People Suffer Due to Traffic Problem in Vijayawada : విజయవాడ నగరంలో ట్రాఫిక్ పద్మవ్యూహాన్ని తలపిస్తోంది. గమ్యస్థానాలకు చేరాలంటే అనుకున్న సమయాని కంటే ఎక్కువ సమయం పడుతోంది. రద్దీ సమయాల్లో 2.5 కిలోమీటర్లు వెళ్లాలంటే 10-20 నిమిషాలు వరకు సిగ్నల్స్ వద్ద వాహనదారుల పడిగాపులు కాయాల్సి వస్తోంది. కొన్ని కూడళ్లలో ట్రాఫిక్ సిగ్నల్స్, పరికరాలు లేకపోవడంతో చాలా చోట్ల సిబ్బందే ట్రాఫిక్‌ను నియంత్రిస్తున్న పరిస్థితి. ఈ సమస్యను ఓ కొలిక్కి తెచ్చేందుకు గతంలో పనిచేసి మధ్యలో వదిలేసిన కాంట్రాక్టర్లు సంస్థను మళ్లీ రంగంలోకి దించేందుకు పోలీసు ఉన్నతాధికారులు కసరత్తు చేస్తున్నారు.
విపరీతంగా ట్రాఫిక్ రద్దీ : పెరిగిన జనాభా, వాహనాల రద్దీకి అనుగుణంగా విజయవాడలో సమగ్ర ట్రాఫిక్ నిర్వహణ వ్యవస్థ అవసరం కాగా పోలీస్, వీఎంసీల మధ్య సమన్వయ లేమి స్పష్టంగా కన్పిస్తోంది. విజయవాడ నగరం మధ్యగా చెన్నై-కోల్ కత్తా, హైదరాబాద్-మచిలీపట్నం జాతీయ రహదార్లు వెళ్తుండటంతో విపరీతంగా ట్రాఫిక్ రద్దీ ఏర్పడుతోంది. ప్రధానంగా బెంజ్ సర్కిల్ నుంచి రామవరప్పాడు రింగ్ రోడ్ వరకు 2.6 కిలోమీటర్లు ఉంటుంది. ఈ రెండున్నర కిలోమీటర్ల ప్రయాణం వాహనదారులకు చుక్కలు చూపిస్తోంది. బెంజ్ సర్కిల్ నుంచి రామవరప్పాడు రింగ్ రోడ్ వరకు నాలుగు జంక్షన్లు ఉండగా సాధారణంగా 15 నిమిషాల్లో, రద్దీ సమయాల్లో ఇదే దూరానికి కనీసం 30 నిమిషాలు పడుతుంది. గతంలో నిర్మించిన ప్లైఓవర్‌ను కొద్దిమేర పరిమితం చేయడంతో ట్రాఫిక్ కష్టాలు పూర్తిగా తీరలేదు.
National Clean Air Program : విజయవాడ నగరపాలక సంస్థకు కేంద్రం నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్ పథకం కింద గతంలో రూ.15 కోట్ల ఖర్చయ్యే ప్రాజెక్టును ఇచ్చింది. తొలి దశలో రూ. 5 కోట్లను నగరపాలిక కేటాయించింది. 2022 నవంబరులో వీఎంసీ(VMC), పోలీసు అధికారులు టెండర్ల ప్రక్రియ ప్రారంభించి గత ఏడాది జనవరిలో ఏజెన్సీని ఖరారు చేశారు. హైదరాబాద్‌కు చెందిన గుత్తేదారు సంస్థ పనులు దక్కించుకుంది. గడిచిన ఏడాది ఫిబ్రవరిలో పనులు మొదలవగా 45 రోజుల్లో పూర్తి చేయాలని గడువు విధించారు.
