Nellore Youth Shined as Sports Athletes: ఉదయాన్నే మైదానంలో సాధన చేస్తూ శారీరక శక్తి, సామర్థ్యాలను పెంపొందించుకుంటున్నారు ఈ యువ క్రీడాకారులు. వీరందరికీ క్రీడలపై చిన్ననాటి నుంచే మక్కువ ఎక్కువ. ఆ మక్కువతోనే చదువుల్లో ప్రతిభ చూపుతూ ఆటల్లోనూ రాణిస్తున్నారు. సరైనా సదుపాయాలు లేకున్నా ఆటల్లో సత్తాచాటుతూ ఔరా అనిపిస్తున్నారు ఈ యువతీ యువకులు.
పేద, మధ్యతరగతి కుటుంబాలకు చెందిన ఈ విద్యార్థులు నెల్లూరు జిల్లా సింహపురికి చెందినవారు. పాఠశాలకు వెళ్లే రోజుల నుంచి క్రీడలపట్ల ఆసక్తి పెంచుకుని కఠోర సాధన చేశారు. ప్రతిరోజు మైదానంలో శిక్షణ తీసుకుంటూ ప్రతిభ, నైపుణ్యాలు పెంపొందించుకున్నారు.
వీరిలో ఓ యువతి పేరు సునీత. మొదట్లో ఆరోగ్యం కాపాడుకోవడానికి గ్రౌండ్‌కి వెళ్లేది. తనలోని ప్రతిభను గుర్తించిన సహచరులు క్రీడలపై దృష్టి సారించాలని ప్రోత్సహించారు. ఆ దిశగా పరుగుపందెం వైపు అడుగులేసిన సునీత అనతి కాలంలోనే మంచి గుర్తింపు సాధించింది. ఫలితంగా ఇటీవల పిలిపైన్స్లో జరిగిన అంతర్జాతీయ స్థాయి పరుగుపందెంలో మొదటి బహుమతి కైవసం చేసుకుంది.
పేదింటి బిడ్డల పెద్ద మనస్సు- ఆపత్కాలంలో అందరికీ ఆత్మీయులు
తండ్రి ప్రేరణతో క్రీడల వైపు అడుగులేసింది బ్యూల రోజ్. అథ్లెట్ కావాలని కలగంటూ సాధన చేసింది. క్రమంగా ప్రతిభ పెంపొందించుకున్న యువతి డిస్కస్‌త్రో, షాట్‌పుట్‌లో అద్భుతంగా రాణిస్తోంది. గుంటూరు, శ్రీకాకుళంలో జరిగిన పోటీల్లో మొదటి బహుమతి అందుకుంది. కానీ, ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయం అందడం లేదన్న యువతి క్రీడా ప్రాంగణాలు అభివృద్ధి చేయాలని కోరుతోంది.
ఎంబీఏ చదువుతూనే క్రీడలకూ ప్రాధాన్యం ఇస్తున్నాడు శ్యామ్. జావలిన్ త్రో, వాలీబాల్ క్రీడల్లో రాణిస్తున్నాడు. తమిళనాడు, కర్ణాటకలో జరిగిన జావెలిన్ త్రోలో బంగారు పతకాన్ని సాధించాడు. ఒలింపిక్స్ వరకు వెళ్తానని దృఢంగా చెబుతున్నాడు. రైల్వేలో ఉద్యోగం సాధించాలనే ధ్యేయంగా ముందుకు సాగుతున్నట్లు చెబుతున్నాడు.
గ్రామీణ ప్రాంతానికి చెందిన దుర్గాప్రసాద్ డిగ్రీ చదువుతూనే లాంగ్‌రన్‌లో రాష్ట్ర స్థాయి క్రీడాకారుడిగా పతకాలు సాధించాడు. నెల్లూరు సుబ్బారెడ్డి స్టేడియంలో జాతీయ స్థాయి క్రీడల్లో శిక్షణకు ఎంపికయ్యాడు. ఇటీవల జరిగిన రాష్ట్ర స్థాయి పోటీల్లో బంగారు పతకాలు సాధించాడు. క్రీడాకారులను ప్రభుత్వం ప్రోత్సహించాలని కోరుతున్నాడు.
నెల్లూరు జిల్లాలో క్రీడాకారులకు కొరతలేదని, ప్రభుత్వం నుంచి ప్రోత్సాహం కావాలని కోచ్ రజినీకాంత్ కోరుతున్నాడు. జాతీయ స్థాయిలో ఆడే క్రీడాకారులు ఎక్కువ మంది పేదరికంలో ఉన్నారని, వారికి పౌష్టికాహారం అందించాలని సూచిస్తున్నాడు. మైదానాలు, క్రీడాపరికరాలు, పౌష్టికాహారం క్రీడాకారులకు అవసరం. అవేవి లేకున్నా అదరగొడుతున్నారు ఈ క్రీడాకారులు. మైదానాలకు సౌకర్యాలు కల్పించేలా ప్రభుత్వం చొరవ చూపితే దేశానికి ఎన్నో మెడల్స్ తీసుకొస్తాం అనే ధీమా వ్యక్తం చేస్తున్నారు.
'ఫ్యాషన్ డిజైనింగ్‌లో నంబర్ వన్' సామాజిక అంశాలపై ఆసక్తి కొద్దీ మరో లక్ష్యానికి చేరువైన తులసి