People Fear Mining of Uranium Deposits in Forest Area in Kurnool District : 'యురేనియం' పేరు చెబితేనే ఆ గ్రామం వణికిపోతుంది. గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతంలో యురేనియం నిక్షేపాల తవ్వకాలు చేస్తారన్న సమాచారంతో గ్రామస్థులకు కంటిమీద కునుకులేదు. ఎప్పుడు ఏం జరుగుతుందోనని భయం భయంగా గడుపుతున్నారు. యురేనియం వెలికితీతకు అనుమతులు నిలిపివేయకుంటే 'అణు'ముప్పు తప్పదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
గ్రామస్థుల పాలిట శాపంగా : ఎంతో ప్రమాదకరమైన అణు ధార్మిక పదార్థం 'యురేనియం' తవ్వకాలను ప్రపంచంలోని అనేక దేశాలు నిలిపివేయగా భారత్‌లో మాత్రం వీటికి అనుమతులు ఇస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. ఇప్పుడిదే కర్నూలు జిల్లా దేవనకొండ మండలం కప్పట్రాళ్ల గ్రామస్థుల పాలిట శాపంగా మారింది. కప్పట్రాళ్ల అటవీ ప్రాంతంలో యురేనియం నిల్వలను వెలికితీసేందుకు కసరత్తు జరుగుతోంది. ఈ మేరకు అటామిక్ మినరల్ డైరెక్టరేట్ ఆఫ్ ఎక్స్‌ఫ్లోరేషన్ అండ్ రీసెర్చ్ 68 బోర్ల తవ్వకాలకు ప్రతిపాదనలు పంపగా కేంద్రం నోటిఫికేషన్ కూడా ఇవ్వడం గ్రామస్థుల్లో అలజడి రేపుతోంది.
భయం'కరి' విధ్వంసం - తరచూ ప్రమాద ఘంటికలు - 'కుంకీలను పంపించండి'
బోర్ వెల్స్ వేసేందుకు ప్రతిపాదనలు : ఆదోని రేంజ్ పత్తికొండ సెక్షన్ పరిధిలోని కప్పట్రాళ్ల రిజర్వు ఫారెస్ట్ పరిధిలో 468.25 హెక్టార్ల అటవీ శాఖకు చెందిన భూములు ఉన్నాయి. కౌలుట్లయ్య మలగా పిలిచే ఈ రిజర్వు ఫారెస్ట్ కప్పట్రాళ్ల, పి.కోటకొండ, మాదాపురం, చెల్లెలచెలిమిల, గుండ్లకొండ గ్రామాల మధ్య విస్తరించింది. ఆ కొండపైనే కౌలుట్లయ్య స్వామి ఆలయం ఉంది. ఈ ప్రదేశంలోనే సర్వే కోసం అనుమతులు వచ్చాయని ప్రచారం జరుగుతోంది.
పల్లెలు నాశనమవుతాయంటున్న ప్రజలు : భూగర్భంలో ఎంత పరిమాణంలో యురేనియం నిల్వలున్నాయో నిర్ధరించిన తర్వాతే తవ్వకాలు జరుపుతారు. కప్పట్రాళ్ల కేంద్రంగా యురేనియం ఎంత ఉంది? ఎంత లోతులో ఉంది? తవ్వితే లాభమా? కాదా? వంటి వివరాలు తెలుసుకునేందుకు 68 బోర్లు డ్రిల్లింగ్ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతులిచ్చినట్లు తెలుస్తోంది. అటవీ భూముల్లో తవ్వకాలు జరపాల్సి ఉండటంతో పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖ అనుమతి తప్పనిసరి. 6.80 హెక్టార్ల అటవీ భూమిలో బోర్ వెల్స్ వేసేందుకు కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ సలహా మండలి ఆమోదం కోసం ఏఎండీ రీజనల్ డైరెక్టర్ ప్రతిపాదనలు పంపారు.
కాసులు కురిపిస్తున్న టమాటా - అప్పులు తీరిపోతాయని అన్నదాతల ఆనందం
అడ్డుకుంటామని హెచ్చరిక : ఈ ప్రక్రియ వైఎస్సార్సీపీ సర్కార్ హయాంలో 2022-23 మధ్య కాలంలోనే జరిగింది. కానీ ఈ విషయం బయటకు పొక్కకుండా గుట్టుగా కొనసాగించారు. ఇప్పుడు ఈ సమాచారం తెలిసి స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. యురేనియం తవ్వకాలతో పల్లెలు నాశనమవుతాయని కప్పట్రాళ్ల సర్పంచ్ చెబుతున్నారు. ప్రాణాలు పోయినా సరే యురేనియం తవ్వకాలను అడ్డుకుంటామని హెచ్చరిస్తున్నారు.
రైతుల ఆకలి తీర్చే క్యాంటీన్లు - హోటళ్లకు దీటుగా 15 రూపాయలకే భోజనం