No Development in Dhone Assembly Constituency: నంద్యాల జిల్లా డోన్‌ను మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దాం, అందుకోసం కోట్లు ఖర్చు చేశామని ఆర్థిక మంత్రి బుగ్గన ఎన్నికల వేళ పనులు పూర్తి కాకుండానే హడావిడిగా ప్రారంభోత్సవాలు చేశారు. ఆయన రిబ్బన్ కట్ చేసి రెండు నెలలు పూర్తైనా నేటికీ పనులు జరుగుతూనే ఉన్నాయంటే అతిశయోక్తి కాదు.
మున్సిపల్ కార్యాలయ భవనం, పాతబస్టాండులో అత్యాధునిక కూరగాయల మార్కెట్, క్లబ్ హౌస్, ప్రభుత్వ అతిథి గృహాలు, ఈతకొలను, 100 పడకల ఆసుపత్రి, బీసీ బాలికల పాఠశాల భవనాలు నిర్మాణాలు జరుగుతున్నప్పటికీ తమ హయాంలోనే పూర్తి చేసినట్లు గొప్పలు చెప్పుకున్నారు. అంతేకాదు జనవరి 28న ప్రారంభోత్సవాలు చేశారు. కానీ వీటిలో చాలా వరకు నేటికీ పనులు కొనసాగుతూనే ఉన్నాయి.
అసంపూర్తి భవనాలు - హడావుడిగా ప్రారంభించిన మంత్రి బుగ్గన
డోన్‌లోని కూరగాయల మార్కెట్, పాతబస్టాండ్ ప్రాంతంలోని మున్సిపల్ నిర్మాణాలు కూల్చేశారు. వీటి స్థానంలో అత్యాధునిక కూరగాయల మార్కెట్ పేరుతో 16 కోట్లతో నిర్మాణ పనులు ప్రారంభించారు. గ్రౌండ్ ఫ్లోర్‌లో 74 స్టాళ్లు, 48 దుకాణాలు నిర్మించారు. మొదటి ఫ్లోర్‌లో పనులు పనులు పెండింగ్‌లో ఉన్నాయి. ఇంకా 20 శాతానికిపైగా పనులు పెండింగ్‌లో ఉండగానే రిబ్బన్ కట్ చేశారు.
డోన్ పట్టణంలోని రుద్రాక్షగుట్ట వద్ద బీసీ బాలికల గురుకుల పాఠశాల నిర్మాణాన్ని 36 కోట్లతో చేపట్టారు. 20 కోట్లతో పాఠశాలను మొదటి దశలో నిర్మించారు. ఇందులో కొన్ని తరగతి, కొన్ని ల్యాబ్ గదులు నిర్మించారు. ఇందులోనూ ఇంకా 30 శాతం వరకు పనులు పెండింగ్‌లో ఉన్నాయి. వసతి గృహం పనులు ఇంకా 50 శాతం వరకు కావాలి. వీటిని కూడా మంత్రి ప్రారంభించేశారు.
డోన్ పట్టణంలో ప్రస్తుతమున్న ఆసుపత్రి స్థానంలో 100 పడకల భవన నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. నాడు-నేడు కింద 37 కోట్ల రూపాయలతో 10 ఎకరాల్లో పనులు చేపట్టారు. ఆసుపత్రి ముందువైపు పైభాగంలో రేకులు ఏర్పాటు చేశారు. ఇంకేముంది ఆసుపత్రి భవనమంతా పూర్తయిందేమో అనుకున్నారు. కానీ వెనుక వైపు వెళ్లి చూస్తే పనులు సాగుతున్నాయి.
పైరేకులు, రంగులు వేయాల్సి ఉంది. ఇంకా 20 శాతం పనులు చేయాల్సి ఉండగానే భవనాన్ని హడావుడిగా ప్రారంభించారు. పనులు పూర్తవ్వాలంటే ఇంకా కొన్ని నెలలు పడుతుందని అధికారులు చెబుతున్నారు. డోన్ పట్టణంలోని రహదారికి ఆనుకుని నిర్మిస్తున్న డ్రైనేజీలకు సైతం గత నెల మొదటి వారంలో ప్రారంభోత్సవాలు చేశారు. అవి కూడా నేటికీ పూర్తి కాలేదు.
"డోన్ ప్రాంతంలో అభివృద్ధి పనులు పూర్తి అయ్యాయంటూ ఎన్నికలు వస్తున్నాయని హడావుడిగా ప్రారంభించారు. ప్రారంభించి చాలా రోజులు అవుతున్నా ఇప్పటికీ పనులు జరుగుతూనే ఉన్నాయి. అదే విధంగా టిడ్కో ఇళ్లు కూడా ఎక్కడా పంపిణీ చేయలేదు. ఇంకా మరో రెండు మూడు నెలలు పనులు జరిగే పరిస్థితి కనిపిస్తోంది. కల్లబొల్లి మాటలు చెప్తూ రాబోయే ఎన్నికల్లో ప్రయోజనం పొందాలని ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి చూస్తున్నారు". - స్థానికుడు
మంత్రి బుగ్గన ఇంటిని ముట్టడించిన ఎన్ఎస్యూఐ నాయకులు - అరెస్ట్ చేసిన పోలీసులు