New Drug Formula to Prevent Heart Attacks : ఇటీవల కాలంలో గుండెపోటు మరణాలు ప్రపంచ వ్యాప్తంగా పెరిగాయి. కరోనా తర్వాత ఈ సంఖ్య గణనీయంగా పెరిగినట్లు దిల్లీ ఎయిమ్స్ సర్వేలో వెల్లడైంది. నిద్రలో ఉండగానే వేకువజామున సైలెంట్ హార్ట్ ఎటాక్ వచ్చి మరణిస్తున్నారు. వేకువజామున వచ్చే గుండెపోటు నివారణకు కొత్త విధానాలు రావాల్సిన అవసరాన్ని చాటిచెబుతూ బాపట్ల ఫార్మసీ కళాశాలకు చెందిన ముగ్గురు పరిశోధకులు సమయ నిర్దేశిత ఔషధ విధానంపై పరిశోధనలు చేసి పేటెంట్ పొందారు.ఇంతకీ గుండెపోటు నివారణకు ఈ విధానం ఎలా ఉపకరిస్తుంది? ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చే అవకాశముంది? వంటి అంశాలపై ప్రత్యేక కథనం.
వయసుతో సంబంధం లేకుండా తెల్లవారుజామునే ఎక్కువ గుండెపోటు మరణాలు సంభవిస్తున్నాయి. మెదడు నుంచి విడుదలయ్యే కొన్నిరకాల హార్మోన్లతో పాటు ఒత్తిడితో ఇలాంటి కేసులు పెరుగుతున్నాయి. ఒత్తిడి పెంచే హార్మోన్లు విడుదలయ్యే సమయంలోనే వాటిని నియంత్రించే ప్రతికారకాలను మన శరీరం దానికదే విడుదల చేస్తుంది. ఒక్కోసారి ప్రతికారకాల విడుదల శాతం తక్కువగా ఉంటే అప్పుడు ఒత్తిడి పెరిగి గుండెపోటు వచ్చే ప్రమాదం ఉంది.
ఇది ఎక్కువగా తెల్లవారుజామున 3 నుంచి 6 గంటల మధ్యలో ఎక్కువగా సంభవిస్తుంది. అయితే నియంత్రణకు మందులు ఉన్నాయి. ఆ మందులు వేసుకున్న 2 గంటల తర్వాత ప్రభావం మొదలవుతుంది. ఈ లెక్కన అర్థరాత్రి లేచి మందులు వేసుకోవాలి. కానీ అందరికీ సాధ్యం కాదు. ఈ విషయంపై బాపట్ల ఫార్మసీ కళాశాల ఆచార్యుడు సాయికిషోర్ పరిశోధక విద్యార్థులు బి. వంశీకృష్ణ, టి. వాణీ ప్రసన్న పరిశోధనలు చేశారు. గుండెపోటు కారకాలను నిరోధించే ప్రతి నిరోధకాలను శరీరంలో తగిన సమయంలో విడుదల చేయడం ద్వారా ముప్పు లేకుండా చూడవచ్చని తెలుసుకున్నారు.
'మందు ఉండే ట్యాబ్లెట్‌కు హైడ్రోజెల్‌తో కూడిన మూత బిగిస్తారు. ఘనరూపంలోని ఈ జెల్ ఐదు గంటల తర్వాత ద్రవరూపంలోకి మారిపోతుంది. అప్పుడు ట్యాబ్లెట్‌లోని మందు బయటకు వచ్చి శరీరంలో కలిసిపోతుంది. వెంటనే ఒత్తిడి నివారించే ప్రతికారకాలు ఉత్పత్తి అవుతాయి. ఈ కారణంగా గుండెపోటు కలిగించే కారకాలు కట్టడి అవుతాయి. ఈ మందును రాత్రి భోజనం తర్వాత 9 లేదా 10 గంటల సమయంలో వేసుకోవాలి. అప్పటి నుంచి 5 గంటల తర్వాత ట్యాబ్లెట్ మూత కరిగి మందు విడుదలయ్యేలా ఫార్ములాను రూపొందించారు. వీరు రూపొందించిన ఫార్ములాకు సమయ నిర్దేశిత ఔషధ విధానం అని పేరు పెట్టారు. దీని పనితీరుని 12 కుందేళ్లలో పరిశీలించగా సానుకూల ఫలితాలు వచ్చాయి.' -పరిశోధక విద్యార్థులు
హార్ట్ ఎటాక్‌ను నిరోధించే కాప్స్యూల్ - బాపట్ల ఫార్మసీ కళాశాల బృందానికి పేటెంట్
ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయానికి పరిశోధనా గ్రంథం సమర్పించారు. ఈ విషయం అంతర్జాతీయ జర్నల్స్‌లో ప్రచురితమైంది. ఈ ఏడాది మే నెలలో తమ పరిశోధన విధానాన్ని, ఫలితాల్ని పేటెంట్ కోసం దరఖాస్తు చేశారు. నవంబర్ 25న పేటెంట్ మంజూరైంది. 20 ఏళ్ల పాటు మేధో సంపత్తి హక్కులు సాయికిషోర్ బృందానికి దక్కాయి. నాలుగున్నరేళ్లకు పైగా శ్రమించి చేసిన పరిశోధనకు పేటెంట్ లభించింది. దీనికి సంబంధించి పరిశోధనల్ని మరింత ముందుకు తీసుకెళ్లాల్సి ఉంది. మానవుల గుండె, కుందేలు గుండె ఒకే తరహాలో ఉంటుంది కాబట్టి తర్వాత ప్రయోగాల్లో సానుకూల ఫలితం వస్తుందని వారు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.
పరిశోధక విద్యార్థులు వంశీకృష్ణ ప్రస్తుతం అమెరికాలో, వాణీప్రసన్న ముంబయిలోని ప్రముఖ ఫార్మా కంపెనీలో పని చేస్తున్నారు. పేటెంట్ పొందిన బృందాన్ని బాపట్ల ఎడ్యుకేషన్ సొసైటీ అధ్యక్షుడు ముప్పలనేని శ్రీనివాసరావు, కార్యదర్శి మానం నాగేశ్వరరావు, కళాశాల ప్రిన్సిపల్ టీఈ గోపాలకృష్ణమూర్తి అభినందించారు.
గుడిలో ప్రదక్షిణలు చేస్తూ గుండెపోటుతో యువకుడు మృతి - అంతకు ముందు ఏం జరిగిందంటే!