Nellore AC Subbareddy Stadium Glittering with Kids : వేసవి సెలవులు అంటేనే పిల్లలు ఎగిరి గంతేస్తారు. అది చేద్దాం ఇది చేద్దాం అని ఎన్నెన్నో ప్రణాళికలు వేస్తారు. పుస్తకాలన్నీ పక్కన పెట్టేసి అమ్మమ్మ ఇంటికో బంధువుల ఇళ్లకో లేక టూర్స్ వెళ్లి భలే ఎంజాయ్ చేస్తారు. అయితే నెల్లూరు జిల్లాలో పిల్లలు మాత్రం కాస్త భిన్నంగా క్రీడా మైదానాలనే సమ్మర్ క్యాంపులుగా ఎంచుకున్నారు. క్రికెట్ ఆడుతూ ఎంతో ఉల్లాసంగా ఉత్సాహంగా సెలవులను గడిపేస్తున్నారు. వందలాది మంది విద్యార్ధుల క్రీడలతో నెల్లూరు జిల్లాలోని మైదానాలు సందడిసందడిగా మారాయి.
Summer Coaching Camp At AC Subbareddy Stadium : క్రికెట్ ఈ పేరు వింటేనే యువత ఊగిపోతారు. సాధారణ సమయంలో స్కూళ్లు, కాలేజీలకు వెళ్లినా సాయంత్రం అయ్యేసరికి అంతా ఒక చోట చేరిపోతారు. బ్యాట్, బంతి పట్టుకుని ఎక్కడ చూసినా గల్లీలో క్రికెట్ ఆడుతూ కనిపిస్తుంటారు. అలాంటిది ఇప్పుడు వేసవి సెలవులు కావడంతో చాలా సమయం ఉండటంతో విద్యార్ధులు క్రీడా మైదానాల్లోనే ఎక్కవ సమయం గడిపేస్తున్నారు. నెల్లూరు జిల్లాలోని ఏసీ సుబ్బారెడ్డి స్టేడియం (AC Subba Reddy Stadium), వీఆర్సీ మైదానాలు క్రీడాకారులతో కళకళలాడుతున్నాయి. నెల్లూరు జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ క్రికెట్ పోటీలు నిర్వహిస్తోంది. ఆసక్తి ఉన్నవారిని ఎంపిక చేసి ప్రత్యేక కోచ్‌ల ద్వారా క్రికెట్‌లో శిక్షణ ఇస్తోంది. ఆరో తరగతి విద్యార్ధుల నుంచి డిగ్రీ, ఇంజినీరింగ్ చదివే విద్యార్ధులు సైతం క్యాంప్‌లో చేరారు. జిల్లాలో సుమారు 600మందికి వివిధ క్రీడల్లో శిక్షణ పొందుతున్నారు.
Summer Coaching Camp In Nellore వేసవి శిక్షణ శిబిరాలతో కళకళలాడుతున్న నెల్లూరు సుబ్బారెడ్డి స్టేడియం
ప్రత్యేక కోచ్‌తో క్రికెట్‌లో మెలుకువలు : తెల్లవారుజామునే బ్యాట్, బాల్, కిట్‌తో క్రీడాకారులు మైదానాలకు చేరుకుంటున్నారు. ముందు రాగానే కాసేపు వార్మప్ చేసి తర్వాత శిక్షణ ప్రారంభిస్తారు. ప్రత్యేక కోచ్‌లు వారికి క్రికెట్‌లో మెలుకువలు నేర్పిస్తున్నారు. బ్యాట్, బాల్ పట్టుకుని అభిమాన క్రికెటర్లలా ఫీలవుతూ తోటి స్నేహితులతో కలిసి ఉత్సాహంగా ఆడుతున్నారు. ఆనందంతోపాటు ఆరోగ్యాన్ని పొందుతున్నారు.
మంచి క్రికెటర్ కావాలనేదే ఆశయం : తల్లిదండ్రులు కూడా ఎంతో బాధ్యతగా పిల్లలను తీసుకువచ్చి శిక్షణలో చేర్పించి వెళ్తున్నారు. పదేళ్లుగా వేసవి శిక్షణా శిబిరాల్లో నైపుణ్యం పొంది జిల్లా, రాష్ట్ర స్థాయిలో మెడల్స్ పొందిన యువకులు కూడా ఆడుతున్నారు. ఎప్పటికైనా మంచి క్రికెటర్ కావాలనేదే ఆశయమని చెబుతున్నారు.రాష్ట్ర స్థాయిలో క్రీడాకారులను తయారు చేసేందుకు వీలుగా క్రికెట్ కిట్ కూడా ఇస్తూ శిక్షణ ఇస్తున్నామని కోచ్‌లు చెబుతున్నారు. నైపుణ్యం గల యువకులను క్రికెట్ అకాడమీకి కూడా ఎంపిక చేస్తామంటున్నారు.