Pensions Distribution Issue in AP : పింఛన్ల పంపిణీలో వైసీపీ నీచ రాజకీయాలకు పాల్పడుతోందని టీడీపీ నేతలు మండిపడ్డారు. వైసీపీ ప్రభుత్వం పింఛన్ పంపిణీ విషయంలో శవరాజకీయాలు చేస్తుందని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి విమర్శించారు. పింఛన్ విషయంలో ఎన్నికల కమిషన్ వాలంటీర్లను వద్దని చెప్పిందని, ఇతర శాఖలు అధికారులను వాడుకోకుండా వైసీపీ ప్రభుత్వం రాజకీయాలు చేస్తుందని విమర్శించారు. వృద్ధులను మంచాల మీద సచివాలయాలకు తీసుకురావాల్సిన అవసరం ఏముందని నిలదీశారు. రెండు వందల పింఛను రెండు వేలు చేసింది చంద్రబాబు అని అన్నారు.
అధికారంలోకి వచ్చిన వెంటనే చంద్రబాబు నాలుగు వేల రూపాయలు పింఛను ఇస్తారని చెప్పారు. వైసీపీ నాయకుల బెదిరింపులకు వాలంటీర్లు భయపడి రాజీనామాలు చేయొద్దని తెలిపారు. వాలంటీర్లను యథావిధిగా చంద్రబాబు కొనసాగిస్తారని చెప్పారు. రాజీనామాలతో భవిష్యత్తు నాశనం చేసుకోవద్దని సూచించారు. సినిమా టిక్కెట్లు, మద్యం సీసాలు ఉద్యోగుల ద్వారా విక్రయించారని, ఉద్యోగుల ద్వారా దివ్యాంగులు, వృద్ధుల ఇళ్లకు పింఛను ఎందుకు పంపడం లేదు అని ప్రశ్నించారు.
ప్రజలు గట్టి గుణపాఠం చెబుతారు: పేదలకు పింఛన్ అందకుండా చేసే వైసీపీ కుట్రలను అడ్డుకుంటామని అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ స్పష్టం చేశారు. జగన్ పైశాచికత్వానికి చంద్రబాబు పోరాటతత్వానికి మధ్య జరిగే పోరులో ప్రజలు తమ వెంటే ఉన్నారని అన్నారు. తెలుగుదేశం ధ్యేయం పేదల సంక్షేమం, వైసీపీ లక్ష్యం శవ రాజకీయమని మండిపడ్డారు. ప్రతీ ఎన్నికల మాదిరిగానే ఈసారి వైసీపీ తన శవ రాజకీయాలకు అవ్వాతాతలను బలి కోరుతోందని గొట్టిపాటి రవి విమర్శించారు. పేదలకు పింఛన్ ఇప్పించే విషయంలో ఎందాకైనా పోరాడతామన్నారు. పింఛన్ పంపిణీలో పేదల్ని ఇబ్బంది పెట్టి పైశాచిక ఆనందం పొందుతున్న జగన్‌కి ఎన్నికల్లో ప్రజలు గట్టి గుణపాఠం చెప్తారని రవికుమార్ హెచ్చరించారు.
వాలంటీర్ వ్యవస్థకు టీడీపీ వ్యతిరేకం కాదు: స్వార్థ రాజకీయాల కోసం వైసీపీ అబద్ధపు ప్రచారాలు చేస్తోందని టీడీపీ జీవీ ఆంజనేయులు మండిపడ్డారు. ఎన్నికల్లో లబ్ధి కోసం అవ్వాతాతలను జగన్ ఏడిపిస్తున్నారని, వాలంటీర్ వ్యవస్థకు టీడీపీ ఎప్పుడూ వ్యతిరేకం కాదని తెలిపారు. రాజకీయ కార్యకలాపాలకు దూరంగా ఉంచాలనే చెప్పామన్నారు. కూటమి ప్రభుత్వం రాగానే ఇంటికే నెలకు రూ.4 వేల పింఛను ఇస్తామని చెప్పారు. జగన్, వైసీపీ తప్పుడు ప్రచారాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. పింఛన్లను అడ్డుపెట్టుకొని వైసీపీ కుట్ర రాజకీయం చేస్తోందని, కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించి వృద్ధులకు పింఛన్ ఎగ్గొట్టాలనేది జగన్ కుట్ర అని టీడీపీ నేత కనుమూరి బాజిచౌదరి విమర్శించారు. ప్రతి రంగాన్ని వైసీపీ ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని విమర్శించారు.
తక్షణమే ఇంటి వద్దకే పెన్షన్ పంపాలి: వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులకు సచివాలయ సిబ్బంది ద్వారా ఇంటి వద్దే పెన్షన్ అందించే కార్యక్రమాన్ని చేపట్టాలని టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి బాపట్ల ఎంపీ అభ్యర్థి తెన్నేటి కృష్ణ ప్రసాద్ డిమాండ్ చేశారు. ఈ విషయమై పార్టీ శ్రేణులతో కలిసి కలెక్టర్ రంజిత్ బాషాకు వినతి పత్రం అందజేశారు. సచివాలయాల వద్దకు వెళ్లి పెన్షన్ తీసుకోవాలని ప్రభుత్వం చెప్పటం సరికాదని బాపట్ల ఎమ్మెల్యే అభ్యర్థి వేగేశ్వరరావు నరేంద్ర వర్మ అన్నారు. వేసవి తీవ్రత వల్ల అనారోగ్యంతో ఉన్నవారు సచివాలయాల వద్దకు వెళ్లలేరన్నారు. ప్రభుత్వం వారి జీవితాలతో ఆటలాడుకోకుండా తక్షణమే ఇంటి వద్దకే పెన్షన్ పంపాలన్నారు.
శవ రాజకీయాలు చేయడం జగన్ రెడ్డికి అలవాటుగా మారిపోయిందని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిల్లి మాణిక్యరావు మండిపడ్డారు. కోడ్ ఉల్లంఘిస్తున్న మంత్రి జోగి రమేష్‌పై ఎలక్షన్ కమిషన్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. జోగి రమేష్ కుట్రలను పెనమలూరు ప్రజలు తిప్పికొట్టాలని విజ్ఞప్తి చేశారు. అర్హులకు పెన్షన్ అందించే బాధ్యత ప్రభుత్వానిదే అని స్పష్టం చేశారు.