Passengers Problems Due to RTC Buses Diversion: ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సిద్ధం సభకు వేలాదిగా ఆర్టీసీ బస్సులు తరలించడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. చుట్టపక్కల 8 జిల్లాల నుంచి భారీగా ఆర్టీసీ బస్సులను అనంతపురం రాప్తాడు సభకు కేటాయించడంతో దూర ప్రయాణాలు చేసే వారికి నరకం కనిపించింది. అన్ని ఆర్టీసీ డిపోల్లో 50 నుంచి 80 శాతం బస్సులు జగన్ సేవకు తరలడంతో ఆర్టీసీ బస్టాండ్లలో ఉదయం నుంచి ప్రయాణికులకు చుక్కలు కనిపించాయి. గంటలు తరబడి వేచి చూడలేక ప్రైవేట్ వాహనానల్లోనైనా వెళ్దామనుకున్న ప్రయాణికులకు దారి మళ్లింపు చర్యలు, పెనంపై నుంచి పొయ్యిలో పడినట్లుగా మారింది.
కడప జిల్లా : ముఖ్యమంత్రి సభ కోసం కడప జిల్లా వ్యాప్తంగా 280 బస్సులను ఏర్పాటు చేశారు. జిల్లా వ్యాప్తంగా 530 బస్సులు ఉండగా అందులో 280 బస్సులను ముఖ్యమంత్రి సభకు పంపించడంతో ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడ్డారు. ప్రజా సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని ఆర్టీసీ బస్సులను నడపాల్సిన అధికారులు ప్రయాణికులను గాలికి వదిలేసి ముఖ్యమంత్రి సభకు బస్సులను పంపించడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శనివారం మధ్యాహ్నం నుంచి బస్సు సర్వీసులు లేక ప్రయాణికులు తీవ్ర అగచాట్లు పడ్డారు.
వృద్ధులు, చిన్నారులు, మహిళల అవస్థలు అన్నీ ఇన్నీ కాదు. బస్సులు లేకపోవడంతో ప్రయాణికులు ఆటోలను, ప్రైవేటు వాహనాలను ఆశ్రయించాల్సి వచ్చింది. ఇదే అదునుగా భావించి ప్రైవేట్ వాహనాలు ప్రయాణికుల నుంచి అధిక మొత్తంలో డబ్బులను వసూలు చేశారు. చిత్తూరు, నెల్లూరు, తిరుపతి, అనంతపురం, కర్నూల్ తదితర ప్రాంతాలకు వెళ్లే బస్సులు గంటల తరబడి రాకపోవడంతో ప్రయాణికులు బస్టాండ్లోనే పడిగాపులు కాయాల్సి వచ్చింది.
సీఎం సభ కోసం దారి మళ్లింపు- వందల కి.మీ చుట్టూ తిరిగెళ్లాల్సి వస్తోందని లారీ డ్రైవర్ల గగ్గోలు
తిరుపతి జిల్లా: తిరుపతి జిల్లాకు సంబంధించి 374 బస్సులు తరలించడంతో తిరుపతి కేంద్రీయ బస్ స్టేషన్ నుంచి వివిధ ప్రాంతాలకు చేరుకోవాల్సిన యాత్రికలు, ప్రయాణికులు నిరీక్షించాల్సిన పరిస్థితి నెలకొంది. వచ్చే అరకొర బస్సుల కోసం ప్రయాణికులు ఎగబడడంతో తోపులాట చోటుచేసుకుంది. ప్రధానంగా తిరుపతి నుంచి తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలలోని వెల్లూరు, తిరువణ్ణామలై, కంచి, బెంగళూరు యాత్రికులు గంటలకొద్దీ బస్టాండ్లోని వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ప్రకాశం జిల్లా: సీఎం సభకు సుదూరంగా ఉన్న ప్రకాశం జిల్లా నుంచి కూడా బస్సులను తరలించడం చర్చనీయాంశం అయింది. ప్రకాశం జిల్లాలోని ఏడు ఆర్టీసీ బస్సు డిపోల నుంచి 135 బస్సులను కేటాయించారు. ఒంగోలు డిపో నుంచి అత్యధికంగా 40 బస్సులను తరలించారు. బస్సులు ఇతర జిల్లాలకు తరలించడం వల్ల ప్రయాణికులు ఇబ్బందులకు గురయ్యారు. బస్సుల గురించి ప్రయాణికులు ఆర్టీసీ సిబ్బందిని పలుమార్లు అడిగినా వాళ్లు స్పందించలేదని ప్రయాణికులు వాపోయారు. ఎప్పుడు వస్తుందో కూడా చెప్పలేదని ఆర్టీసీ సిబ్బందిపై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
బాపట్ల జిల్లా: బాపట్ల జిల్లా చీరాల ఆర్టీసీ డిపోలో అరకొరగా ఉన్న ఆర్టీసీ బస్సులతో ప్రయాణికులు తీవ్ర ఆగచాట్లు పడ్డారు. చీరాల డిపో నుంచి 15 ఆర్టీసీ బస్సులు సీఎం సభకు తరలించారు. దీంతో చీరాల డిపో నుంచి ఇంకొల్లు, పెదగంజాం, స్వర్ణ, రేపల్లె, నిజాంపట్నంకు బస్సు లేక ప్రయాణికుల ఇబ్బందులు పడ్డారు. బస్సులు లేకపోవడంతో అధికార పార్టీపై ప్రయాణికులు తీవ్ర విమర్శలు చేస్తున్నారు.
