Polavaram Project DPR: పోలవరం తొలి దశకు అవసరమయ్యే పూర్తి నిధులను అంచనా వేసి ఇప్పటికే డీపీఆర్‌ను (DETAILED PROJECT REPORT) రూపొందించారు. పోలవరం ప్రాజెక్టు అథారిటీ, కేంద్ర జలసంఘం, సాంకేతిక సలహామండలి, రివైజ్డ్ కాస్ట్ కమిటీ, పెట్టుబడుల అనుమతి మండలి పోలవరం ప్రాజెక్టు నిధులకు ఆమోదముద్ర వేశాయి. ఇప్పటికే అన్ని స్థాయిలు దాటిన పోలవరం డీపీఆర్, మంత్రిమండలి ఆమోదం కోసం ఎదురుచూస్తోంది. దీంతో పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి 30 వేల 436.95 కోట్ల రూపాయలతో సిద్ధమైన డీపీఆర్‌ను కేంద్ర మంత్రిమండలి వచ్చే వారం ఆమోదించే అవకాశం ఉంది. ఈ మేరకు ఈ నెల 27, 28వ తేదీల్లో కేంద్ర మంత్రిమండలి సమావేశం జరగనుంది.
ఇటీవల దిల్లీ వెళ్లిన సీఎం చంద్రబాబు ఈ అంశంపై ప్రత్యేకంగా దృష్టిసారించి కేంద్ర పెద్దలతో చర్చించారు. ప్రధాని నరేంద్ర మోదీ దృష్టికి ఈ విషయం తీసుకువెళ్లారు. ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌తోనూ మాట్లాడారు. జల్‌శక్తి మంత్రి సీఆర్ పాటిల్‌కు వాస్తవ పరిస్థితిని వివరించారు. దీంతో తదుపరి కేంద్ర మంత్రిమండలి ముందుకు ఈ ప్రతిపాదన వెళ్లనున్నట్లు రాష్ట్ర అధికారులకు కబురు అందింది.
పీఎంఓ ఆదేశాల మేరకు ఆర్థికశాఖ ఈ ప్రతిపాదనను మంత్రిమండలి ముందు ఉంచనుంది. పోలవరం తొలి దశకు అవసరమయ్యే పూర్తి నిధులను అంచనా వేసి పోలవరం డీపీఆర్‌ను రూపొందించారు. ఇప్పటికే తొలి దశకు అవసరమయ్యే పూర్తి నిధులకు పలు స్థాయిలలో ఆమోదముద్ర వేశారు. ఇక కేంద్ర మంత్రిమండలి ఆమోదిస్తే నిధులు విడుదలయ్యే అవకాశం ఉంటుంది.
తాజా డీపీఆర్ ఆమోదం పొందితే పోలవరానికి 12 వేల 157.53 కోట్ల రూపాయలు అందుబాటులోకి వస్తాయి. మిగిలిన మొత్తం ఇప్పటికే రీయింబర్స్ చేసినందువలన ఆ నిధులు అందుబాటులో ఉంటాయి. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఆ మొత్తం నిధులు అడ్వాన్స్‌గా ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం కోరుతోంది. ఎలాగూ కేంద్ర బడ్జెట్‌లో కేటాయింపుల ద్వారా నిధులను ఇవ్వడం లేదు. 2016 తర్వాత నాబార్డుతో కేంద్రం ఒప్పందం కుదుర్చుకుని వారినుంచి కేంద్రం రుణం రూపంలో పొంది, రాష్ట్ర ప్రభుత్వానికి అందిస్తోంది. దీంతో పోలవరం ప్రాజెక్టుకు ఇవ్వబోయే 12 వేల కోట్ల రూపాయలకు పైగా నిధులను అడ్వాన్స్‌గా ఇవ్వాలని కోరుతున్నారు. ఆ నిధులు వస్తే ఆర్థికంగా వెసులుబాటు ఉంటుందని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది.
ఇప్పటివరకు రాష్ట్రం తొలుత ఖర్చుచేస్తే ఆ తరువాత కేంద్ర ప్రభుత్వం రీయింబర్స్ చేస్తోంది. నిజానికి జాతీయ ప్రాజెక్టుల్లో కేంద్ర ప్రభుత్వమే తొలుత అడ్వాన్స్‌గా నిధులివ్వాలని గతంలో జలవనరులశాఖ ఉన్నతాధికారులుగా పనిచేసిన వారు సైతం పోలవరం అథారిటీ ముందు ప్రస్తావిస్తూ వచ్చారు.