Nellore Boy Guinness Record in Rubiks Cube : చూస్తున్నారుగా ! ఈ కుర్రాడు ఎంత ఫాస్ట్‌గా రూబిక్స్ క్యూబ్ పజిల్స్ పరిష్కరిస్తున్నాడో! సరదాగా మొదలు పెట్టిన ఈ ఆటలో ఏకంగా ప్రపంచ రికార్డే సాధించాడు. అంతేకాదు చదువుల్లో రాణిస్తూనే ఫుట్‌బాల్ పోటీల్లోనూ అదరగొడుతున్నాడు. నిరంతరం కొత్త ఆలోచనలతో సాంకేతిక అంశాలపైన పట్టు సాధిస్తూ తన ప్రతిభను మెరుగుపరుచుకుంటున్నాడు ఈ ఔత్సాహికుడు.
నెల్లూరు నగరానికి చెందిన శ్రీనివాసులు, స్వప్నల పెద్ద కుమారుడు నయన్ మౌర్య. వీళ్లు కొన్ని సంవత్సరాలు అమెరికాలో ఉన్నారు. ఆ తర్వాత 2020లో భారత్‌కు వచ్చి నెల్లూరులో వస్త్రదుకాణం నిర్వహిస్తున్నారు. అమెరికాలో ఉన్నప్పుడు పాఠశాలలో తోటి స్నేహితులు రూబిక్స్ క్యూబ్ ఆడుతుండడం చూసి ఆసక్తి పెంచుకున్నాడు. ఆసక్తిని గమనించిన తల్లిదండ్రులు నయన్ మౌర్య పుట్టినరోజున రూబిక్స్ క్యూబ్ బహుమతిగా అందించారు.
"నేను అమెరికాలో ఐదు సంవత్సరాలు ఉన్నాం. మా స్నేహితులు రూబిక్స్ క్యూబ్ పజిల్స్ పరిష్కరించడం చూశాను. అప్పుడు నాకు ఆసక్తి కలిగింది. ఎలాగైనా నేను అందులో రాణించాలని అనుకున్నాం. చిన్నపటి నుంచి ఈ ఆటపై సాధన చేస్తున్నా. అలా గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డులో స్థానం పొందాను." - నయన్ మౌర్య, గిన్నిస్ రికార్డు సాధించిన కుర్రాడు
Nayan Maurya Guinness Record in Rubiks Cube : అమెరికా నుంచి భారత్‌కు వచ్చిన తర్వాత నయన్‌కు రూబిక్స్ క్యూబ్‌పై ఆసక్తి ఇంకా పెరిగింది. అతని ప్రతిభను గుర్తించి 20 రకాల రూబిక్స్ క్యూబ్‌లను కొనుగోలు చేసి ఇచ్చారు తల్లి. ఆటకు సంబంధించిన అల్గారిథమ్‌తో మెళకువలు నేర్చుకున్నాడు. తక్కువ సమయంలో పజిల్స్ పరిష్కరించడంపై పట్టు సంపాదించాడు. పలు ప్రాంతాల్లో జరిగిన రూబిక్స్ క్యూబ్ పజిల్స్ పోటీల్లో నయన్ విజయం సాధించాడు.
క్యూబ్ పజిల్స్ ఆటలో విజయం : ఆటపై ఆసక్తితో క్యూబర్స్ అసోసియేషన్ సభ్యుడిగా చేరాడు నయన్. తద్వారా మరికొన్ని కొత్త విషయాలు నేర్చుకున్నాడు. నమ్మకం వచ్చాక గిన్నిస్ రికార్డుపై కన్నేసి ఇందుకోసం కొత్త ఆలోచన చేశాడు ఈ కుర్రాడు. సైకిల్ తొక్కుతూ క్యూబ్‌ను పరిష్కారించడం ప్రాక్టీస్ చేశాడు. సొంతంగానే సన్నద్ధమై చైన్నైలో జరిగిన పోటీల్లో గెలిచి గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డు సాధించాడు. అది కూడా మొదటి ప్రయత్నంలోనే. సైకిల్ తొక్కుతూ కేవలం 59 నిమిషాల్లో 271 రూబిక్స్ క్యూబ్‌లను అలవోకగా సాల్వ్ చేసి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తాడు.
అల్గారిథమ్ ఉపయోగిస్తూ పోటీల్లో క్యూబ్స్‌ను ఎలా పరిష్కరించాడో చెబుతూనే ఏమైనా సలహాలు ఉండే తనని సంప్రదించాలని అంటున్నాడు నయన్. రూబిక్స్ క్యూబ్ సాల్వ్ చేయడమే కాకుండా రాష్ట్ర స్థాయి ఫుడ్ బాల్ ప్లేయర్‌గానూ రాణిస్తున్నాడు నయన్. పలు పోటీల్లో అవార్డులు సాధించాడు. అంతర్జాతీయ పోటీల్లో దేశానికి పతకం సాధించడమే లక్ష్యంగా శిక్షణ తీసుకుంటున్నాడు. ఇటు చదువుల్లోనూ ప్రతిభ కనబరుస్తున్నాడు. రోబోటిక్స్ అంటే ఎంతో ఇష్టమని భవిష్యత్‌లో ఈ అంశంపైనే ఇంజినీరింగ్ విద్యను అభ్యసిస్తానని అంటున్నాడు.
పిల్లల ఆసక్తికి అనుగుణంగా ప్రోత్సహిస్తే కెరీర్‌లో రాణిస్తారని అదే నయన్ విషయంలో చేసి చూపిస్తున్నామని చెబుతున్నారు తల్లిదండ్రులు. చిన్నవయసులనే నయన్ గిన్నిస్ రికార్డు సాధించడంపై ఆనందం వ్యక్తం చేస్తున్నారు. చదువుల్లో రాణిస్తూనే విభిన్న రంగాల్లో సత్తా చాటుతున్నాడు నయన్. వినూత్నంగా ఆలోచించి పట్టుదలతో సాధన చేసి ప్రపంచ రికార్డు సాధించాడు. ఇదే స్ఫూర్తితో భవిష్యత్‌లో మరిన్ని విజయాలు సాధిస్తానని ధీమా వ్యక్తం చేస్తున్నాడు ఈ ఔత్సాహికుడు.
కరాటేలో బెజవాడ కుర్రాడి సత్తా - అంతర్జాతీయంగా 6 స్వర్ణ పతకాలు కైవసం - Ranadhir Excelling in Karate
చిన్న వయస్సులోనే 15స్వర్ణ పతకాలు- జాతీయ, అంతర్జాతీయ పోటీల్లో బహుముఖ ప్రజ్ఞ - Multi Talented Girl