అనంతపురం జిల్లా: బస్టాండ్ ఆవరణలో దూర ప్రాంతాల నుంచి వచ్చిన వారికి ఉదయం ఒక్క బస్సు కూడా లేకపోవడంతో కొంతమంది ప్రయాణికులు ఆటోలలో తమ సమీప ప్రాంతాలకు వెళ్లాల్సి వచ్చింది. అనంతపురం జిల్లా 90 శాతం బస్సులు రాప్తాడు వైసీపీ సిద్ధం సభకు జనాన్ని తరలించారు. దీంతో అనంతపురం బస్టాండ్లో బస్సులు లేక ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వచ్చింది. ఉదయం నుంచి బస్సుల కోసం వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది.
శ్రీ సత్యసాయి జిల్లా: శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర నియోజకవర్గం నుంచి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేపట్టిన సిద్ధం సభకు జనాన్ని తరలించేందుకు పెద్ద సంఖ్యలో ఆర్టీసీ, ప్రైవేట్, స్కూల్ బస్సులను సిద్ధం చేశారు. మడకశిర నుంచి రాప్తాడు సిద్ధం సభకు ఉదయం బయలుదేరిన అధిక బస్సుల్లో జనం లేక ఖాళీగానే సభకు వెళ్లాయి. మరోపక్క మడకశిర నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లేందుకు బస్సుల సౌకర్యం లేక ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఆటోలలో వారీ గమ్యస్థానాలకు తరలి వెళ్లారు. ఆర్టీసీ బస్సులు లేకుండా తీవ్ర ఇబ్బందులకు గురి చేయడంపై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
కదిరి ఆర్టీసీ బస్టాండ్లోనూ గంటల తరబడి ప్రయాణికులు బస్సుల కోసం నిరీక్షించాల్సి వచ్చింది. చంటి పిల్లలు, వృద్ధులు బస్టాండ్లో ఎదురు చూడలేక అవస్థల పాలయ్యారు. 110 బస్సులు ఉన్న కదిరి ఆర్టీసీ డిపోలో 72 బస్సులను ముఖ్యమంత్రి పర్యటనకు కేటాయించారు. మిగిలిన బస్సులు విజయవాడ ,హైదరాబాద్, బెంగళూరు ప్రాంతాలకు సర్వీసులు నడవడంతో ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సిన వందలాది ప్రయాణికులు బస్టాండ్లోనే ఉండి పోవాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు.
జగన్ సేవకు అంకితమైన ఆర్టీసీ- సామాన్య జనానికి చుక్కలు చూపిస్తోన్న వైఎస్సార్సీపీ
కర్నూలు బస్టాండ్లో ఆర్టీసీ బస్సులు లేక ప్రయాణికులు తీవ్ర ఇబ్బంది పడ్డారు. అనంతపురం జిల్లా రాప్తాడులో సిద్ధం సభకు కర్నూలు నుంచి పెద్ద సంఖ్యలో ఆర్టీసీ బస్సులు తరలించారు. కోసం ప్రయాణికులు గంటలు తరబడి వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రయాణికులను ఇబ్బంది పెట్టి మరీ ముఖ్యమంత్రి సభకు బస్సులు తరలించడం ఏంటని ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
సీఎం సభకు బస్సులన్నీ తరలించడంతో కర్నూలు జిల్లా ఆదోని బస్టాండు బోసిపోయింది. గమ్యస్థానాలకు వెళ్లేందుకు బస్టాండ్లు, రోడ్లపై గంటల కొద్దీ ప్రయాణికులు నిరీక్షించాల్సి వచ్చింది. అరకొరగా ఉన్న బస్సులతో రద్దీ ఏర్పడింది. ప్రభుత్వ తీరుతో విసుగెత్తిన ప్రజలు ముఖ్యమంత్రి జగన్, వైసీపీ నేతలపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ప్రత్యామ్నాయ బస్సులు ఏర్పాటు చేయకుండా ప్రయాణికులను ఇబ్బంది పెట్టడం మంచిది కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
సీఎం సభ కోసం వేలాది ఆర్టీసీ బస్సులు తరలింపు- ఎక్కడి ప్రయాణికులు అక్కడే!