Demolition of Muslim graveyard: విజయవాడలో ముస్లిం శ్మశానవాటికలో అభివృద్ధి పేరుతో సమాధులను పూడ్చివేసిన ఘటన కలకలం రేపింది. ఈ ఘటనపై అజిత్ సింగ్ నగర్ వాంబేకాలనీకి చెందిన ముస్లింలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ మనోభావాలు చెప్పనీయకుండా, అధికార పార్టీ నాయకులు గొంతు నొక్కివేస్తున్నారని, అభివృద్ధి పేరుతో సమాధులను పూడ్చిన ఘటనపై ముస్లింలు బయటకు వచ్చి వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై మండిపడుతున్నారు. అభివృద్ధి పేరుతో తమ పెద్దల ఆనవాలు లేకుండా చేస్తే ఎలా అని ప్రశ్నిస్తున్నారు.
ట్రాక్టర్లు, బుల్డోజర్లు పంపించి: విజయవాడ అజిత్ సింగ్ నగర్, వాంబేకాలనీలో నివసిస్తున్న ముస్లింలు వీళ్ల పెద్దలు మరణిస్తే ఈ శ్మశానంలోనే పూడ్చిపెట్టారు. వారికి పూడ్చినందుకు చెట్టు రూపంలో, మొక్కల రూపంలో ఆనవాలు ఏర్పరచుకున్నారు. అయితే ప్రస్తుతం వైఎస్సార్సీపీ ప్రభుత్వం అభివృద్ధి పేరుతో వాళ్ల పెద్దల జ్ఞాపకాలను పూర్తిగా చెరిపివేసింది. కాళ్లకు చెప్పులే వేసుకుని వెళ్లని శ్మశానంలోకి ట్రాక్టర్లు, బుల్డోజర్లు పంపించి ఆ మశీదులను కూల్చి వేసింది. దీనిపై ముస్లింలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. తాము అభివృద్ధికి వ్యతిరేకులం కాదని, అయితే తమ పూర్వీకుల సమాధులను ఆనవాలు లేకుండా కూల్చివేయడం ఏంటని స్థానిక ముస్లింలు ప్రశ్నిస్తున్నారు. ఆ సమాధులను అలాగే ఉంచి ఇతర ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేసుంటే ఉపయోగకరంగా ఉండేదని స్థానికులు చెబుతున్నారు.
విజయవాడ పశ్చిమ టికెట్ నాకే ఇవ్వాలి - కచ్చితంగా గెలుస్తా: జలీల్ ఖాన్
సమాధులపై తొక్కించారు: సమాధులు కనిపించకుండా మొత్తం మట్టితో పూడ్చివేయడం ఎంత వరకు సమంజసం అని ప్రశ్నించారు. శ్మశానవాటికలో సమాధులు మొత్తం ఆనవాళ్లు లేకుండా ఎర్ర మట్టి పోశారని ఆరోపించారు. చదును చేసేందుకు పొక్లెయిన్లు వినియోగించి తమ పూర్వికుల సమాధులపై తొక్కించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ మత పెద్దలతో కనీసం చర్చించకుండా సమాధులు కూల్చి వేసి తమ మనోభావాలపై దాడి ప్రభుత్వం దాడి చేస్తోందని స్థానిక ముస్లింలు నేతలు మండిపడుతున్నారు. తమ పూర్వీకుల సమాధుల మీదుగా వెళుతున్న పొక్లెయిన్లు చూసిన ముస్లింలు ఆగ్రహం వ్యక్తం చేశారు.
అవకాశం లేకుండా చేశారు: స్థానిక ముస్లింలు నేడు ముస్లిం పెద్దల పండగను జరుపుకుంటున్నారు. తమ పెద్దలను స్మరించుకోవడానికి అవకాశం లేకుండా అధికార పార్టీ నేతలు చేస్తున్నారని ముస్లింలు మండిపడుతున్నారు. పెద్దల పండగ నాడు రాత్రి మసీదుల్లో ప్రత్యేక ప్రార్ధనలు చేసి, తమ పెద్దల సమాధుల వద్దకు వెళ్లి ప్రత్యేకంగా దువా చేస్తారు. ఇప్పుడు సమాధులే కనిపించని శ్మశానంలో ఎక్కడకు వెళ్లి ప్రార్థనలు చేస్తామని వారు ప్రశ్నిస్తున్నారు. అభివృద్ధి చేసేటపుడు మత గురువులు లేదా పండితులను సంప్రదించకపోవడం ఏంటని ముస్లింలు నిలదీశారు. అభివృద్ధి పేరుతో ఇలా చేయడం దారుణమని పేర్కొంటున్నారు.
ఆగ్రహం వ్యక్తం చేసిన బొండా ఉమా: విజయవాడ అజిత్ సింగ్ నగర్ లోని వాంబేకాలనీకి వెళ్లే రోడ్డులోని ముస్లిం శ్మశాన వాటికలో అభివృద్ధి పేరుతో అధికార పార్టీ ప్రజాప్రతినిధులు సమాదులు కూల్చడాన్ని టీీడీపీ నేత బొండా ఉమామహేశ్వరరావు తీవ్రంగా ఖండించారు. ఘటన స్థలాన్ని టీడీపీ, కార్యకర్తలు, ముస్లిం పెద్దలతో కలిసి సందర్శించారు. అభివృద్ధి పేరుతో చందాలు దండుకోవడానికే వైఎస్సార్సీపీ నాయకులు ముస్లింల సమాదులను కూల్చాలని మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో ముస్లింలు ఐక్యమై వైఎస్సార్సీపీని ఓడిస్తారని తెలిపారు. ఈ రోజు ముస్లిం పెద్దల పండగ జరుపుకుంటారని ఇలాంటి సందర్భంలో వారి సమాదులు కూల్చివేయడం అన్యాయమని బొండా ఉమ దుయ్యబట్టారు.
'ముస్లింల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక మేనిఫెస్టో రూపొందించాలి'