Officials Not Released Water to KC Canal: ఖరీఫ్ ప్రారంభమైంది! రైతులు దుక్కి దున్ని పొలాలు సిద్ధం చేసుకున్నారు. కాల్వకు నీరొస్తే పంటలు వేసుకోవాలని ఎదురుచూస్తున్నారు. కానీ రోడ్డు పనులు వారికి అడ్డంకిగా మారాయి. సుంకేసుల జలాశయంలో నీరు ఉన్నా కేసీ కెనాల్‌కు (Kurnool Cuddapah Canal) విడుదల చేయకపోవటంతో, కర్నూలు, వైఎస్సార్ జిల్లాల రైతన్నలు ఆందోళనకు గురవుతున్నారు.
ఉమ్మడి కర్నూలు, వైఎస్సార్ జిల్లాల్లోని.. కేసీ కెనాల్ పరిధిలో 2 లక్షల 65 వేల ఎకరాల ఆయకట్టు ఉంది. తుంగభద్ర నదిపై నిర్మించిన సుంకేసుల జలాశయం నుంచి కేసీ కాల్వ ప్రారంభమవుతుంది. ప్రాజెక్టులోని నీరు చేరిన వెంటనే కేసీ కెనాల్‌కు నీరు విడుదల చేస్తారు. 2 వారాల క్రితమే సుంకేసుల జలాశయం పూర్తిగా నిండిపోయింది. జలాశయం నీటి నిల్వ సామర్థ్యం 1.2 టీఎంసీలు కాగా, ప్రస్తుతం నిండుకుండను తలపిస్తోంది.
కానీ అధికారులు కేసీ కాల్వకు నీరు విడుదల చేయడం లేదు. నెల క్రితం నుంచే రైతులు పొలాలను సిద్ధం చేసుకున్నారు. జులై చివరి వారం లేదంటే ఆగస్టు మొదటి వారంలో వరి నాట్లు వేసుకుంటే మంచి దిగుబడులు వస్తాయి. నీటి విడుదల ఆలస్యమైతే దిగుబడులు తగ్గుతాయని రైతులు ఆందోళన చెందుతున్నారు.
సూరత్ రోడ్డు పనుల కోసమేనా: కర్నూలు జిల్లాలో సూరత్ జాతీయ రహదారి పనులు నడుస్తున్నాయి. కర్నూలు మండలంలోని దుద్యాల - ఎదురూరు గ్రామాల మధ్య కేసీ కెనాల్ మీదుగా హైవే వెళుతోంది. దీని నిర్మాణ పనుల కోసమే కేసీ కెనాల్ సహా పక్కనే ఉన్న తుంగభద్ర నదిపై ఫ్లైఓవర్ కోసం పిల్లర్లు ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో భాగంగా వాహన రాకపోకల కోసం కేసీ కాల్వలో మట్టితో తాత్కాలిక మార్గం ఏర్పాటు చేసుకున్నారు. సుంకేసుల నుంచి నీరు విడుదల చేస్తే మట్టి మార్గం కొట్టుకుపోతుంది. రోడ్డు పనులు ఆగిపోతాయి. అందుకే నీరు విడుదల చేయడం లేదని తెలుస్తోంది. పనులు ఆపైనా సరే సకాలంలో నీరు విడుదల చేయాలని రైతులు కోరుతున్నారు.
'మల్లె'కు కలిసిరాని మార్కెట్- వాడిపోతున్న అన్నదాతల ఆశలు - Jasmine Farmers Suffering
"పంటలకు నీరు అవసరం. రోడ్డు పని వలన నీరు ఆపేశారు. నీరు రాకపోతే మేము ఎలా బతకాలి. మరో నాలుగు రోజులలో నీరు ఇవ్వకపోతే కలెక్టర్‌తో వెళ్లి దానిని తీసేయాల్సి వస్తుంది. వరి నాట్లు వేయని సమయంలో పర్లేదు. కానీ ఇప్పుడు వరి నాట్లు వేస్తున్నాము కాబట్టి ఎలా అయినా పొలాలకు నీరు కావాలి". - రైతు
"కేసీ కెనాల్‌కి నీరు రావడం లేదు. అక్కడ రోడ్డు పని జరుగుతోంది అట. దాని కోసం నీరు ఆపేశారు. ప్రస్తుతం మేమంతా నీటి కోసం ఎదురుచూస్తున్నాము. డ్యాంలోకి నీళ్లు సరైన సమయానికే వచ్చాయి. కానీ అధికారులు వదలడం లేదు. మరొక నాలుగైదు రోజులలో నీళ్లు రాకపోతే, మేమే వెళ్లి కట్టని తెంచుకొని రావాల్సి వస్తుంది. మాకు నీళ్లు అవసరం కాబట్టి మరొక మార్గం లేదు". - రైతు
బత్తాయి వ్యాపారుల బడా మోసం- ధర ఉన్నా నాణ్యత సాకుతో కోతలు - Mosambi Farmers Low Price