PIL in High Court on Konaseema Riots: కోనసీమ అల్లర్ల నిందితులపై నమోదు చేసిన కేసులను ఎత్తివేస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవోనూ సవాల్ చేస్తూ హైకోర్టులో పిల్ దాఖలైంది. కోనసీమ జిల్లా పేరును బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాగా మార్చడాన్ని వ్యతిరేకిస్తూ, అమలాపురంలో చేలరేగిన హింస ఘటన తెలిసిందే. ఈ ఘటనకు కారణమైన నిందితులపై కేసులను నమోదు చేసిన విషయం విధితమే. అయితే ఆ కేసులను ఎత్తివేస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవోను కొట్టివేయాలని ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది.
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా సాధన సమితి కన్వీనర్ జంగా బాబురావు ఈ మేరకు హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. మొత్తం 6 ఎఫ్‌ఐఆర్‌ల కేసుల ఉపసంహరణకు, రాష్ట్ర ప్రభుత్వం 2023 డిసెంబర్ 20న జీవో జారీ చేసిందని గుర్తు చేస్తూ, దానిని నిలిపి వేయాలని న్యాయస్థానాన్ని కోరారు. సుప్రీంకోర్టు తీర్పునకు విరుద్ధంగా ఉన్న ఆ జీవోను కొట్టేయాలని కోర్టును కోరారు.
హోంశాఖ ముఖ్యకార్యదర్శి, రాష్ట్ర డీజీపీ, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఎస్పీ, డీఎస్పీలను వ్యాజ్యంలో ప్రతివాదులుగా పేర్కొన్నారు. 2022 మే నెలలో చోటు చేసుకున్న ఈ హింసా ఘటనలో, బాధ్యులుగా పేర్కొంటూ వందల మందిని నిందితులుగా చేర్చుతూ పోలీసులు కేసులు నమోదు చేశారని పిటిషనర్ పేర్కొన్నారు. పోలీసులపై రాళ్లదాడి చేశారన్నారు.
మంత్రి, అధికార పార్టీ నేతల ఇళ్లకు నిప్పుపెట్టారన్నారు. పోలీసులు నమోదు చేసిన కేసుల్లో ఐపీసీ సెక్షన్ 307 హత్యాయత్నం వంటి కీలక సెక్షన్లు ఉన్నాయని న్యాయస్థానం దృష్టికి తీసుకువచ్చారు. తీవ్ర నేరాల్లో నిందితులుగా ఉన్న కేసులను ఉపసంహరించడానికి చట్టం అనుమతించదన్నారు. కేసుల ఉపసంహరణ సుప్రీంకోర్టు బల్వంత్‌సింగ్ కేసుతో పాటు మరికొన్ని కేసులలో ఇచ్చిన తీర్పునకు ఇది విరుద్ధమని కోర్టుకు దృష్టికి తీసుకువచ్చారు.
కేసులను ఉపసంహరణకు కారణాలేమిటో రాష్ట్ర ప్రభుత్వం జీవోలో పేర్కొనలేదన్నారు. అమలాపురం పట్టణ ఠాణాలో నాలుగు, తాలూకా ఠాణాలో మరో రెండు కేసుల ఉపసంహరణకు జీవో ఇచ్చారని పిటిషన్లో బాబురావు వివరించారు. కేసుల ఉపసంహరణకు సంబంధిత కోర్టులలో పిటిషన్లు వేయాలని పీపీలను, ఏపీపీలను ఆదేశించాలంటూ రాష్ట్ర ప్రభుత్వం, డీజీపీని ఆదేశించిందని గుర్తు చేశారు. ఈ అంశాల్ని పరిగణనలోకి తీసుకొని రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో 1566ని రద్దు చేయాలని కోరారు.