Police Arrested Eight People For Making & Selling Adulterated Ginger Garlic Paste in Hyderabad : ఈ రోజుల్లో ప్రజలు ఇన్స్టంట్ ఫుడ్‌పై ఆధార పడుతున్నారు. ఉద్యోగాల్లో బిజీగా ఉండి సమయం లేకపోవడం ఇందుకు ఒక కారణం. ఇన్స్టంట్ వంటల నుంచి వంటల్లో వాడే ప్రతీదీ చిటికెలో అయిపోవాలి అని చూస్తున్నారు. ఈ క్రమంలో వారు ఉపయోగిస్తుంది మంచిదా? లేదా అనే సంగతి పట్టించుకోవడం లేదు.
మరీ ముఖ్యంగా కూరల్లోకి వాడే అల్లం వెల్లుల్లి పేస్ట్ చాలా వరకు బయట కొంటారు. దాన్ని తయారు చేయడం సమయంతో కూడిన పని కావడంతో చాలా మంది దీన్ని బయట కొనేందుకే ఎక్కువగా ఆసక్తి చూపిస్తుంటారు. ఇలాంటి చిన్న విషయాలనే ఆసరాగా చేసుకుని కొందరు మోసాలకు పాల్పడుతున్నారు. ప్రజల ఆరోగ్యాన్ని లెక్క చేయకుండా, లాభాలపై ఆశతో కల్తీ వ్యాపారాలకు తెరలేపుతున్నారు. తాజాగా టాస్క్‌ఫోర్స్ అధికారులు నిర్వహించిన దాడుల్లో ఏకంగా 1500 కిలోల కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్‌ను పట్టుకున్నారు.
తెలంగాణలోని సికింద్రాబాద్ ఓల్డ్ బోయిన్‌పల్లిలో కల్తీ అల్లంపేస్ట్ తయారీ కేంద్రంలో టాస్క్‌ఫోర్స్ బృందం తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో 1500 కిలోల కల్తీ అల్లంపేస్ట్ స్వాధీనం చేసుకుని 8 మందిని అరెస్ట్ చేసినట్లు టాస్క్‌ఫోర్స్ డీసీపీ వై.వి.ఎస్. సుధీంద్ర ఆదివారం తెలిపారు. రాజరాజేశ్వరి నగర్లో మహ్మద్ షఖీల్ అహ్మద్ ‘సోనీ జింజర్ గార్లిక్ పేస్ట్ పేరిట వ్యాపారం నిర్వహిస్తున్నారు. కాగా అల్లం వెల్లుల్లి పేస్ట్‌లో అల్లంకు బదులు ప్రమాదకరమైన సిట్రిక్ యాసిడ్, ఉప్పు, పసుపు, వెల్లుల్లి వినియోగిస్తూ తయారు చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు.
రుచి చూసి లొట్టలేసుకుంటే! నాణ్యత చూసి అవాక్కవ్వాల్సిందే - బయట తినాలంటేనే వణికిపోతున్న జనం
నగరంతో పాటు చుట్టుపక్కల జిల్లాల్లో ఏజెంట్లను ఏర్పాటు చేసుకొని ప్రముఖ హోటళ్లకు కూడా ఈ నకిలీ అల్లం వెల్లుల్లి పేస్ట్‌ను సరఫరా చేస్తున్నారు. అలాగే ఆన్లైన్లో కూడా దర్జాగా విక్రయిస్తున్నారు. మూడు సంవత్సరాలుగా సాగుతున్న ఈ కల్తీ వ్యాపారంపై ఫిర్యాదులు రావడంతో బోయిన్పల్లి ఇన్‌స్పెక్టర్ లక్ష్మీ నారాయణరెడ్డి, టాస్క్‌ఫోర్స్ ఇన్‌స్పెక్టర్ సైదులు, తనిఖీలు చేపట్టారు. కల్తీ అల్లం పేస్ట్ 1500 కిలోలు, సిట్రిక్ యాసిడ్ 55 కిలోలు, 480 కిలోల నాసిరకం వెల్లుల్లిని పట్టుకున్నారు. అక్కడ పని చేస్తున్న సమీర్ అన్సారీ (33), గుల్ఫార్జ్ (32), ముక్తార్ (27), రంజిత్ కుమార్ (19), మోను కుమార్ (20), బిర్వాల్ సాహ్ (19), ఇనాయత్ (32), మహేశ్‌కుమార్ (20)లను అదుపులోకి తీసుకున్నామని పోలీసులు తెలిపారు.
కంటికి కలర్ఫుల్గా, రుచిగా ఉందని తింటున్నారా? అసలు విషయం తెలిస్తే అంతే!