NDA Alliance Manifesto Release : సూపర్‌సిక్స్ హామీలైన సామాజిక పింఛన్లు 4వేల రూపాయలకు పెంపు, ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితం, మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం వంటి హామీలతో ప్రజల దృష్టిని ఆకర్షించిన ఎన్డీఏ కూటమి నేడు పూర్తిస్థాయి మేనిఫెస్టో విడుదల చేయనుంది.
రాజమహేంద్రవరంలో 11 నెలల క్రితం నిర్వహించిన మహానాడులోనే సూపర్‌సిక్స్ (TDP Super six) పేరిట మినీ మేనిఫెస్టోను తెలుగుదేశం పార్టీ ప్రకటించింది. జనసేనతో పొత్తు ఖరార్యయాక మరికొన్ని హామీలు జోడించింది. బీజేపీతో జట్టు కట్టిన తర్వాత మూడు పార్టీల నేతలు ఉమ్మడి మేనిఫెస్టోపై సుదీర్ఘ కసరత్తు చేశారు. 'నేటి అవసరాలు తీరుస్తాం - రేపటి ఆకాంక్షలు నెరవేరుస్తాం' అంటూ తుది రూపు నిచ్చారు. ముఖ్యంగా గత ప్రభుత్వ హయాంలోని పథకాలను వైఎస్సార్సీపీ రద్దు చేయగా వాటిని తిరిగి పునురద్ధరించే అవకాశం ఉంది. అన్న క్యాంటీన్‌లు, పండుగ కానుకలు తిరిగి ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. 'అధిక పన్నులు, భారాల బాదుడు లేని సంక్షేమం- ప్రతి ప్రాంతంలో అభివృద్ధి' అన్నది ప్రధానాంశంగా మ్యానిఫెస్టోను రూపొందించినట్టు సమాచారం.
ఎన్డీఏ కూటమి మేనిఫెస్టో : ఎన్నికల ప్రచార బహిరంగ సభల్లో చంద్రబాబు, పవన్ ఇచ్చిన హామీలను మేనిఫెస్టోలో చేర్చినట్లు తెలుస్తోంది. మెగా డీఎస్సీపై మొదటి సంతకం చేయటంతో పాటు సామాజిక పింఛను 4 వేలకు పెంచి వాటిని ఈ ఏప్రిల్ నుంచే వర్తించేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. నగదున కూడా ఇంటి వద్దే అందజేస్తామని స్పష్టం చేశారు. దివ్యాంగులకు పింఛను 6 వేలకు పెంచటంతో పాటు బీసీలకు 50 ఏళ్లకే పింఛను ఇస్తామని ప్రకటించారు. ఆడబిడ్డ నిధి కింద 18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు నెలకు 15 వందలు చొప్పున ఏడాదికి 18 వేలు అందజేస్తామని హామీ ఇచ్చారు.
యువతకు ఏటా 4 లక్షల చొప్పున ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పనకు భరోసా ఇచ్చారు. నిరుద్యోగ యువతకు నెలకు 3 వేల చొప్పున భృతి ప్రకటించారు. 'తల్లికి వందనం' కింద చదువుకుంటున్న పిల్లలకు ఒక్కొక్కరికి ఏడాదికి 15 వేల చొప్పున ఆర్థిక సాయం చేస్తామని హామీ ఇచ్చారు. రైతులకు ఏడాదికి 20 వేల చొప్పున పెట్టుబడి సాయంతో పాటు వాలంటీర్ల గౌరవ వేతనం 10 వేలకు పెంచుతామని భరోసా ఇచ్చారు. ఇవన్నీ మ్యానిఫెస్టోలో ఉండే అవకాశం ఉంది.
ప్రతి కుటుంబానికి రెండు సెంట్ల స్థలం, ఇంటి నిర్మాణం, ఉచిత ఇసుక విధానాన్ని తిరిగి పునరుద్ధరించనున్నారు. బీసీల రక్షణకు ప్రత్యేక చట్టం ఏర్పాటు, ప్రతి ఇంటికీ ఉచిత కుళాయి కనెక్షన్, స్వచ్ఛమైన తాగునీటి సరఫరా వంటి ఎన్నో అంశాలను ఇప్పటికే ప్రకటించారు. భూ హక్కు చట్టం రద్దు చేయటం తో పాటు కరెంటు ఛార్జీలు పెరగవని కూటమి నేతలు ఇప్పటికే హామీ ఇచ్చారు. చేనేత కార్మికులకు మగ్గం ఉంటే 200, మర మగ్గాలుంటే 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇవ్వనున్నారు. పెళ్లి కానుక కింద లక్ష అందజేయనున్నారు. విదేశీ విద్య పథకం వంటి హామీలకు మ్యానిఫెస్టోలో చోటు కల్పించనున్నారు. రైతులకు గతంలో టీడీపీ ప్రభుత్వం అందించిన రాయితీ పథకాలు పునరుద్ధరించటం, ఆక్వా రైతులకు రూపాయిన్నరకే యూనిట్ విద్యుత్ ఇవ్వనున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు పథకాల పునరుద్ధరించటం తో పాటు చేనేతలకు ప్రత్యేక విధానాలు ప్రకటించనున్నారు.
ఇప్పటికే కూటమి అభ్యర్థులు సూపర్‌సిక్స్ పథకాలను ఇంటింటికి చేరువ చేశారు. ఎన్నికల ప్రచారంలో కరపత్రాలు పంపిణీ చేస్తున్నారు. ఉద్యోగాలు, సంక్షేమం, అభివృద్ధి సమ్మిళితంగా రానున్న కూటమి పూర్తిస్థాయి మేనిఫెస్టో ప్రజలకు మరింత చేరువ చేసేందుకు టీడీపీ నేతలు సిద్ధమవుతున్నారు.