Nara Lokesh Election Campaign in Tadepalli : ముఖ్యమంత్రి జగన్‌కు ఆస్తుల కంటే కేసులు ఎక్కువ ఉన్నాయని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చెప్పారు. ఇదే విషయాన్ని ఆయనే గత ఎన్నికల సమయంలో ఇచ్చిన అఫడవిట్లో 420 కేసులు ఎనిమిది ఉన్నాయని పేర్కొన్నారన్నారు. బ్రేక్ ఫాస్ట్ విత్ లోకేశ్ కార్యక్రమంలో భాగంగా మంగళగిరి నియోజకవర్గంలో తాడేపల్లిలోని పైన్ ఉడ్ అపార్టుమెంట్ వాసులతో నారా లోకేశ్, ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ సమావేశమయ్యారు.
పార్టీ అధికారంలోకి రాగానే యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగాలు కల్పిస్తామన్నారు. పోలీసుల శాఖలోని ఖాళీలన్నీ భర్తీ చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఈ నియామకాలన్నీ పూర్తి పారదర్శకతో చేపడతామన్నారు. గతంలో పోలీసు విభాగాన్ని పూర్తిగా ఆధునికీకరించామన్నారు. ఉద్యోగాల భర్తీలో చైనా విధానాన్ని పాటిస్తామన్నారు. ఎవరు ఎక్కువ ఉద్యోగాలు కల్పిస్తారో అలాంటి పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహిస్తామన్నారు.
తన రాజకీయ ప్రయోజనాల కోసం జగన్ సమాజంలో చీలిక తెస్తున్నాడని నారా లోకేశ్ ధ్వజమెత్తారు. సమస్యలు తెలుసుకునేందుకు అపార్టుమెంట్ వాసులతో సమావేశమవుతుంటే పెత్తందార్ల ముద్ర వేస్తున్నారని ఆయన మండిపడ్డారు. అపార్టుమెంట్లలో నివసించే వారంతా పెత్తందారులైతే, ప్యాలెస్లో నివసించే జగన్ ఏంటని ఆయన నిలదీశారు. జగన్ దృష్టంతా అవినీతి సంపాదనపై తప్ప అభివృద్ధి, ఉద్యోగాల కల్పనపై లేదని దుయ్యబట్టారు. ఎన్నికల్లో గొడవలు సృష్టిస్తారని, ఓర్పు, సహనంతో అందరూ ఓటు వేయాలని పిలుపునిచ్చారు.
జగన్ 12 లక్షల కోట్ల రూపాయలు అప్పుచేసి బటన్ నొక్కడంతో ఆ భారం ధరల పెంపు, పన్నుల రూపంలో తిరిగి ప్రజలపైనే పడుతోందని మండిపడ్డారు. చంద్రబాబు నేతృత్వంలో ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆగిపోయిన వద్ద నుంచే అమరావతి పనులు ప్రారంభిస్తామని స్పష్టం చేశారు. విధ్వంసక విధానాల కారణంగా దెబ్బతిన్న ఇన్వెస్టర్ల సెంటిమెంట్ బలపడాలంటే కనీసం పదేళ్లపాటు ప్రజా ప్రభుత్వం ఉండేలా చూడాల్సిన బాధ్యత ప్రజలదేనని నారా లోకేశ్ అన్నారు.
"వాళ్లు గొడవలు సృష్టిస్తారు, ఇబ్బందులు పెడతారు. 2019లో కూడా అలాగే చేశారు. మనం ఆ ట్రాప్లో పడకూడదు. ప్రతి ఓటు వేసేలా మీరు చూసుకోండి. మీ ఓటును చెక్ చేసుకుంటూ ఉండండి. ఎందుకంటే జగన్ని మించిన దొంగ లేడు. జగన్‌కు ఆస్తుల కంటే కేసులే ఎక్కువ, ఆ విషయాన్ని స్వయంగా ఆయనే అఫడవిట్లో తెలిపారు. సొంత బాబాయిని లేపేసి ఆ నింద మాపైన వేశారు. అయిదు సంవత్సరాల తర్వాత వాస్తవాలు బయటకు వచ్చాయి. ఆంధ్రప్రదేశ్లో ఎక్కడకి వెళ్లినా గంజాయి విపరీతంగా దొరుకుతుంది. ఒక తరం మొత్తాన్ని ఈ ప్రభుత్వం నాశనం చేస్తోంది. అధికారంలోకి వచ్చిన వెంటనే పోలీసుల శాఖలోని ఖాళీలన్నింటినీ భర్తీ చేస్తాము. ఈ ముఖ్యమంత్రికి బటన్లు నొక్కడం తప్ప సంపద ఎలా సృష్టించాలి అనే ఆలోచన లేదు". - నారా లోకేశ్, తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి