Jeevanji Deepthi Wins Bronze Medal in Paralympics 2024 : పారిస్ పారాలింపిక్స్‌లో రాణించినా, ఫైనల్లో అత్యుత్తమ ప్రదర్శన కనబరచలేకపోయాయని ఈనాడు సీఎస్ఆర్ కార్యక్రమం లక్ష్య క్రీడాకారిణి జీవాంజి తెలిపారు. అందుకే కాంస్య పతకం వచ్చిందని చెప్పారు. మహిళల టీ20 400 మీటర్ల పరుగులో కాంస్యం గెలుచుకుని గురువారం స్వదేశానికి వచ్చారు. అనంతరం ఆమెను కేంద్ర క్రీడల మంత్రి మన్సుఖ్ మాండవీయ సత్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన క్రీడాకారులు తమ నైపుణ్యాన్ని ప్రదర్శించి దేశం గర్వపడేలా చేశారన్నారు.
శుక్రవారం ఉదయం ఆమె హైదరాబాద్‌కు చేరారు. విమానాశ్రయంలో తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యంలో వారికి ఘనస్వాగతం పలికారు. అనంతరం సాట్ ఛైర్మన్ శివసేన రెడ్డి కోట్ నాగపురి రమేశ్, దీప్తిని అభినందించారు. తెలంగాణ బిడ్డ దేశానికి పతకం తీసుకురావడం గర్వంగా ఉందని శివసేన రెడ్డి అన్నారు. తర్వాత వారు గోపిచంద్ అకాడమీ బయలుదేరారు.
"కాంస్య పతకం గెలవడం చాలా గర్వంగా ఉంది. నాకు కాస్త అనారోగ్యంగా ఉండటం వల్ల తృటిలో బంగారు పతకం చేజారింది. భవిష్యత్‌లో బంగారు పతకం సాధిస్తా. ఈనాడు లక్ష్య కార్యక్రమం నాకు చాలా ఉపయోగపడింది. ఈనాడుకు ప్రత్యేక ధన్యవాదాలు. నా కోచ్, తల్లిదండ్రులు నా విజయానికి పూర్తిగా సహకరించారు. అందరికీ ధన్యవాదాలు. 8 ఏళ్ల కఠోర శ్రమకు ఫలితం దక్కింది. రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు." - దీప్తి జీవాంజి, పారా అథ్లెట్
దేశంలోనే టీ20 400మీటర్ల పతకం సాధించిన మొదటి మహిళ దీప్తి తెలంగాణ బిడ్డ కావడం మనందరికి గర్వకారణమని సాట్ ఛైర్మన్ శివసేన రెడ్డి అన్నారు. 2028లో గోల్డ్ మెడల్ సాధించే దిశగా అడుగులు వేస్తామన్నారు. వచ్చే ఒలింపిక్స్‌లో విద్యార్థులను మెడల్స్ సాధించే దిశగా సాట్ పని చేస్తుందని తెలిపారు. అందరికి కావాల్సిన సదుపాయాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. అలాగే దీప్తి చాలా పేద కుటుంబం నుంచి వచ్చిన అమ్మాయని చెప్పారు. తను అడిగిన వాటిపై ముఖ్యమంత్రి రేవంత్ దృష్టికి తీసుకువెళ్లారని ఆయన దానికి సానుకూలంగా స్పందించారని తెలిపారు.