People Suffering from CM Jagan Bus Yatra : ఉత్తరాంధ్రలో సీఎం జగన్ బస్సు యాత్ర జనానికి విసుగు తెప్పించింది. సరిహద్దు జిల్లాల నుంచి భారీగా బస్సులు తరలించడంతో ప్రయాణికులు నానా అవస్థలు పడ్డారు. గంటల తరబడి పడిగాపులు కాసినా బస్సులు రాకపోవడంతో జనం చిర్రెత్తిపోయారు. సభకు తరలించిన మహిళలనూ నేతలు రోడ్డుపై వదిలేడంతో ఎండలో తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
డబ్బులిచ్చి ఆర్టీసీ బస్సుల్లో తరలించినా వెనుదిరిగిన జనం - వైసీపీ శ్రేణుల విస్మయం
సీఎం జగన్ బస్సుయాత్ర ప్రయాణికుల పాలిట దండయాత్రగా మారింది. ఉత్తరాంధ్రలో సీఎం జగన్ పర్యటన సందర్భంగా విశాఖలో మహిళలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. సీఎం బస్సు యాత్ర కోసం మహిళలను తరలించగా మధురవాడ స్టేడియానికి ఉదయం 9గంటలకే రావాల్సిన జగన్ చాలాసేపటికి రాకపోటంతో మహిళలు అవస్థలు పడ్డారు. వారిని తీసుకొచ్చిన వైసీపీ నాయకులు పట్టించుకోపోవడంతో చాలా మంది రోడ్లపైనే ఉండిపోయారు. మరికొందరు ఎండ దెబ్బకు తాళలేక బస్సుల కింద తలదాచుకుని సేదతీరారు.
ఆర్టీసీ బస్సులన్నీ సిద్ధం సభకు తరలిపోవడంతో విజయనగరంలో ప్రయాణికులు అవస్థలు పడ్డారు. గంటల తరబడి వేచిచూసినా బస్సులు రాకపోవడంతో ప్రైవేటు వాహనాల్లో ప్రయాణాలు సాగించారు. సాలూరు, పార్వతీపురం, బొబ్బిలి, విశాఖపట్నం వెళ్లే ప్రయాణికులు ఎటూ వెళ్లలేక నిస్సహాయ స్థితిలో ఉండిపోయారు. కేవలం 20 శాతం బస్సులే నడుపుతున్నామని ఆర్టీసీ అధికారులు వెల్లడించడంతో ప్రయాణికులు ప్రైవేటు వాహనాలతో పాటు ఒడిశా బస్సులను ఆశ్రయించారు. కొన్ని డిగ్రీ కళాశాలల్లో మిడ్ పరీక్షలు జరగడంతో విద్యార్థులు నానా తిప్పలు పడ్డారు.
ప్రజల పాలిట శాపంలా సీఎం జగన్ బస్సుయాత్ర - సామాన్యలపై పోలీసుల జులుం
పార్వతీపురంలో ఆర్టీసీ బస్సులు లేక ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. జగన్ సభకు పార్వతీపురం డిపో నుంచి 60 బస్సులు తరలించడంతో సామాన్యులకు తిప్పలు తప్పలేదు. వేసవి సెలవుల కోసం విద్యార్థులు లగేజీతో సొంతూళ్లకు బయల్దేరగా బస్సులు లేక పడిగాపులు కాశారు. సాలూరు ఆర్టీసీ డిపో నుంచి సిద్ధం సభకు బస్సులు తరలించడంతో బస్సులు లేక బస్టాండ్‌లో ప్రయాణికులు గంటల కొద్దీ నిరీక్షించారు. రాజకీయ సభల కోసం బస్సులు తరలించి తమను ఇబ్బంది పెట్టడంపై ప్రజలు తీవ్రంగా మండిపడ్డారు.
విశాఖ జిల్లా ఆనందపురంలో జగన్ మేమంతా సిద్ధం బస్సుయాత్ర సందర్భంగా వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఆనందపురం బ్రిడ్జ్ కింద నుంచి విజయనగరం వెళ్లే మార్గంలో పోలీసులు భద్రతా చర్యల పేరిట బ్యారికేడ్లు పెట్టడంతో ప్రయాణికులు నానా అవస్థలు పడ్డారు. స్థానికులు ఇంటికి వెళ్తున్నా పోలీసులు సీఎం భద్రత పేరిట అడ్డుకన్నారు. ఎక్కడికి వెళ్లాలన్నా సీఎం వెళ్లిన తర్వాతేనని కరాఖండిగా తేల్చిచెప్పారు. దీంతో ప్రయాణికులు నడిరోడ్డుపై గంటల కొద్దీ పడిగాపులు కాశారు.
జగన్ బస్సు యాత్రలో పవన్ కల్యాణ్‌కు అనుకూలంగా నినాదాలు - అసహనానికి గురై వెళ్లిపోయిన సీఎం