NDA Leaders Election Campaign in State Wide : రాష్ట్రంలో ఎన్నికల ప్రచారానికి ఒక్కరోజే సమయం ఉండటంతో అభ్యర్థులు దూకుడు పెంచారు. కూటమి నేతలు ముమ్మరంగా ఇంటింటి ప్రచారం చేస్తున్నారు. వైఎస్సార్సీపీ అరాచకాలను ఎండగడుతూ జగన్ పాలనలో జరిగిన నష్టాన్ని వివరిస్తున్నారు. కూటమి ప్రకటింటిన మేనిఫెస్టోని అభ్యర్థులు విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్తూ ఓట్లు అభ్యర్థిస్తున్నారు. అలాగే వైఎస్సార్సీపీ నుంచి తెలుగుదేశంలోకి చేరికలు కొనసాగుతున్నాయి.
జోరుగా సాగుతున్న కూటమి నేతల ప్రచారం - అడుగడుగునా జననీరాజనం - Lok Sabha elections 2024
తెలుగుదేశం జెండాలు చేతపట్టి విస్తృత ప్రచారం : విజయనగరం జిల్లా చీపురుపల్లి కూటమి అభ్యర్థి కళా వెంకట్రావు గరివిడిలో నిర్వహించిన భారీ ర్యాలీకి మహిళలు పెద్దసంఖ్యలో తరలివచ్చారు. తెలుగుదేశం జెండాలు చేతపట్టి పట్టణంలో తిరిగారు. తర్వాత రోడ్‌షోలో మాట్లాడిన కళా వెంకట్రావు గరివిడి రైల్వే అండర్ బ్రిడ్జి నిర్మాణానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. బొబ్బిలిలో కూటమి అభ్యర్థి బేబి నాయనకు మద్దతుగా మాజీ మంత్రి సుజయకృష్ణ రంగారావు ప్రచారం చేశారు. వార్డుల్లో ప్రజలు ఆయనకు బ్రహ్మరథం పట్టారు. తర్వాత సుజయకృష్ణ ఇంటింటికి తిరిగి బేబినాయనకు ఓటేసి గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కూటమి గెలుపుతోనే బొబ్బిలి నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందని భరోసానిచ్చారు.
జోరు వానలో సైతం తగ్గని అభిమానం : పాడేరులో కూటమి అభ్యర్థి గిడ్డి ఈశ్వరి ఆధ్వర్యంలో తెలుగుదేశం శ్రేణులు భారీ ర్యాలీ నిర్వహించాయి. జోరు వానలో సైతం అభిమానులు, కార్యకర్తలు ర్యాలీ పాల్గొన్నారు. వర్షంలో తడుస్తూ నృత్యాలు చేశారు. తెలుగుదేశం జెండాలతో పాడేరు వీధులు పసుపుమయమయ్యాయి. ఏలూరు జిల్లా చింతలపూడి కూటమి అభ్యర్థి సొంగా రోషన్ జంగారెడ్డిగూడెంలో ప్రచారం చేశారు. స్థానికులు ఆయనకు భారీ బైక్ ర్యాలీతో స్వాగతం పలికారు. తర్వాత రోడ్‌షో నిర్వహించిన సొంగా రోషన్ ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు. బాపట్ల జిల్లా చీరాల కూటమి అభ్యర్థి మాలకొండయ్యను గెలిపించాలని కోరుతూ హీరో నిఖిల్ రోడ్‌షో నిర్వహించారు. మాలకొండయ్యను గెలిపిస్తే చీరాల నియోజకవర్గానికి అభివృద్ధి అంటే ఏంటో చేసి చూపిస్తారని నిఖిల్ అన్నారు.
కూటమికి మద్దతుగా మందకృష్ణ మాదిగ ప్రచారం : విజయవాడ పశ్చిమ నియోజకవర్గ కూటమి అభ్యర్థి సుజనా చౌదరిని గెలిపించాలని కోరుతూ మందకృష్ణ మాదిగ ప్రచారం చేశారు. చిట్టినగర్ ప్రాంతంలో సుజనా చౌదరితో కలిసి రోడ్‌షో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానికులు, ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కూటమి ప్రభుత్వంతోనే సాధ్యమని మందకృష్ణ అన్నారు. కృష్ణా జిల్లా అవనిగడ్డ కూటమి అభ్యర్థి మండలి బుద్ధప్రసాద్ నాగాయలంక మండలంలో రోడ్‌షో నిర్వహించారు. స్థానికులు, గ్రామస్థులు ఆయనకు అపూర్వ స్వాగతం పలికారు. పూలమాల వేసి హారతులిచ్చారు. ఎమ్మెల్యే అభ్యర్థిగా తనను, ఎంపీ అభ్యర్థిగా బాలశౌరిని గెలిపిస్తే చివరి భూములకు సాగునీరు అందేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే కూటమి ప్రభుత్వం రావాలి : నంద్యాల జిల్లా పాణ్యం నియోజకవర్గ కూటమి అభ్యర్థి గౌరు చరితకు భూపనపాడులో గ్రామస్థులు ఘన స్వాగతం పలికారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే కూటమిని గెలిపించాలని ఆమె కోరారు. అనంతపురం జిల్లా ఆత్మకూరులో కూటమి అభ్యర్థులు భారీ రోడ్‌షో నిర్వహించారు. రాప్తాడు కూటమి అభ్యర్థి పరిటాల సునీత, హిందూపురం పార్లమెంటు అభ్యర్థి బీకే పార్థసారథి రోడ్‌షోలో పాల్గొన్నారు. రాప్తాడు నియోజకవర్గంలో తోపుదుర్తి సోదరులకు వణుకు మొదలైందని పరిటాల సునీత ధ్వజమెత్తారు.
తెలుగుదేశంలోకి భారీగా చేరికలు : నంద్యాల జిల్లా డోన్ నియోజకవర్గంలో తెలుగుదేశంలోకి భారీగా చేరికలు జరిగాయి. కూటమి అభ్యర్థి కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి, ఆయన సతీమణి సుజాతమ్మ ఆధ్వర్యంలో 50 కుటుంబాలు తెలుగుదేశం కండువా కప్పుకున్నాయి. ఉంగరాణిగుండ్ల సర్పంచ్ చిన్నమద్ది, తన అనుచరులు దాదాపు 600 మంది వైఎస్సార్సీపీను వీడి కోట్ల సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు.