NDA Leaders Election Campaign State Wide : ఎన్నికలు దగ్గరపడటంతో అభ్యర్థులు ప్రచారంలో దూసుకెళ్తున్నారు. కూటమి నేతలు ముమ్మరంగా ఇంటింటి ప్రచారం చేస్తున్నారు. వైఎస్సార్సీపీ అరాచకాలను ఎండగడుతూ జగన్ పాలనలో జరిగిన నష్టాన్ని వివరిస్తున్నారు. తెలుగుదేశం నేతలు సూపర్ సిక్స్ పథకాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్తూ ఓట్లు అభ్యర్థిస్తున్నారు.
అధికారంలోకి రాగానే అన్ని సమస్యలకు పరిష్కరం : తిరుపతి జిల్లా సూళ్లూరుపేట నియోజకవర్గ కూటమి అభ్యర్థి విజయశ్రీ నాయుడుపేటలో ప్రచారం నిర్వహించారు. విజయశ్రీని ఆప్యాయంగా పలకరించిన స్థానిక మహిళలు సమస్యలు చెప్పుకుని ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి అధికారంలోకి రాగానే అన్ని సమస్యలు పరిష్కరిస్తామని ఆమె భరోసానిచ్చారు. తెలుగుదేశం సూపర్ సిక్స్ పథకాలను మహిళలకు వివరించారు. శ్రీ సత్యసాయి జిల్లా కదిరి మండలంలోని తండాల్లో కూటమి అభ్యర్థి కందికుంట వెంకటప్రసాద్ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. స్థానికులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. వెంకటప్రసాద్ వెంట తిరుగుతూ ఓటర్లను పరిచయం చేశారు. కందికుంట వెంకటప్రసాద్‌కు మద్దతుగా ఆయన సతీమణి యశోదా దేవి కూటమి శ్రేణులతో కలిసి కదిరిలో ప్రచారం చేశారు. ఇంటింటికి తిరుగుతూ సైకిల్ గుర్తుపై ఓటు వేసి వెంకటప్రసాద్‌ను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. వైఎస్సార్ జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గం ఎర్రగుంట్ల మండలంలో కూటమి అభ్యర్థి ఆదినారాయణరెడ్డి ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి తిరుగుతూ ఎమ్మెల్యేగా తనను, ఎంపీ అభ్యర్థిగా భూపేష్‌రెడ్డిని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.
ఐదేళ్ల వైసీపీ పాలనలో అన్ని అక్రమాలే : నెల్లూరు జిల్లా కోవూరు కూటమి అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి ఇందుకూరుపేట మండలంలో ప్రచారం చేశారు. ఆమెకు మహిళలు ఘన స్వాగతం పలికారు. ఐదేళ్ల వైఎస్సార్సీపీ పాలన అవినీతి, అక్రమాలమయమని ప్రశాంతిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే ప్రసన్నకుమార్‌రెడ్డిపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. నంద్యాల జిల్లా డోన్‌లో తెలుగుదేశం జెండా ఎగురుతుందని కూటమి అభ్యర్థి కోట్ల జయసూర్యప్రకాష్ రెడ్డి అన్నారు. ఎర్రగుంట్ల, పెద్ద మల్కాపురం గ్రామాల్లో ప్రచారం నిర్వహించిన ఆయన తాగునీటి సమస్య లేకుండా చేస్తానని హామీ ఇచ్చారు. తెలుగుదేశం సూపర్ సిక్స్ పథకాలను మహిళలకు వివరించారు.
వైఎస్సార్సీపీలో భగ్గుమన్న వర్గ విభేదాలు : పాణ్యం నియోజకవర్గ కూటమి అభ్యర్థి గౌరు చరిత ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఓర్వకల్లు మండలంలోని గ్రామాల్లో పర్యటించారు. మహిళలు పెద్ద సంఖ్యోల ప్రచారంలో పాల్గొని గౌరు చరితకు మద్దతు ఇచ్చారు. గ్రామాల్లో నిర్వహించిన రోడ్‌షోకు స్థానికుల బ్రహ్మరథం పట్టారు. కర్నూలు జిల్లా ఆదోనిలో కూటమి అభ్యర్థి పార్థసారథి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. రోడ్‌షో ఏర్పాటు చేసి వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్‌రెడ్డిపై ధ్వజమెత్తారు. ఎమ్మిగనూరులోని 33వార్డులో కూటమి అభ్యర్థి బీవీ జయనాగేశ్వరరెడ్డి ఇంటింటి ప్రచారం చేశారు. మహిళలకు తెలుగుదేశం సూపర్ సిక్స్ పథకాలు వివరించారు. కూటమి అధికారంలోకి రాగానే నాలుగు వేల రూపాయలు పింఛన్ ఇస్తామని చెప్పారు. కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గ వైఎస్సార్సీపీలో వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. పెద్ద కడుబూరు మండలం చిన్నకడుబూరులో ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహిస్తుండగా రెండు వర్గాలుగా విడిపోయిన వైసీపీ శ్రేణులు ఎమ్మెల్యే ఎదుటే బాహాబాహీకి దిగారు. తర్వాత ప్రచార రథంపై బాలనాగిరెడ్డి ప్రసంగిస్తుండగా స్థానిక సమస్యలపై మహిళలు నిలదీశారు. పరిష్కరిస్తానని ఎమ్మెల్యే తెలిపినా మహిళలు శాంతించలేదు. సర్దిచెప్పే ప్రయత్నం చేసినా వెనక్కుతగ్గకపోడంతో చేసేదేమీ లేక బాలనాగిరెడ్డి వెనుదిరిగారు.
