Polavaram Residents Compensation Problems in Eluru District : రాష్ట్రానికి జీవనాడిగా చెప్పుకునే పోలవరం ప్రాజెక్టు కోసం సర్వం త్యాగం చేసిన నిర్వాసితుల జీవితాల్లో చీకట్లు తొలగడం లేదు. ఓ వైపు పూర్తి స్థాయిలో పరిహారం రాక ఏళ్లుగా ఎదురుచూస్తున్న వారికి అధికారుల తప్పిదాలూ శాపాలుగా మారుతున్నాయి. ప్రాజెక్టు కోసం తమ భూమిని తీసుకున్న అధికారులు ప్రత్యామ్నాయంగా కేటాయించిన భూములు సాగుకు అనుకూలంగా లేవని నిర్వాసితులు వాపోతున్నారు.
రాళ్లు, తుప్పలతో నిండిన భూమి : పోలవరం ప్రాజెక్టు కోసం అనేక త్యాగాలు చేసిన నిర్వాసితులను సముచితంగా గౌరవించాల్సిన గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం వారి త్యాగాలను చిన్నచూపు చూసింది. ప్రాజెక్టు కోసం నిర్వాసితుల నుంచి భూమిని సేకరించిన అధికారులు సాగుకు అనువుగా లేవని నిర్వాసితులు వాపోతున్నారు. కొండలు, గుట్టలు, పుట్టలు, తుప్పలతో నిండిన భూమిలో ఏం సాగు చేయాలో తెలియక నిర్వాసితులు తలలు పట్టుకుంటున్నారు.
అధికారుల తప్పిదాలు : నాలుగేళ్ల క్రితం నిర్వాసితులను కాలనీలకు తరలించే సమయంలో వారికి కేటాయించిన భూమిని చదును చేసి వ్యవసాయ యోగ్యంగా మార్చి ఇస్తామని చెప్పిన అధికారులు మాట తప్పారు. తుప్పలు, గుట్టలు సరిచేయకుండానే రైతులకు భూముల పట్టాలిచ్చి చేతులు దులుపుకున్నారు. అధికారుల నిర్లక్ష్యంతో తమకు కేటాయించిన భూమి ఎక్కడుందో తెలుసుకోవడమే నిర్వాసితులకు గగనంగా మారింది. దీనికి తోటు ఆ భూమిని చదును చేయడం తలకు మించిన భారం కావడంతో నాలుగేళ్లయినా ఇప్పటికీ సాగు చేసుకోలేక బీడు పెట్టేస్తున్నారు.
గత పాలకుల నిర్లక్ష్యం - పోలవరం నిర్వాసితుల పాలిట శాపం - Polavaram Residents Problems
భూమిని బీడుగానే వదిలేసిన నిర్వాసితులు : నిర్వాసితులకు కేటాయించేందుకు రైతుల నుంచి సేకరించిన భూములకు పరిహారం చెల్లించకపోవడంతో బాధిత రైతులు నిర్వాసితులను భూముల్లో అడుగు పెట్టనివ్వడం లేదు. తమ ప్రాంతంలో సారవంతమైన భూములను ప్రాజెక్టుకు వదిలిపెట్టి ప్రాంతం కాని ప్రాంతానికి వస్తే ఇక్కడ వ్యవసాయానికి యోగ్యం కాని భూములు ఇచ్చి అధికారులు చేతులు దులుపుకున్నారు. అధికారులను అడిగితే పట్టించుకునే వారే కరవయ్యారని నిర్వాసితులు వాపోతున్నారు. సొంత పొలం కళ్లముందే ఉన్నా అది సాగుకు పనికిరాకపోవడంతో కుటుంబ పోషణ కోసం కూలికి వెళ్లక తప్పడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి రాళ్లు, గుట్టలతో నిండిన భూమిని చదును చేసి వ్యవసాయ యోగ్యంగా మార్చి ఇవ్వాలని నిర్వాసితులు కోరుతున్నారు.
అధికారుల తప్పిదం - పోలవరం నిర్వాసితులకు నిలువ నీడ కరువైంది? - Neglect on Polavaram Residents