Payments Delay Grain Sold at Rythu Bharosa Centres: ధాన్యం కొనుగోలు చేసిన తర్వాత 21 రోజుల్లోనే రైతుల ఖాతాల్లో డబ్బులు వేస్తాం! ఇదీ వైఎస్సార్సీపీ సర్కారు గొప్పగా చేసిన ప్రకటన. 21 రోజులు కాదు కదా, నెలన్నర దాటినా ఇంకా సొమ్ములు అందలేదని పలు జిల్లాల్లో అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేసుకున్నారు. ఖరీఫ్‌లో తెచ్చిన అప్పులు చెల్లించాల్సి ఉందని రబీ పంటలకు పెట్టుబడికి కష్టమవుతోందని కర్షకులు వాపోతున్నారు. రైతు భరోసా కేంద్రాల ద్వారా విక్రయించిన ధాన్యానికి వెంటనే డబ్బులు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు.
నగదు చెల్లింపులో తీవ్ర జాప్యం: జగన్ సర్కార్ మాటలకు, చేతలకు ఎప్పుడూ సంబంధం ఉండదు. ధాన్యం డబ్బుల చెల్లింపులలోనూ ఇదే జరుగుతోంది. 21 రోజుల్లోనే రైతు బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమ చేస్తామన్న ఆర్భాటపు ప్రకటనలు ఆచరణలోకి రావడం లేదు. ఫలితంగా రైతులు ధాన్యం డబ్బుల కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి. కృష్ణా జిల్లాలో ఈ ఏడాది జనవరి 19 తర్వాత ధాన్యం విక్రయించిన రైతుల ఖాతాలోనూ నగదు జమ కాలేదు. కృష్ణా జిల్లాలో ఖరీఫ్ ధాన్యాన్ని గత ఏడాది నవంబర్ 15 నుంచి ఇప్పటివరకు రైతు భరోసా కేంద్రాల ద్వారా 55 వేల 273 మంది అన్నదాతలు నాలుగు లక్షల 84వేల టన్నులు విక్రయించారు. వెయ్యి 61 కోట్ల రూపాయల నగదు కర్షకుల ఖాతాల్లో జమ కావాల్సి ఉంది. జనవరి 19వ తేదీకి ముందు ధాన్యం విక్రయించిన 39వేల 907 మంది రైతుల ఖాతాల్లో 759.60 కోట్లు జమయ్యాయి. జనవరి 19 తర్వాత విక్రయించిన రైతులకు 40 రోజులుగా నగదు చెల్లింపులో తీవ్ర జాప్యం జరుగుతోంది. ఒక్క కృష్ణా జిల్లాలోనే 15 వేల 366 మంది రైతులకు 302 కోట్ల రూపాయల నగదు చెల్లించాల్సి ఉంది.
'జగన్‌రెడ్డికి రైతుల కష్టాలు కనిపించడం లేదా?- నాలుగు నెలలైనా ధాన్యం డబ్బులేవీ?'
ఆశలు అడియాసలు: ఏలూరు జిల్లాలోనూ ఇదే పరిస్థితి. గతేడాది డిసెంబరులో వచ్చిన మిగ్ జాం తుపాను వల్ల తీవ్రంగా పంట నష్టపోయిందని కాస్తో కూస్తో వచ్చిన ధాన్యాన్ని సర్కారుకు విక్రయిస్తే ఇంకా డబ్బులు ఇవ్వడంలేదని వాపోతున్నారు. పెదపాడు మండలంలో మిగ్ జాం తుపానుతో భారీ నష్టం వాటిల్లింది. ధాన్యం సొమ్ము వస్తే కాస్తా కోలుకోవచ్చని భావిస్తే తమ ఆశలు అడియాసలు అవుతున్నాయని అన్నదాతలు లబోదిబోమంటున్నారు. పెదపాడు మండలంలోనే దాదాపు 7 కోట్ల వరకు ధాన్యం బకాయిలు రావాల్సి ఉంది. కౌలు రైతులు పరిస్థితి మరింత దుర్భరంగా మారిపోయింది. గతంలో దళారులు, మిల్లర్ల చేతులో తీవ్రంగా నష్టపోయే వాళ్లమని, ఇప్పుడు ప్రభుత్వం సైతం అలాగే చేస్తే తమకు ఎవరు దిక్కని అన్నదాతలు ప్రశ్నిస్తున్నారు.