New Technology for Railway Track Crossing: దేశవ్యాప్తంగా ఇటీవల రైలు పట్టాలు క్రాసింగ్ చేసే సమయంలో ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్నాయి. రైలు పట్టాలను క్రాస్ చేసేటప్పుడు చాలా తక్కువ వేగంతో రైలును నడపాలి. కానీ కొన్నిసార్లు లోకోపైలెట్ తప్పిదంతో లేదా ఏదైనా సాంకేతిక సమస్య తలెత్తి కాస్త వేగంగా వెళ్లి రైళ్లు పట్టాలు తప్పుతున్నాయి. ఈ తరహా ప్రమాదాలకు చెక్ పెట్టేందుకు రైల్వేశాఖ సిద్ధమైంది.
క్రాసింగ్ కోసం అధునాతన సాంకేతికతను అందుబాటులోకి తెచ్చింది. వెల్డబుల్ కాస్ట్ మాంగనీస్ స్టీల్ పేరిట సరికొత్త వ్యవస్థను తీసుకొచ్చింది. దక్షిణ మధ్య రైల్వే దీనిని తొలిసారిగా విజయవాడ- గూడూరు సెక్షన్‌లో వేటపాలెంలో ఏర్పాటు చేసింది. ఇప్పటివరకు స్టేషన్ పొడవునా టర్న్ అవుట్ పాయింట్లు ఉండేవి. ఈ పాయింట్లకు జాయింట్లు వేసేవారు. కానీ కొత్త సాంకేతిక వ్యవస్థ డబ్ల్యూసీఎమ్ఎస్లో తక్కువ దూరంలోనే క్రాసింగులు ఉంటాయి.
ఇది మాంగనీస్‌తో తయారుచేసింది కావడంతో రైలు వేగంగా పట్టాలు మారడమే కాకుండా కుదుపులు కూడా ఉండవు. దీంతో రైలు పట్టాలు తప్పే ప్రమాదం ఉండదు. రైళ్లు 130 కిలోమీటర్ల వేగంతో కూడా ట్రాక్ మారవచ్చు. అంటే పట్టాలు క్రాస్ చేసేటప్పుడు రైలు నెమ్మదిగా వెళ్లాల్సిన అవసరం లేదు. దీంతో ప్రయాణ సమయం కూడా కొంత మేర తగ్గుతుందని రైల్వే అధికారులు చెబుతున్నారు.
ప్రస్తుతం ఉన్న సిగ్నలింగ్ వ్యవస్థను సైతం ఆధునీకరిస్తూ ఆటోమేటిక్ బ్లాక్ సిస్టం(ఏబీఎస్) పేరిట సరికొత్త వ్యవస్థను అందుబాటులోకి తెచ్చారు. 31 కోట్ల 81 లక్షల వ్యయంతో 21.21 కిలోమీటర్ల విస్తీర్ణంలో దీన్ని విజయవాడ డివిజన్ అధికారులు ప్రారంభించారు. విజయవాడ డివిజన్ పరిధిలోని గన్నవరం- నూజివీడు సెక్షన్ల మధ్య మొత్తం 22 చోట్ల ఏబీఎస్ని ఏర్పాటు చేశారు. గన్నవరం, పెద అవుటపల్లి, తేలప్రోలు, నూజివీడు రైల్వే స్టేషన్లలో స్ట్రెస్డ్ ప్రీకాస్ట్ టెక్నాలజీతో నిర్మించిన 4 ఏబీఎస్ పరికరాలను అమర్చారు.
ఈ వ్యవస్థ రైల్వే సిగ్నలింగ్, రైల్వే లైన్లను బ్లాక్‌లుగా విభజిస్తుంది. రైల్వే నెట్ వర్క్, భద్రత, సామర్థ్యాన్ని పెంపొందించడమే లక్ష్యంగా దీన్ని ఏర్పాటు చేశారు. గతంలో విజయవాడ డివిజన్ పరిధిలో ఎక్కడైనా సాంకేతిక లోపం తలెత్తితే సమాచారం తెలిసేందుకు గంటల సమయం పట్టేది. కానీ దీని వల్ల నిమిషాల వ్యవధిలోనే సమాచారం తెలుస్తోంది. ప్రయాణికులు సురక్షితంగా రాకపోకలు సాగించేదుకు ఈ కొత్త సిగ్నలింగ్ వ్యవస్థ దోహదపడుతుందని రైల్వే అధికారులు చెబుతున్నారు. ఈ కొత్త వ్యవస్థల వల్ల ప్రయాణికులకు భద్రత పెరుగుతుందని రైల్వే అధికారులు చెబుతున్నారు. మరోవైపు రైళ్లు వేగంగా గమ్యస్థానాలకు చేరడంతో డివిజన్ ఆదాయమూ గణనీయంగా పెరుగుతోందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.