Mumbai Actress Harassment Case: ముంబై సినీనటి కేసులో నిందితుడిగా ఉన్న నిఘా మాజీ విభాగాధిపతి సీతారామాంజనేయులుని ఇప్పటివరకు ఎందుకు అరెస్ట్ చేయలేదని సీఐడీని హైకోర్టు సూటిగా ప్రశ్నించింది. అతను ముందస్తు బెయిలు పిటిషన్ కూడా దాఖలు చేయలేదని గుర్తుచేసింది. సినీనటి ఫిర్యాదుతో ఇబ్రహీంపట్నం పోలీసులు నమోదు చేసిన కేసులో ముందస్తు బెయిలు కోసం IPSలు కాంతిరాణా తాతా, విశాల్ గున్ని తదితరులు దాఖలు చేసిన పిటిషన్లపై ఇరువైపుల వాదనలు విన్న హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. జనవరి 7న నిర్ణయాన్ని వెల్లడిస్తామంది.
అది దర్యాప్తు అధికారి విచక్షణాధికారం: ముంబయి సినీనటి ఫిర్యాదు ఆధారంగా నమోదు చేసిన కేసులో సీతారామాంజనేయులను ఎందుకు అరెస్టు చేయలేదని సీఐడీని హైకోర్టు ప్రశ్నించింది. కేసులో 2వ నిందితుడిగా ఉన్న ఆయన ప్రస్తుతం అందుబాటులో ఉన్నారా? లేక పారిపోయారా? అని ఆరా తీసింది. మొత్తం వ్యవహారంపై వివరాలు సమర్పించాలని స్పష్టం చేసింది. న్యాయస్థానం అడిగిన ప్రశ్నలకు ఏజీ బదులిస్తూ, అరెస్ట్ వ్యవహారం దర్యాప్తు అధికారి విచక్షణాధికారమని చెప్పారు. వాస్తవాలను రాబట్టేందుకు కేవలం అరెస్టే మార్గం అనుకుంటే అరెస్ట్ చేస్తారన్నారు. కొందర్ని అరెస్ట్ చేసేందుకు చర్యలు తీసుకోవడం లేదు కాబట్టి, తమకు ముందస్తు బెయిలు మంజూరు చేయాలని పిటిషనర్లు కోరడానికి వీల్లేదన్నారు.
జనవరి 7న బెయిలు పిటిషన్లపై నిర్ణయం: నిందితులను వరుసక్రమంలో అరెస్ట్ చేయాల్సిన అవసరం దర్యాప్తు అధికారికి లేదన్నారు. పిటిషనర్లకు ముందస్తు బెయిల్ ఇస్తే దర్యాప్తునకు విఘాతం కలుగుతుందని పేర్కొన్నారు. ముంబయి నటిపై కేసు నమోదు, అరెస్ట్ వెనుక కుట్ర కోణాన్ని వెలికితీసేందుకు నిందితుల కస్టోడియల్ ఇంటరాగేషన్ అవసరమన్నారు. ముందస్తు బెయిలు పిటిషన్లను కొట్టేయాలని కోరారు. ఇరువైపు వాదనలు ముగియడంతో జనవరి 7న బెయిలు పిటిషన్లపై నిర్ణయాన్ని వెల్లడిస్తామని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వీఆర్‌కే.కృపాసాగర్ తెలిపారు.
వారిద్దరికీ బెయిల్ ఇవ్వొద్దు - సీఐడీ అఫిడవిట్
ఆగమేఘాలపై ముంబయి వెళ్లి అరెస్ట్: ముంబయి సినీనటి ఫిర్యాదుతో ఇబ్రహీంపట్నం పోలీసులు నమోదు చేసిన కేసులో ముందస్తు బెయిలు కోసం IPSలు కాంతిరాణా తాతా, విశాల్ గున్ని, విజయవాడ వెస్ట్ జోన్ అప్పటి ఏసీపీ హనుమంతరావు, ఇబ్రహీంపట్నం అప్పటి సీఐ ఎం.సత్యనారాయణ, న్యాయవాది ఇనకొల్లు వెంకటేశ్వర్లు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ముంబయి నటి తరఫున న్యాయవాదులు వాసిరెడ్డి ప్రభునాథ్, నర్రా శ్రీనివాసరావు వాదనలు వినిపించారు.
ఓ పారిశ్రామిక వేత్తపై సినీనటి పెట్టిన అత్యాచార కేసులో ముంబయి పోలీసులకు కీలక సాక్ష్యాలు అందజేయకుండా అడ్డుకునేందుకు ఆగమేఘాలపై ముంబయి వెళ్లి అరెస్ట్ చేశారన్నారు. నటి విషయంలో ఐపీఎస్ అధికారులు మానవత్వం లేకుండా వ్యవహరించారన్నారు. ఆమెని వేధించడం వెనుక అప్పటి రాష్ట్ర ప్రభుత్వం, గత ముఖ్యమంత్రి కార్యాలయం, ఐపీఎస్ అధికారుల పాత్ర ఉందన్నారు. ఈ కేసులో మొత్తం ఏడుగురు నిందితులుంటే అప్పటి నిఘా విభాగాధిపతి సీతారామాంజనేయులు బెయిలు పిటిషన్ కూడా వేయలేదన్నారు.
కస్టోడియల్ ఇంటరాగేషన్ అవసరం: పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాదులు వాదనలు వినిపిస్తూ చట్టప్రకారం విధులను నిర్వహిస్తే నేరం ఎలా అవుతుందన్నారు. ఇప్పటికే సాక్ష్యాధారాలను సేకరించారని, కస్టోడియల్ ఇంటరాగేషన్ అవసరం ఉండదన్నారు. కేసుల దర్యాప్తును సీఐడీకి అప్పగించే అధికారం డీజీపీకి లేదన్నారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ముంబయి పోలీసులతో సమన్వయం చేసుకోవడం కోసం విశాల్ గున్ని అక్కడికి వెళ్లారన్నారు. ఐపీఎస్ అధికారులు న్యాయసలహా తీసుకునే విషయమై చర్చించేందుకు పిలిస్తే పోలీసు కమిషనర్ కార్యాలయానికి న్యాయవాది ఇనకొల్లు వెంకటేశ్వర్లు వెళ్లారన్నారు.
కాదంబరీని ఎన్నడూ చూసింది లేదు - విద్యాసాగర్ అల్లిన కట్టుకథ ఇది