Nara Lokesh Take Charge as Minister: ఐటీ, విద్యాశాఖ మంత్రిగా నారా లోకేశ్ బాధ్యతలు చేపట్టారు. బాధ్యతలు చేపట్టేందుకు సచివాలయానికి వచ్చిన లోకేశ్‌కు దేవదాయ శాఖ ముఖ్య కార్యదర్శి సత్యనారాయణ పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. వేద మంత్రోచ్ఛారణల మధ్య మంత్రి లోకేశ్ తన ఛాంబర్లోకి అడుగు పెట్టారు. ఛాంబర్లో ప్రత్యేక పూజలు చేశారు. సచివాలయంలో ఉదయం 9.45 గంటలకు బాధ్యతలు తీసుకున్నారు.
సచివాలయంలో 4వ బ్లాక్ లోని మొదటి అంతస్థులో ఉన్న 208వ గదిలో లోకేశ్ కార్యాలయం ఏర్పాటు చేశారు. బాధ్యతలు చేపట్టిన లోకేశ్‌కు మంత్రులు, పార్టీ ఎమ్మెల్యేలు, నేతలు శుభాకాంక్షలు తెలిపారు. బాధ్యతల స్వీకరణకు ముందే లోకేశ్ తన శాఖల్లో ప్రక్షాళన దిశగా అడుగులు వేశారు. విద్యారంగంలో విప్లవాత్మక సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. ఇప్పటికే ఐటీ, ఎలక్ట్రానిక్స్ రంగాల్లో ఉద్యోగాల కల్పనకు 100 రోజుల యాక్షన్ ప్లాన్ తయారు చేయాలని అధికారులకు లోకేశ్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
తొలి సంతకం చేసిన మంత్రి లోకేశ్: తన మంత్రి కుర్చీకి ఎలాంటి ఆర్భాటాలు వద్దని కుర్చీకి చుట్టిన టవల్ని తీసివేయించారు. మంత్రిగా కుర్చీలో ఆశీనులయ్యారు. మెగా డీఎస్సీ దస్త్రంపైనే లోకేశ్ తొలి సంతకం చేశారు. మెగా డీఎస్సీ ద్వారా 16 వేల 347 పోస్టుల భర్తీకి ముఖ్యమంత్రి చంద్రబాబు తొలిసంతకం చేసిన దస్త్రం పైనే సంబంధిత శాఖ మంత్రిగా లోకేశ్ తొలిసంతకం పెట్టారు. మెగా డీఎస్సీ విధివిధానాలు రూపొందించి క్యాబినెట్ ముందుకు పెడుతూ సంతకం చేశారు.
Minister Kollu Ravindra Takes Charge: గనులు - భూగర్భ శాఖ, ఎక్సైజ్ శాఖల మంత్రిగా కొల్లు రవీంద్ర బాధ్యతలు స్వీకరించారు. సచివాలయం మూడో బ్లాక్‌లో మంత్రి కొల్లు రవీంద్ర ఛార్జి తీసుకున్నారు. బాధ్యతల స్వీకరణకు ముందు మంత్రి కుటుంబసభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు చేశారు. గనుల శాఖ ప్రధాన కార్యదర్శి యువరాజ్, గనుల శాఖ డైరెక్టర్ ప్రవీణ్ కుమార్, ఎక్సైజ్ శాఖ అధికారులు మంత్రికి అభినందనలు తెలిపారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్, మంత్రి నారా లోకేశ్, బీజేపీ ఆశీస్సులతో మంత్రిగా బాధ్యతలు చేపట్టానని కొల్లురవీంద్ర తెలిపారు. కీలక శాఖలకు తనకు అవకాశం ఇచ్చారని, తన పదవిని బాధ్యతగా భావిస్తున్నానని అన్నారు.
గత ఐదేళ్లలో ఎక్సైజ్ శాఖను భ్రష్టు పట్టించారని ఆరోపించారు. ప్రజల మాన ప్రాణాలకు విలువ లేకుండా చేశారన్నారు. ఎక్సైజ్ శాఖను మొత్తం నిర్వీర్యం చేశారని మండిపడ్డారు. అక్రమాలకు బయటకు తీసి చట్టపరంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. రాష్ట్రంలో ఉన్న ఖనిజ సంపదను ప్రభుత్వ ఆదాయానికి కాకుండా సొంత అవసరాలకు వినియోగించుకున్నారన్నారు. రెండు శాఖల్లో త్వరలో కొత్త పాలసీని తీసుకొస్తామని తెలిపారు. గతంలో ఇసుకలో భారీగా అక్రమాలు జరిగాయని మంత్రి కొల్లు రవీంద్ర ఆరోపించారు.