Middle class people own house dream remaining as Dream : సామాన్య ప్రజలు కొనుగోలు చేసే ధరల్లో ఇళ్ల నిర్మాణాలు తగ్గిపోవడంతో ఆయా వర్గాలను ఆందోళనకు గురిచేస్తోంది. దేశవ్యాప్తంగా ఈ సమస్య ఉంటోంది. రాష్ట్ర ప్రభుత్వాలు పేదవారి కోసం వివిధ పథకాల కింద గృహ నిర్మాణం చేపడుతున్నాయి. సంపన్నులు ప్రీమియం ఇళ్లను కొనుగోలు చేస్తున్నారు. కానీ మధ్యలో వర్గాలు మాత్రం ఇల్లు కొనలేక సతమతమవుతున్నాయి. కేంద్రం ఇంతకముందే ప్రవేశపెట్టిన పీఎంఏవై గృహరుణ ఆధారిత వడ్డీ సబ్సిడీతో కొనుగోలుదారులకు భారం తగ్గి ఈఎంఐ చెల్లింపుల్లో కొంత వెసులుబాటు లభించేది. ఈ పథకం ఎంఐజీ విభాగంలో 1800 చదరపు అడుగుల విస్తీర్ణం చేసినప్పుడు ఎక్కువగా ప్రయోజనం పొందారు. ఇప్పుడు ఇది ఎల్‌ఐజీ వరకే పరిమితమైంది.
ఈ నేపథ్యంలో పథకాన్ని విసరిస్తే మధ్యతరగతి ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుందని చాలా కాలంగా డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. నగరంలో హౌసింగ్ బోర్డుల ఆధ్వర్వంలో ఇంటి నిర్మాణం చేపట్టినప్పుడు అన్ని వర్గాలను దృష్టిలో ఉంచుకుని కాలనీలను నిర్మించేవారు. అధిక, మధ్య తక్కువ అదాయ వర్గాలుగా హెచ్‌ఐజీ, ఎంఐజీ, ఎల్‌ఐజీగా విభజించి ఇళ్లను, స్థలాలను విక్రయించేవారు. అవసరమైతే ఆయా వర్గాల్లోనూ ఒకటి రెండుగా విభజన చేసి అందరినీ సొంతింటిని చేరువ చేసేవారు.
ఈ క్రమంలో డిమాండ్‌కు తగ్గట్లుగా కొనుగోలుదారుల అవసరాలకు అనుకూలంగా నిర్మాణాలు చేయడంతో హౌసింగ్ బోర్డులు వెనుకబడి ప్రైవేట్ రంగం విజృంభించింది. మొదట్లో అన్ని వర్గాలకు అందుబాటులో ఉన్న ఇళ్ల నిర్మాణం చేపట్టినా ఆ తర్వాత డిమాండ్ ఉన్న ప్రీమియం ఇళ్లవైపు రియల్ ఎస్టేట్ మొగ్గింది. భూముల ధరలు కూడా పెరగడంతో సరసమైన ధరల ప్రాజెక్టులు చేపట్టలేకపోతున్నామని బిల్డర్లు అంటున్నారు. విలాసవంతమైన ఇళ్ల నిర్మాణం చేపడితే విక్రయాలు బాగుంటున్నాయని చెబుతున్నారు. భూముల ధరల పెరుగుదలతో చదరపు అడుగు ధర ఆ మేరకు పెరుగుతోందని అంటున్నారు.
ఎందుకని కొనలేకపోతున్నారు ?
మధ్యతరగతి వర్గాల్లో ఎక్కువ మంది గృహరుణం ద్వారానే ఇల్లు కొంటుంటారు. కరోనా సమయంలో ఆర్‌బీఐ రెపో రేటు 4 శాతం ఉంది. ప్రస్తుతం 6.5 శాతంగా ఉంది. దీని ఫలితంగా 2022 మే నుంచి వడ్డీరేట్లు పెరిగి రుణ లభ్యత తగ్గిపోయింది. ఇదే ప్రధాన సవాల్‌గా మారిందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. భూముల ధరలు పెరగడం, ఆ మేరకు ఇంటి ధరలు పెంచాల్సి రావడంతో అందుబాటు ధరల్లోఇళ్ల లభ్యత తగ్గిపోయింది.
ఒకవేళ నిర్మించినా
ఎవరైనా బిల్డర్ ముందుకొచ్చి సరసమైన ధరల ఇళ్ల నిర్మాణం చేపడితే వాటిని విక్రయించడమే పెద్ద సవాల్‌గా మారిందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. ఆయా వర్గాల్లో కొనుగోలు చేసే శక్తి లేకపోవడమే దీని కారణమని అంటున్నాయి. కొంతమందే కొనుగోలు చేస్తున్నారని చెబుతున్నాయి. నైట్ ఫ్రాంక్ ఇండియా నివేదిక ప్రకారం 50 లక్షల రూపాయల లోపు ఉన్న ఇళ్ల విక్రయానికి 8.2 త్రైమాసికాలు పడుతోంది. 50 లక్షల రూపాయల నుంచి రూ.కోటి లోపు ఇళ్ల విక్రయాలకు 4.8 త్రైమాసికాలు, కోటి రూపాయలపైన ధరకు విక్రయిస్తున్న ఇళ్లకు 4.9 త్రైమాసికాలు పడుతోంది. ఈ నేపథ్యంలో ఎక్కువ మంది బిల్డర్లు డిమాండ్ ఉన్న ప్రీమియం ఇళ్ల నిర్మాణం చేపడుతున్నారు.
ఎంత ప్రభావం పడుతుంది?
- 3 లక్షల రూపాయల వార్షికాదాయం ఉన్న వ్యక్తి రూ.13.5 లక్షల గృహరుణం తీసుకుంటే 7.25 శాతం వడ్డీతో ఈఎంఐ రూ.10,670 అవుతుంది. వార్షిక ఆదాయంలో 43 శాతం ఈఎంఐకే వెళుతుంది.
- 9.2 శాతానికి వడ్డీరేట్లు పెరిగితే ఈఎంఐ రూ.12,320 అవుతుంది. దీంతో ఆదాయంలో 49 శాతం ఈఎంఐ కిందే చెల్లించాలి.
- వడ్డీరేట్లతో పాటూ ఇళ్ల ధరలు కూడా పెరిగితే అధిక రుణం తీసుకోవాలి. రూ.16.87 లక్షల రుణం తీసుకుంటే ఈఎంఐ రూ.15401 అవుతుంది. అప్పుడు వార్షికాదాయంలో ఈఎంఐకే 62 శాతం కేటాయించాలి. హైదరాబాద్ మార్కెట్లో మూడో పరిస్థితి ఉంది. దీంతో చాలా మంది ఇల్లు కొనలేకపోతున్నారు.
ఇల్లు కొనడానికి ఇదే సరైన సమయం! - ఎందుకో తెలుసా? - Real Estate Market in Hyderabad