Phanidam Handloom Industry in Crisis Under YSRCP Government : ఐదేళ్ల వైఎస్సార్సీపీ ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలతో మునుపెన్నడూ లేనివిధంగా చేనేత పరిశ్రమ తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయింది. నూలు రాయితీలు, పావలా వడ్డీలు, రిబేట్ లాంటి బకాయిలు చెల్లించకపోవడంతో చేనేత సహకార సంఘాల మనుగడే ప్రశ్నార్థకంగా మారింది. నేతన్న నేస్తం పేరిట కొద్ది మందికి మాత్రమే నామమాత్రపు సాయం అందించి జగన్ సర్కార్ చేతులు దులుపుకుంది. కనీస ఆదాయం లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని పేర్కొన్నారు. కొత్త ప్రభుత్వమైనా అండగా నిలవాలని చేనేత కార్మికులు కోరుకుంటున్నారు.
స్వాతంత్య్రానికి ముందే 1946లో ఏర్పడి పల్నాడు జిల్లాలో వందలాది కుటుంబాలకు ఆధారంగా నిలిచింది ఫణిదం చేనేత సహకార సంఘం. అప్పట్లో ఉమ్మడి రాష్ట్రంలోనే రెండవ అతిపెద్ద సహకార సంఘంగా ఫణిదం చేనేత సహకార సంఘం గుర్తింపు తెచ్చుకుంది. ఈ సొసైటీ తరపున చీరలు, దుప్పట్లు, లుంగీలు, కండువాలు, దోమతెరలు ఇలా అనేక రకాల చేనేత ఉత్పత్తుల్ని తయారు చేసేవారు. ఎంతో ఘనమైన చరిత్ర ఉన్న ఈ ఫణిదం చేనేత సహకారం సంఘం (Fanidam Hand Weaver Co-operative Society) ఇప్పుడు తీవ్ర గడ్డు పరిస్థితిని ఎదుర్కోంటోంది. ఒకప్పుడు ఈ సహకార సంఘంలో దాదాపు 400 మగ్గాలపై నేతన్నలు వస్త్రాలు తయారు చేసేవారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో చేనేత పరిశ్రమలకు ఒక్క రూపాయి సాయం అందించలేదని చేనేత కార్మికులు వాపోతున్నారు.
చేనేత వస్త్రాలకు తగిన మార్కెటింగ్ సదుపాయాలు కల్పించాలని కూటమి ప్రభుత్వాన్ని కార్మికులు కోరుతున్నారు. కేంద్రం విధించిన బహుళ జీఎస్టీ కూడా చేనేత సహకార సంఘాలకు మోయలేని భారంగా మారిందని వాపోయారు. కార్మికులకు చేతినిండా పని కల్పించాలని నేతన్నలు విజ్ఞప్తి చేస్తున్నారు. నాణ్యమైన చేనేత ఉత్పత్తుల్ని వివిధ సంస్థలకు అందిస్తూ దాదాపు 8 దశాబ్దాలుగా ఫణిదం చేనేత సహకార సంఘం మన్నికకు మారుపేరుగా నిలిచింది. అయితే వైఎస్సార్సీపీ ప్రభుత్వ కాలంలో ఎలాంటి రిబేట్ నిధులు విడుదల చేయకపోగా, గత ప్రభుత్వం ఇచ్చిన డబ్బును ఆపేసిందని సొసైటీ నిర్వాహకులు వాపోతున్నారు.
చేనేతకు చేయూతేదీ - కుటుంబ పోషణ కష్టమై కులవృత్తిని వీడుతున్న నేతన్నలు - Problems of Handloom Industry
"కనీస ఆదాయం కూడా రావడం లేదు. ఈ పనితో పాటు వ్యవసాయ కూలీ పనులకు వెళ్తున్నాం. సరైన ఆదాయం రాకపోవడంతో నేటి తరం షాపుల్లోకి పోతున్నారు. చేనేత సహకార సంఘాలకు నూలు రాయితీలు, పావలా వడ్డీలు, రిబేట్ లాంటివి రావడం లేదు. మిల్లు పోటీలకు తట్టుకోలేక చేనేత పరిశ్రమ సన్నగిల్లుతుంటే కొత్తగా జీఎస్టీ వచ్చి మరింత నష్టాల్లోకి నెట్టింది. గతంలో ఉన్న సంక్షేమ పథకాలన్నీ చేనేత సహకార సంఘాలకు కూటమి ప్రభుత్వం అమలు చేస్తారని ఆశిస్తున్నాం" -చేనేత కార్మికులు
'చేనేత' ఇక గతమేనా?- మగ్గం నేసిన చేతులు మట్టి పనుల్లో! - Handloom workers Problems