Nara Bhuvaneswari Nijam Gelavali Yatra: రాబోయే రోజుల్లో మహిళలకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు టీడీపీ తరపున బాధ్యత తీసుకుంటామని టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి భువనేశ్వరి అన్నారు. 'నిజం గెలవాలి'లో భాగంగా కర్నూలు జిల్లాలో నారా భువనేశ్వరి పర్యటించారు. 'మీ ఓటు మీ భవిష్యత్తు' కార్యక్రమంలో భాగంగా ఆమె పత్తికొండ గోపాల్ ప్లాజాలో ఏర్పాటు చేసిన మొదటి ఓటరు అవగాహన సదస్సులో యువతీ, యువకులకు అవగాహన కల్పించారు. మీ భవిత మీ చేతుల్లోనే ఉందని, దాన్ని ఓటు హక్కు ద్వారా సద్వినియోగం చేసుకోవాలన్నారు.
త్వరలో జరిగే ఎన్నికల్లో మీ ఓటును రాష్ట్ర అభివృద్ధిని ఆకాంక్షించే పార్టీకి, యువత బంగారు భవిష్యత్తుకు పాటుపడే పార్టీని ఎన్నుకోవాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. చంద్రబాబు అధికారంలోకి వస్తే యువత, మహిళలకు పెద్ద పీట వేస్తారన్నారు. ఆయన ఈ వయసులోనూ రాష్ట్రంలో అరాచక పాలన అంతానికి కృషి చేస్తున్నారని, ఆయనకు మద్దతుగా అందరూ నిలవాల్సిన అవసరం ఉందన్నారు.
భువనేశ్వరి అరకు కాఫీ రుచి ఎలా ఉంది ? - చంద్రబాబు ట్వీట్ - 'నచ్చిందంటూ' రిప్లై
ఈ సందర్భంగా 'కలలకు రెక్కలు' అనే పథకాన్ని నారా భువనేశ్వరి ప్రకటించారు. టీడీపీ-జనసేన ప్రభుత్వంలో 'కలలకు రెక్కలు' ప్రారంభమవుతుందన్న భువనేశ్వరి, ఇంటర్ పూర్తయి ఉన్నత చదువులకు వెళ్లాలనుకునే విద్యార్థినుల కోసం ఈ పథకం అని చెప్పారు. ప్రొఫెషనల్ కోర్సులు నేర్చుకునేవారికి ప్రభుత్వ గ్యారెంటీతో బ్యాంకు రుణాలు ఇస్తామని, బ్యాంకు నుంచి పొందే రుణాలకు వడ్డీ పూర్తిగా ప్రభుత్వమే చెల్లిస్తుందని అన్నారు.
చెక్కులు అందజేత: మొదట కోడుమూరు మండలం ప్యాలకుర్తిలో నాగార్జున గౌడ్ కుటుంబాన్ని సందర్శించి ఓదార్చారు. అనంతరం గూడూరు పట్టణంలో పడమర బీసీ కాలనీలో మృతి చెందిన గౌరన్న, షేక్ షావలి కుటుంబాలను, మండల పరిధిలోని పెంచికలపాడు గ్రామంలో మృతుడు మహబూబ్ బాషా కుటుంబాన్ని సందర్శించి కుటుంబ సభ్యులను ఓదార్చారు 3 లక్షల చెక్కును అందజేశారు. తెలుగుదేశం పార్టీ కుటుంబాలకు అండగా ఉంటుందని బాధితులకు భరోసా ఇచ్చారు.
టీడీపీ కార్యకర్తలకు ఎప్పుడూ అండగా ఉంటాం: నారా భువనేశ్వరి
పిల్లల భవిష్యత్ కోసం ఆలోచించి ఓటేయండి: రాష్ట్రంలో అవినీతి, అక్రమ పాలన కొనసాగుతుందని నారా భువనేశ్వరి ఆగ్రహంచారు. ఇప్పటికే కల్తీ మద్యం తాగి ఎందరో ప్రాణాలు కోల్పోయారని, యువత గంజాయికి అలవాటు పడి దేశంలో ఎక్కడలేని విధంగా మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడుతున్నారని అన్నారు. మీ పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే తిరిగి చంద్రబాబుకు ఓటేసి సహకరించాలని, తెలుగుదేశాన్ని గెలిపించుకోవాలని ఈ సందర్భంగా ఆమె కోరారు.
రాష్ట్రంలో దొంగల ప్రభుత్వం నడుస్తోందని తెలుగుదేశం కార్యకర్తలపై దొంగ కేసులు పెట్టి వేధించడంమే వైసీపీ ప్రభుత్వం చేస్తుందని అన్నారు. రాష్ట్ర అభివృద్ధి గురించి ఆలోచన చేసే నాయకుడు చంద్రబాబు అని వ్యాఖ్యానించారు. బిడ్డల భవిష్యత్తు, భావితరాల అభివృద్ధి గురించి ఆలోచన చేయండని సూచించారు. వచ్చే నెలలో కురుక్షేత్ర యుద్ధం జరుగుతోందని ఓటు అనే ఆయుధంతో వైసీపీ పార్టీనీ ఎదర్కొని టీడీపీ- జనసేనని గెలిపించాలని కోరారు.