Paiditalli Ammavari Devara Utsavam in Vizianagaram : ఉత్తర ఆంధ్రుల ఆరాధ్యదైవం విజయనగరం పైడితల్లి దేవరోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. సోమవారం (మే 20న) సాయంత్రం 4.30 గంటలకు ఆలయ సహాయక కమిషనర్ డి.వి.వి.ప్రసాదరావు అమ్మవారి దేవరోత్సవాలను ప్రారంభించారు. స్థానిక రైల్వేస్టేషన్ సమీపంలోని వనంగుడిలో కొలువుదీరిన పైడితల్లి అమ్మవారికి నిత్య సేవకులు, ఆలయ అర్చకులు, వేదపండితుల మంత్రోచ్ఛారణల నడుమ విశేష పూజలు, అభిషేకాలు జరిగాయి. ఈ నేపథ్యంలోనే ఉత్సవ విగ్రహాన్ని ప్రత్యేక రథంపై ఊరేగింపుగా హుకుంపేటకు తీసుకొచ్చారు.
దారి పొడవునా భక్తులు పైడితల్లి అమ్మవారికి మొక్కులు చెల్లించారు. హుకుంపేట చేరిన తరువాత అమ్మవారి ఘటాలను పూజించారు. వాటిని అర్ధరాత్రి తరువాత మూడు లాంతర్ల వద్దనున్న చదురుగుడిలో ఆలయ అధికారులు ప్రతిష్ఠించారు. అంతకుముందు పెద్ద చెరువులోని మట్టిని పైడితల్లి పాదాలకు పెట్టారు. నేటి (మే 21న) నుంచి సిరిమాను సంబరం అనంతరం జరిగే ఉయ్యాల కంబాల ఉత్సవం నాడు తిరిగి అమ్మవారిని వనంగుడికి తరలిస్తారని ఆలయ అర్ఛకులు పేర్కొన్నారు.
చదురుగుడిలోని అమ్మవారికి మంగళవారం (మే 21న) నుంచి ప్రత్యేక పూజలను ఆలయ అధికారులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిరిమాను పూజారి బంటుపల్లి వెంకటరావు, దేవస్థానం సిబ్బంది ఏడుకొండలు, మణికంఠ, రామతీర్థం ఉద్యోగి రామారావు, అమ్మవారి నిత్య సేవకులు తదితరులు పాల్గొన్నారు. అమ్మవారి ఊరేగింపులో శక్తి వేషాలు, మేళతాళాలు, కోలాటాలు, విచిత్ర వేషధారణలు, తప్పెటగుళ్లు ఆకట్టుకున్నాయి.
అంగరంగ వైభవంగా సింహాద్రి అప్పన్న స్వామి వారి స్వర్ణ పుష్పార్చన ఉత్సవం
పైడితల్లి అమ్మవారి జాతరలో సిరిమానోత్సవం కీలకమైన ఘట్టం. ఈ ఉత్సవంలో భాగంగా ఒక పొడుగాటి గడ చివర ఒక పీఠాన్ని తగిలించి ఆ కుర్చీలో పూజారి కూర్చొని అమ్మవారి గుడి చుట్టూ ప్రదక్షిణ చేయడం ప్రత్యేకం. ఈ ఘట్టాన్ని తిలకించేందుకు అసంఖ్యాకమైన భక్తులు వస్తారు. ఏటా ఇక్కడికి వచ్చే భక్తుల సంఖ్య వేలల్లో ఉంటుంది. సిరిమానోత్సవంలో జాతరలో తెల్ల ఏనుగుకు ప్రత్యేక స్థానం ఉంది. ఈ కార్యక్రమంలో గజపతులు వారి ప్రాభవాన్ని ప్రతిబింబించే విధంగా పట్టపుటేనుగు ఆకారంలో ఒక బండిని రూపొందించి సిరిమాను ముందు నడిపిస్తారు. ఈ బండి మీద 7 స్త్రీలు, 1 పురుఘడు ఉంటారు. 7 మంది స్త్రీలు పైడితల్లి అక్కచెల్లెళ్లుగా, వీరందరికి ఏకైక సోదరుడు పోతురాజుగా భక్తుల ప్రగాఢ నమ్మకం.