Godavari Floods in AP 2024 : ఎగువ ప్రాంతాల నుంచి గోదావరికి వరద పోటెత్తుతోంది. రాజమహేంద్రవరంలోని ధవళేశ్వరం వద్ద గోదావరి ప్రమాదకరంగా ప్రవహిస్తోంది. దీంతో అధికారులు సోమవారం అర్ధరాత్రి 2 గంటలకు రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ప్రస్తుతం నీటిమట్టం 14.20 అడుగులకు చేరుకుంది. ఈ క్రమంలోనే అధికారులు సముద్రంలోకి 13.30 లక్షల క్యూసెక్కులు నీటిని విడుదల చేశారు.
నీటిలోనే లంక గ్రామాలు : మరోవైపు కోనసీమ జిల్లాలో గోదావరి వరద ఉద్ధృతితో లంక గ్రామాలు నీటిలోనే మగ్గుతున్నాయి. పడవలపైనే లంకవాసుల రాకపోకలుసాగిస్తున్నారు. కాజ్‌వేలు, ఉద్యానవన పంటలు మునిగిపోయాయి. నివాస గృహాలకు వరద చేరడంతో జనం బిక్కుబిక్కుమంటూ జీవనం గడుపుతున్నారు. ముమ్మిడివరం మండలంలో గురజాపు లంక, కూనాలంక, లంకాఫ్ ఠానేలంక గ్రామాలకు వెళ్లే ప్రధాన రహదారి ముంపునకు గురైంది.
ప్రభుత్వమే ఆదుకోవాలని బాధితుల విజ్ఞప్తి : అయినవిల్లి లంక వద్ద ఎదురుబిడియం కాజ్వే పైకి వరద నీరు చేరి వాహనదారులకు ఇబ్బందిగా మారింది. అయినవిల్లి లంక, అద్దంకివారి లంక, వీరవెల్లిపాలెం, పల్లపు లంక ప్రజలు మోకాళ్ల లోతు నీటిలో నడుస్తూ ప్రయాణాలు సాగిస్తున్నారు. వరద ఉద్ధృతి అంతకంకతకూ పెరుగుతుండటంతో పశువులను సురక్షిత ప్రాంతాలకు రైతులు తరలిస్తున్నారు. వందలాది ఎకరాల్లో కూరగాయల పంటలు నీట మునిగాయి. అక్కడక్కడ మిగిలిన కాయలను అన్నదాతలు కోసుకుంటున్నారు. తమను సురక్షిత ప్రాంతాలకు తరలించి, ప్రభుత్వమే ఆదుకోవాలని బాధితులు కోరుతున్నారు.
AP Rains 2024 Updates : మరోవైపు వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలను కోనసీమ జిల్లా కలెక్టర్ మహేశ్‌కుమార్ పర్యవేక్షించారు. గ్రామాల్లోకి రాకపోకలు సాగించేందుకు పడవలను ఏర్పాటు చేయాలని, అలాగే వైద్య శిబిరాలు కొనసాగించాలని అధికారులను ఆదేశించారు. వరద ఉధృతి పెరిగే అవకాశం ఉన్నందున అధికారులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ వెల్లడించారు.
కోటిపల్లిలో కొనసాగుతున్న వరద ఉద్ధృతి : కోనసీమ జిల్లాలోని గంగవరం మండలం కోటిపల్లి రేవులో వరద ఉద్ధృతి కొనసాగుతుంది. సుందరపల్లి గ్రామం వద్ద ఏటుగట్టు బలహీనంగా ఉందని అధికారులు గుర్తించారు. వరద గ్రామాల్లోకి ప్రవేశించకుండా ఏటుగట్టు వద్ద సుమారు 2,000ల ఇసుక బస్తాలతో అధికారులు పటిష్ఠ చర్యలు చేపట్టారు. ముందస్తులో భాగంగా కోటిపల్లి, ముక్తేశ్వరం వైపు వెళ్లే వాహనాల రాకపోకలను అధికారులు నిలిపివేశారు. అల్లూరి జిల్లా వీఆర్‌పురం నుంచి కూనవరానికి రాకపోకలు నిలిచిపోయాయి. ధర్మతాళ్లగూడెంలో రహదారి పైనుంచి వరద నీరు ప్రవహిస్తోంది. మరోవైపు వీఆర్‌పురం మండలంలో 250కి పైగా ఇళ్లు, శ్రీరామగిరిలో 170 ఇళ్లు నీట మునిగాయి.
గోదావరి వరద ముంపులో వందలాది గ్రామాలు, వేలాది ఎకరాలు - People Suffer in FLOOD WATER
వీడని వర్షాలతో పొంగిపొర్లుతున్న నదులు, వాగులు - Flood Effect in Andhra Pradesh