పనుల్లో తీవ్ర జాప్యం : తొలి దశలో కీలకమైన 17 కూడళ్లను ఎంపిక చేశారు. బెంజి సర్కిల్, నిర్మలా జంక్షన్, రమేష్ ఆసుపత్రి, మహానాడు, చల్లపల్లి బంగ్లా, పోలీసు కంట్రోల్ రూమ్, డీసీపీ బంగ్లా, ఆంజనేయస్వామి కూడలి, చుట్టుగుంట జంక్షన్, విజయా టాకీస్, శారదా కళాశాల కూడలి, సీతారాంపురం, సీతన్నపేట గేట్, పడవలరేవు, అప్సర, ఫుడ్ కోర్ట్ జంక్షన్, మధురా నగర్ సర్కిల్స్ లో ఆధునిక ట్రాఫిక్ వ్యవస్థను కొంతమేరకు ఏర్పాటు చేశారు. పనుల్లో ఏజెన్సీ తీవ్ర జాప్యం చేయడంతో వీఎంసీ ఇంజినీరింగ్ అధికారులు అసంతృప్తి తెలిపారు.
పనుల తీరుపై వీఎంసీ అభ్యంతరం : సిగ్నళ్ల కోసం పాతిన స్తంభాల నాణ్యత సరిగా లేదనీ ఇచ్చిన డిజైన్‌కు బదులు మరో రకం ఏర్పాటు, స్తంభాల మందంలోనూ తేడా ఉందని అధికారులు గుర్తించారు. ఏజెన్సీ వీటిని తొలగించి కొత్తవి వేసింది. ఇప్పటివరకు చేసిన పనులకు గుత్తేదారు రూ. 1.40 కోట్లకు వీఎంసీకి బిల్లులు పెట్టారు. అవి మంజూరు చేస్తే మిగిలిన పనులు ప్రారంభించాలని గుత్తేదారు భావిస్తున్నారు. నగరపాలిక, పోలీసులు సమన్వయంతో కొనసాగితే పనులు మొదలై ప్రాజెక్టు పూర్తి అవుతుంది. ప్రస్తుతం పనులు నిలిచిపోవడంతో ప్రజలు, వాహనదారులు అవస్థలు పడుతున్నారు. ఈ ట్రాఫిక్ గండం నుంచి సాధ్యమైనంత తొందరగా గట్టెక్కించాలని వేడుకుంటున్నారు.
"జాతీయ రహదారి కావడంతో మద్రాస్, కలకత్తాకు వెళ్లే వాహనాలతో ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. అప్పుడప్పుడు అరగంట కూడా ఆగాల్సిన పరిస్థితి. ఆఫీస్‌కు వెళ్లే వారు కూడా గంటల పాటు వేచి చూడాల్సిన పరిస్థితి. ఒక్కొక్కసారి ఆఫీస్‌లకు సెలవు కూడా పెట్టేస్తున్నారు. లేకపోతే ఆఫీసు యాజమాన్యం వెనక్కు పంపిస్తున్నారు"- విజయవాడ నగరవాసులు
ఇవేమి రోడ్లు బాబోయ్- ఏలూరు జిల్లాలో చుక్కలు చూపిస్తున్న రహదారులు - Damaged Roads in Eluru District
ఏడాదిన్నరగా ఇదే తంతు : ఇంటెలిజెంట్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టమ్ (Intelligent Traffic Management System) ప్రాజెక్టు పనులు ప్రారంభం కావడం, తర్వాత నిలిచిపోవడం ఏడాదిన్నరగా ఇదే తంతు కొనసాగుతూ పరిస్థితి అస్తవ్యస్తంగా మారింది. అయితే ప్రస్తుతం ఈ ఐటీఎంసీ(ITMS) ప్రాజెక్టు పనుల్లో కదలిక వస్తోంది. ఇటీవల నగర సీపీగా వచ్చిన రాజశేఖర్‌బాబుకు ట్రాఫిక్ ఇబ్బందులపై వినతులు రాగా ఐటీఎంసీపై దృష్టి సారించారు. పనులు త్వరగా ప్రారంభించి వేగంగా పూర్తి చేయాలని గుత్తేదారు సంస్థ ఎస్పీటీ(SPT) నెట్వర్క్స్‌కు సీపీ లేఖ రాశారు. నగర పాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్రతో మాట్లాడి కాంట్రాక్టర్లుల బిల్లుల సమస్య పరిష్కరించాలని కోరారు. రెండు శాఖలు చిత్తశుద్ధితో సాగి ప్రాజెక్టు పూర్తి చేస్తే ట్రాఫిక్ సమస్య కొంత తీరే అవకాశముంది.