Ongole Police Searching for Director Ram Gopal Varma : వివాదాస్పద చిత్రాలు తీసే, వాఖ్యలు చేసే డైరెక్టర్ రామ్‌గోపాల్ వర్మ (RGV) చట్టంతో చెలగాటం కుదరదని గుర్తించారు. 'నా ఇష్ట వచ్చినట్లు సినిమాలు తీస్తా, చూస్తే చూడండి, లేకపోతే లేదంటూ హూంకరించే సినీ దర్శకుడు, ప్రస్తుతం పోలీసులకు చిక్కకుండా తప్పించుకునే దారులు వెతుకుతున్నారు. అచ్చు నేతల పోలికలతో ఉన్న నటులతో ఓ పార్టీకి అనుకూలంగా సినిమాలు తీసి, వాటి ప్రమోషన్ కోసం అప్పటి విపక్ష నేతలైన నారా చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్, లోకేశ్‌లపై నోరు పారేసుకున్నారు. వ్యక్తిగత దూషణలు, మార్ఫింగ్ ఫొటోలతో చిక్కులు తెచ్చుకున్నారు.
అజ్ఞాతంలోకి వర్మ : 1997లో దౌడ్ అనే పేరుతో ఓ సినిమా తెరకెక్కించిన ఆర్జీవీ ప్రస్తుతం పోలీసుల బారి నుంచి తప్పించుకోవడానికి తానే దౌడ్ (పరుగు) తీస్తున్నారు. సామాజిక మాధ్యమాలు, టీవీ షోలలో ఇష్టారీతిన రెచ్చిపోయే వర్మ అకస్మాత్తుగా అజ్ఞాతంలోకి వెళ్లి పోయారు. పోలీసు కేసును ఎదుర్కోవడానికి కనీస ధైర్యం చేయలేకపోతున్నారు.
ఆర్జీవీ ఇంటికి ఏపీ పోలీసులు - అరెస్టుకు రంగం సిద్ధం!
పోలీసుల నోటీసులు - వర్మ సాకులు : అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు నెల రోజుల క్రితం ప్రకాశం జిల్లా మద్దిపాడు పోలీసు స్టేషన్‌లో వర్మపై కేసు నమోదు అయింది. ఆ కేసుకు సంబంధించి విచారణకు హాజరు కావాలంటూ ఒంగోలు గ్రామీణ పోలీసులు తొలిసారి హైదరాబాద్‌లోని వర్మ కార్యాలయం తలుపు తట్టి నోటీసులు అందజేశారు. ఆ మేరకు ఈ నెల 19న ఒంగోలు గ్రామీణ సీఐ శ్రీకాంత్ బాబు ఎదుట విచారణకు హాజరు కావాల్సి ఉంది. కాగా హైకోర్టులో క్వాష్ పిటీషన్ దాఖలు చేశారు.
కోర్టు తిరస్కరణతో వారం రోజులు సమయం ఇవ్వాలని దర్యాప్తు అధికారికి వాట్సాప్ ద్వారా సందేశం పంపారు. తాను ఓ సినిమా చిత్రీకరణలో ఉన్నానని, గతంలో నిర్ణయించిన షెడ్యూల్ కారణంగా తాను వెళ్లకుంటే నిర్మాతకు భారీగా నష్టం వస్తుందని తెలిపారు. వారి నుంచి సమాధానం రాకపోవడంతో న్యాయవాది ద్వారా లేఖ పంపి వ్యక్తిగత హాజరుకు సమయం కావాలని, దర్యాప్తునకు సహకరిస్తానంటూ పోలీసులకు అందజేయించారు. ఈ నెల 25న విచారణకు హాజరు కావాలంటూ పోలీసులు మరోసారి నోటీసులు పంపారు.
పోలీసుల విచారణకు వర్మ డుమ్మా - వాట్సాప్‌లో ఏం మెసేజ్ చేశారంటే!
పోలీసులు గాలింపు చర్యలు : ఈ నెల 19న ఒంగోలు గ్రామీణ సర్కిల్ కార్యాలయంలో ఆర్టీవీ విచారణకు హాజరు కావాల్సి ఉంది. అయితే ఆయన గడువు కోరారు. తిరిగి ఈ నెల 25న తన ఎదుట హాజరు కావాలని విచారణ అధికారి మరోసారి నోటీసులు పంపారు. అప్పటికే హైకోర్టులో మరోసారి బెయిల్ పిటీషన్ దాఖలు చేశారు. సోమవారం విచారణకు హాజరు కావాల్సి ఉండగా వర్మ నుంచి ఎటువంటి సమాచారం లేకపోవడంతో ఉదయం 11 గంటల తర్వాత పోలీసులు హైదరాబాద్‌లోని ఆయన కార్యాలయానికి వెళ్లారు. పీఏతో పాటు ఆయన కార్యాలయం మేనేజర్‌తో పోలీసులు మాట్లాడినా అందుబాటులోకి రాలేదు. అదే సమయంలో ఆర్జీవీ ఫోన్ కూడా స్విచాఫ్ చేసి ఉండటంతో ఉద్దేశపూర్వకంగానే తమను తప్పుదారి పట్టిస్తున్నారని పోలీసులు భావించారు. ఆయన కోసం హైదరాబాద్‌తో పాటు తమిళనాడు రాష్ట్రంలో సైతం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఈ మొత్తం ఉదంతం గతంలో ఆర్జీవీ తీసిన దౌడ్ సినిమాను ప్రస్తుతం తలపిస్తోంది.
వర్మకు మళ్లీ పోలీసుల నోటీసులు - ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణ వాయిదా