Nellore Rural DSP Hit by Vehicle: ఏపీలో గంజాయి మాఫియా రోజురోజుకూ పేట్రేగిపోతోంది. తమకు అడ్డువస్తే ఎంతటికైనా తెగిస్తున్నారు. తాజాగా ఏకంగా డీఎస్పీపైనే దాడి చేశారు. కారుతో ఢీకొట్టి హత్యాయత్నానికి పాల్పడ్డారు. అనంతరం అక్కడ నుంచి పరారయ్యారు. ఈ ఘటన నెల్లూరు జిల్లా వెంకటాచలం టోల్ ప్లాజా వద్ద చోటుచేసుకుంది.
నెల్లూరు జిల్లా వెంకటాచలం టోల్ ప్లాజా వద్ద శుక్రవారం రాత్రి పోలీసులు తనిఖీలు చేశారు. గంజాయి, డ్రగ్స్‌ను తరలిస్తున్న ముఠా ఉన్న వాహనాన్ని డీఎస్పీ ఘట్టమనేని శ్రీనివాస్ తనిఖీలు చేస్తుండగా అతడిని ఢీ కొట్టి పరారయ్యారు. అయితే డీఎస్పీని ఢీకొట్టి పరారైన వాహనాన్ని పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు.
పెంట్‌హౌస్‌లో గంజాయి సేవిస్తున్న యువకులు - పక్కా ప్లాన్‌తో పోలీసుల ఎంట్రీ
గంజాయి మాఫియా దాడిలో డీఎస్పీ కంటి వద్ద, తలకు కొద్దిగా గాయాలు కావడంతో ప్రైవేట్ వైద్యశాలలో చికిత్స పొందుతున్నారు. నలుగురు స్మగ్లర్లు కారులో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఒక వ్యక్తిని టోల్ ప్లాజా వద్ద అదుపులోకి తీసుకున్నారు. పరారైన ముగ్గురు ఆత్మకూరు, మర్రిపాడు మండలంవైపు జాతీయ రహదారిపై వెళ్తుండగా పోలీసులు వెంబడించారు. ఈ దుస్సాహసానికి ఒడిగట్టిన దుండగుల్లో ఒకర్ని పోలీసులు అదుపులోకి తీసుకోగా, మరో ముగ్గురు పరారయ్యారు.
గంజాయి మత్తు ప్రాణాలు తీస్తోంది-నేరాలు చేయిస్తోంది - Youth Hit Another Person
నెల్లూరు జిల్లాలో గత మూడేళ్లుగా భారీగా గంజాయి, డ్రగ్స్ తరలించినట్లు పోలీసులు చేసిన దాడుల్లో వెల్లడైంది. చెన్నై, సూళ్లూరుపేట, గూడూరు మీదుగా నెల్లూరు, విజయవాడ ప్రాంతాలకు తరలించినట్లు పోలీసులకు గతంలో సమాచారం ఉంది. నెల్లూరు నగరంలోని రైల్వే రైలు ప్రాంతాలు, వేదాయిపాలెం, మైదానాల్లో ప్రతి రోజూ గంజాయి ముఠాలు హల్చల్ చేస్తున్నా, పోలీసులు వారిని అడ్డుకోలేకపోతున్నారు.
ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న డీఎస్పీని ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పరామర్శించారు. నెల్లూరులో వాహన తనిఖీలు నిర్వహిస్తున్న డీఎస్పీని గంజాయి ముఠా ఢీకొట్టి పరారైన ఘటనను ఖండించారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం గత ఐదేళ్లలో గంజాయి ముఠాలను పెంచి పోషించిందని ఆరోపించారు. కూటమి ప్రభుత్వంలో గంజాయి ముఠాల ఆగడాలను ఎట్టి పరిస్థితుల్లోనే ఉపేక్షించేది లేదని, కారకులను తీవ్రంగా శిక్షిస్తామని అన్నారు.