి దాడి చేసిన ఘటనపై కేసు నమోదైంది. మరుసటి రోజు పరామర్శ పేరుతో ఆయన కారంపూడిలో భారీగా అల్లర్లకు పాల్పడటమే కాకుండా విధుల్లో ఉన్న సీఐ నారాయణస్వామిపై రాయితో దాడి చేశారు. ఈ ఉదంతంపై మరోకేసు నమోదైంది.
ఈ కేసులకు సంబంధించి నెల్లూరు జైలులో ఉన్న పిన్నెల్లి రామకృష్ణారెడ్డి నుంచి మరింత సమాచారం రాబట్టేందుకు, కోర్టు అనుమతితో సోమవారం పల్నాడు జిల్లా గురజాల డీఎస్పీ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో పోలీసులు విచారణ చేపట్టారు. ఉదయం 10 గంటలకే డీఎస్పీతోపాటు 11 మంది పోలీసులు, నెల్లూరు జైలు వద్దకు చేరుకున్నారు. వారిని అధికారులు లోపలికి అనుమతించలేదు. దీంతో వారు కోర్టును ఆశ్రయించారు.
మధ్యాహ్నం 3 గంటలకు కోర్టు నుంచి ఆదేశాలు రావడంతో జైలు అధికారులు ఏడుగురినే జైలు లోపలికి అనుమతించారు. వీరిలో రెంటచింతల ఎస్‌ఐ ఎం.ఆంజనేయులు, ఓ ఏఎస్‌ఐ, ఇద్దరు కానిస్టేబుళ్లు, ఒక కెమెరామెన్, ఇద్దరు మధ్యవర్తులున్నారు. మధ్యాహ్నం 3:30 గంటలకు ప్రారంభమైన విచారణ, రాత్రి ఏడు గంటల వరకు సాగింది. పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని 50 ప్రశ్నలు అడిగారు. దాదాపు 30 ప్రశ్నలకు పైగా ఆయన తాను వెళ్లలేదని, వారెవరో తనకు తెలియదని, అనే సమాధానాలు చెప్పినట్లు సమాచారం. కారంపూడిలో అల్లర్లు, సీఐ నారాయణస్వామిపై దాడికి సంబంధించి నేడు పిన్నెల్లిని విచారించనున్నారు.
పిన్నెల్లిని అన్యాయంగా అరెస్టు చేశారు - జగన్ ఆవేదన - jagan met pinnelli ramakrishna