కూటమి నేతలకు అపూర్వ స్పందన : పల్నాడు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గం అచ్చంపేటలో కూటమి అభ్యర్థి భాష్యం ప్రవీణ్ ప్రచారం నిర్వహించారు. ఒక టీ దుకాణంలోకి వెళ్లిన భాష్యం ప్రవీణ్ కూటమి శ్రేణులకు టీ పోసి ఇచ్చారు. మహిళలకు తెలుగుదేశం సూపర్ పథకాలను వివరించారు. కరపత్రాలు పంచుతూ ఇంటింటికి తిరిగారు. గుంటూరు జిల్లా తాడికొండ నియోజకవర్గం మేడికొండూరు మండలం పేరేచర్లలో గుంటూరు పార్లమెంటు కూటమి అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ కుటుంబ సభ్యులు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. మహిళలు, వృద్ధులను ఆప్యాయంగా పలకరిస్తూ తెలుగుదేశం సూపర్ సిక్స్ పథకాలు వివరించారు. పెమ్మసాని కుటుంబ సభ్యులకు ప్రజల నుంచి అపూర్వ స్పందన లభించింది. విజయవాడ పశ్చిమ నియోజకవర్గ కూటమి అభ్యర్థి సుజనా చౌదరి ముఠా కార్మికులతో మాటామంతీ నిర్వహించారు. వారి సమస్యలు స్వయంగా తెలుసుకున్నారు. కూటమి అధికారంలోకి రాగానే ప్రత్యేక ప్రణాళిక రూపొందించి సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తామని సుజనా చౌదరి హామీ ఇచ్చారు.
జోరుగా సాగుతున్న కూటమి నేతల ప్రచారం - అడుగడుగునా జననీరాజనం - Lok Sabha elections 2024
కూటమికి మద్దతుగా బైక్ ర్యాలీలు : కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గ కూటమి అభ్యర్థి దాట్ల బుచ్చిబాబుకు బ్రహ్మరథం పట్టారు. ఐ. పోలవరం మండలంలో పర్యటించిన ఆయనకు స్థానిక మత్స్యకారులు వినూత్నంగా స్వాగతం పలికారు. పసుపు జెండాలతో వేలాది మంది కార్యకర్తలు గ్రామాల్లోకి ఆహ్వానించారు. బుచ్చిబాబు చిత్రాన్ని, తెలుగుదేశం చిహ్నాన్ని రంగులు, పూలతో ఆలంకరించారు. గ్రామ పెద్దలు బుచ్చిబాబును శాలువాతో సత్కరించారు. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు అసెంబ్లీ నియోజకవర్గ కూటమి అభ్యర్థి కందుల దుర్గేష్ పెరవలి మండలం తీపర్రు గ్రామంలో ప్రచారం నిర్వహించారు. ప్రజలు అడుగడుగునా ఆయన బ్రహ్మరథం పట్టారు. భారీ గజమాల వేసి, హారతులిచ్చి పూల చల్లుతూ స్వాగతం పలికారు. కేక్ కట్ చేసి సంబరాలు చేశారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో ఎంపీ అభ్యర్థి రామ్మోహన్ నాయుడు, ఎమ్మెల్యే అభ్యర్థి బెందాళం అశోక్ బాబు భారీ ఎత్తున బైక్ ర్యాలీ నిర్వహించారు. తర్వాత ఇఛ్చాపురంలోని వీధుల్లో ప్రచారం నిర్వహించారు. మండలంలోని పలు ప్రాంతాల్లో దశాబ్ధాలుగా వేధిస్తున్న తాగునీటి సమస్యను పరిష్కరిస్తామని రామ్మోహన్‌నాయుడు హామీ ఇచ్చారు.