Worst Sanitation in Tirupati Municipal Corporation : తిరుపతి నగరపాలక సంస్థలో పారిశుద్ధ్య వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోంది. తిరుపతి నగరపాలక సంస్థలో పొంగి పొర్లే మురికి కాలువలు, మురుగు నీటితో నిండిన రహదారులతో నగరవాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పారిశుద్ధ్య వైఫల్యంతో నగరంలోని పలు ప్రాంతాల్లో వీధులు మురికినీటితో నిండిపోయాయి.
Disorganized Sanitation in Tirupati : తిరుపతి నగరంలోని డ్రైనేజీ కాలువలు చెత్త, చెదారంతో పేరుకుపోయి నిండిపోవడంతో మురుగు రహదారులపై ప్రవహిస్తోంది. సాధారణ రోజుల్లో మురుగు నీరు రహదారులపై ప్రవహిస్తుండగా వర్షాలు పడితే పరిస్థితి మరింత అధ్వాన్నంగా మారుతోంది. రహదారుల మరమ్మతుల కోసం తవ్వకాలు చేపడుతున్న నగరపాలక అధికారులు నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేయకపోవడం స్థానికులకు ఇబ్బందిగా మారుతోంది. రహదారులు తవ్వి వదిలేస్తున్నారు. ఆ గుంతల్లో మురుగు చేరి కంపుకొడుతోంది. దీంతో వీదుల్లో నగరవాసులు రోడ్లపై నడవలేని పరిస్థితి నెలకొందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
నగరంలోని చిన్న బజారు వీధి, పంట వీధి, ఆకుతోట వీధి సహా పలు కాలనీల్లో మురికి కాలువలు పొంగిపొర్లుతున్న నగరపాలక సంస్థ అధికారులు పట్టించుకోవడం లేదు. పంటవీధి ప్రాంతంలో మురికి కాలువల మరమ్మతు పేరుతో తవ్వి వదిలేయడంతో మురికి నీరు రహదారులపై ప్రవహిస్తోంది. మురుగు నీటితో ఇబ్బంది పడుతున్న కాలనీ వాసులు మూడు నెలలుగా నగరపాలక సంస్థ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వర్షం పడితే పరిస్థితి మరింత ఇబ్బంది కరంగా మారుతోందని, రహదారులపై చేరిన మురుగు నీటితో దోమలు, దుర్గంధంతో భరించలేకపోవతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మురుగు నీటిలో నడుస్తూ ప్రమాద బారిన పడుతున్నామని వాపోతున్నారు.
గడచిన ఐదు సంవత్సరాలు వైఎస్సార్సీపీ ప్రభుత్వం మురికి కాలువలో పూడిక తీయకపోవడంతో పాటు పేరుకుపోతున్న చెత్తను తొలగించకపోవడంతో వర్షపు నీరు కాలువలు దాటి రహదారులపైకి నీరు చేరుతోందని నగరవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వేసవి కాలం మినహా మిగిలిన అన్ని కాలాల్లో తాము మురికి వాడల్లో జీవిస్తున్న పరిస్థితులు నెలకొన్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.