YSRCP Irregularities Darshans in Tirumala : కలియుగ వైకుంఠనాథుడు తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామిని క్షణకాలం దర్శించుకుంటే చాలని భక్తులు భావిస్తారు. అలాంటిది నిమిషాల కొద్దీ శ్రీవారి ఆలయంలో ఉండటం, ఆర్జిత సేవలో పాల్గొనడం, సామాన్య భక్తులకు ఊహకైనా అందదు. కానీ వైఎస్సార్సీపీ వాళ్లు మాత్రం సకల సౌకర్యాలతో ఆలయంలో తిష్ఠవేసి మరీ సామాన్య భక్తుల్ని ఇబ్బందిపెట్టిన ఘటనలు అనేకం.
సిఫార్సులతో పాటు పదవులను అడ్డుపెట్టుకుని వైఎస్సార్సీపీ పాలనలో మంత్రులు నెలలో రెండు, మూడు సార్లు శ్రీవారి దర్శనానికి వస్తూ సామాన్య భక్తులకు ఇబ్బందులకు గురి చేశారు. మాజీ మంత్రులు రోజా, వేణుగోపాలకృష్ణ, నారాయణస్వామి, మేరుగ నాగార్జున, కారుమూరి నాగేశ్వరావు , ఎంపీలు ఎంవీవీ సత్యనారాయణ, గోరంట్ల మాధవ్, బెల్లాన చంద్రశేఖర్లు మందీమార్బలంతో, సకల లాంఛనాలతో దర్శనం చేసుకోగా, సామాన్య భక్తులను ఇబ్బందులకు గురిచేశారు
YSRCP Leaders Anarchists in Tirumala : ఎన్డీయే కూటమి సుపరిపాలన తిరుమల ప్రక్షాళన నుంచే ప్రారంభం అవుతుందన్న ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలతో టీటీడీలో ఒక్కొక్కటిగా మార్పులు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే రోజుకు వందల సంఖ్యలో వీఐపీ బ్రేక్ దర్శనాలు తీసుకొన్న అమాత్యుల అక్రమాలు బయటకు వస్తున్నాయి. వ్యక్తిగత, రాజకీయ లబ్ధి కోసం తిరుమలలో హవా చూపించుకునేందుకు గత ప్రభుత్వ మంత్రులు తమ సిఫారసు లేఖలతో భారీగా వీఐపీ బ్రేక్ దర్శనాలు పొందిన ఘటనలు కలకలం రేపుతున్నాయి.
తక్కువ సిఫార్సులు చేస్తానని చెప్పుకున్న మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఈ ఏడాది ఫిబ్రవరి 12న ఒకరోజే బ్రేక్ దర్శనాలు, ఆర్జిత సేవలకు 74 మందిని సిఫార్సు చేసిన తీరు తీవ్ర చర్చనీయాంశమైంది. తోమాలసేవకు నలుగురు, ప్రొటోకాల్ బ్రేక్ దర్శనాలకు ఆరుగురు, 12 మందికి కల్యాణోత్సవం, 52 మందికి వీఐపీ బ్రేక్ దర్శనాలు చొప్పున తమ అనుచరులను పంపారు.
పదుల సంఖ్యలో టికెట్లు పొందిన నేతలు : మాజీ మంత్రి రోజా ఏపీఐసీసీ ఛైర్మన్ హోదాలో 2021 నవంబర్ నెలలో భక్తుల పేర్లు కూడా లేకుండా 20 మందికి బ్రేక్ దర్శనాలు కేటాయించాలని సిఫార్సు చేశారు. మాజీ ఉప ముఖ్య మంత్రి నారాయణస్వామితో పాటు పలువురు మంత్రులు రోజుకు పదుల సంఖ్యలో వీఐపీ బ్రేక్ దర్శనం, ఆర్జిత సేవా టికెట్లు పొంది, సామాన్య భక్తులు క్యూలైన్లో అగచాట్లు పడేలా చేశారు.
"ఒక మంత్రికి 54 టికెట్లు ఇచ్చారు. మాజీ మంత్రి రోజా, మాజీ ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి తిరుమలలో చాలా దోచుకున్నారు. దీనిపై ప్రశ్నిస్తే కేసులు పెట్టేవారు. ఇప్పుడు ఆ లిస్ట్ మొత్తాన్ని బయటకు తెస్తాం. అక్రమాలు చేసిన వారిని వదిలిపెట్టేది లేదు. దీనిపై కమిటీ వెేస్తామని, జనసేన పార్టీ లక్ష్యం తిరుమల ప్రక్షాళన. - కిరణ్ రాయల్, జనసేన నేత
తిరుమల కొండపై వైఎస్సార్సీపీ నేతల దందా - పవిత్రత గోవిందా - YSRCP Anarchists in Tirumala