Nara Lokesh Letter to Mangalagiri People : మంగళగిరి నియోజకవర్గ ప్రజలకు నారా లోకేశ్ బహిరంగ లేఖ రాశారు. ఐదేళ్లుగా మంగళగిరి ప్రజల కష్టసుఖాలన్నింటిలో పాలుపంచుకున్నాని తెలిపారు. నా కుటుంబసభ్యుల్లా భావించి మంగళగిరి ప్రజలకు సేవలందించానని వెల్లడించారు. సొంత నిధులతో 29 సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టానని గుర్తుచేశారు. అధికారంలో లేకపోయిన మంగళగిరి చేనేత కార్మికుల జీవితాల్లో మార్పు తెచ్చానని తెలిపారు. అందరం కలసి మంగళగిరిని ఆదర్శ నియోజకవర్గం చేద్దామని లోకేశ్ లేఖలో వెల్లడించారు.
'లోకేశ్‌ను గెలిపించండి'- మంగళగిరిలో ఎన్టీఆర్ కుటుంబం ఎన్నికల ప్రచారం
పేదరికం లేని మంగళగిరి నా కల : అదేవిధంగా ‘‘పేదరికం లేని మంగళగిరి నా కల’’ అంటూ యువనేత లేఖలో పేర్కొన్నారు. శతాబ్ధాల చరిత్ర కలిగిన మంగళగిరి రాజకీయ చైతన్యానికి పుట్టినిల్లన్నారు. కృష్ణమ్మ పరవళ్లు, ప్రకృతిసోయగాల నడుమ నిత్యనూతనంగా విరాజిల్లే సుందరమైన ప్రాంతం మంగళగిరి నియోజకవర్గమన్నారు. మంగళగిరి ప్రజల ప్రేమ, అభిమానం తనను కట్టిపడేశాయని తెలిపారు. మంగళగిరి ప్రజల హృదయాలను గెలవాలని నిర్ణయించుకున్నట్లు స్పష్టం చేశారు.
ఎక్కడ ఉన్న మనసంతా మంగళగిరిలోనే : అధికారంలో లేకపోయిన ఐదేళ్లుగా నియోజకవర్గ ప్రజల కష్టసుఖాల్లో పాలుపంచుకున్నానని అన్నారు. యువగళం పాదయాత్ర ప్రారంభించక ముందే నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో పాదయాత్ర చేశానని తెలిపారు. ప్రతి ఒక్క గడప తొక్కానని, నేరుగా ప్రజల సమస్యలు తెలుసుకున్నానని తెలిపారు. యువగళం పాదయాత్ర సందర్భంగా దాదాపు ఏడాది పాటు నియోజకవర్గానికి దూరంగా ఉన్నానని వెల్లడించారు. అయిన తన మనసంతా మంగళగిరిలోనే అని చెప్పుకొచ్చారు. కుటుంబసభ్యుల్లా ఇక్కడి ప్రజలు తరచూ తనను కలుస్తూ తనపై చూపిన ఆప్యాయత మాటల్లో చెప్పలేనని లోకేశ్ అన్నారు. వారందించిన ప్రోత్సాహంతోనే రాష్ట్రవ్యాప్తంగా 3132 కిలోమీటర్ల పాదయాత్రను పూర్తిచేయగలిగానని లోకేశ్ వెల్లడించారు.
మంగళగిరిని దేశంలోనే నెం.1గా తీర్చిదిద్దుతా : జగన్ సర్కారు నాన్నపై తప్పుడు కేసులు పెట్టి 53 రోజులు రాజమండ్రి జైలులో పెట్టినప్పుడు మంగళగిరి ప్రజలు ఇచ్చిన మద్దతు, మనోధైర్యం జీవితంలో మరువలేనన్నారు. 25 ఏళ్లు నియోజకవర్గాన్ని పాలించిన రెండు కుటుంబాలు చేసింది ఏంటో ప్రజలంతా ఒక్క సారి ఆలోచించాలని కోరారు. రెండుసార్లు శాసనసభ్యుడిగా పనిచేసిన వ్యక్తి పత్తాలేకుండా పోతే నియోజకవర్గ ప్రజలకు ఏ కష్టమొచ్చినా నేను అండగా ఉన్నానని తెలిపారు. మంగళగిరి ప్రజలను ఎప్పుడు నా కుటుంబసభ్యులుగా భావించి సేవలందించానని వెల్లడించారు. సొంత నిధులతో 29 సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టానన్నారు. ఒక వ్యక్తిగానే ఇంత చేసిన నన్ను శాసనసభకు పంపితే ఏవిధంగా సేవచేస్తానో చైతన్యవంతులైన మంగళగిరి ప్రజలు ఆలోచించాలని కోరారు. వ్యక్తిగతంగా ఎంత చేసినా మంగళగిరి రూపురేఖలు మార్చడానికి నేను చేయాల్సింది చాలా ఉందన్నారు. మంగళగిరిని దేశంలోనే నెం.1గా తీర్చిదిద్ది, పేదరికం లేని మంగళగిరిని చూడాలన్నదే నా సంకల్పమని స్పష్టం చేశారు. అందరం కలసి ఆదర్శ మంగళగిరిని తయారు చేసుకుందాం అంటూ లోకేశ్ లేఖలో పేర్కొన్నారు.