Muddanur CI Naresh Babu Transfer: వైఎస్సార్ జిల్లా ముద్దనూరు సీఐ నరేష్‌బాబును వీఆర్‌కు పంపుతూ ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. ముద్దనూరులో బుధవారం జరిగిన ఘర్షణలో టీడీపీ శ్రేణులను పూర్తిస్థాయిలో నిలువరించకపోవడంతో పాటు తనను కాసేపు గృహనిర్బంధంలో ఉండాలన్న సీఐ సూచన అధికార వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి ఆగ్రహానికి కారణమైనట్లు తెలిసింది.
వైఎస్సార్సీపీ నుంచి చేరికల నేపథ్యంలో ముద్దనూరులో పెద్దఎత్తున టీడీపీ కార్యక్రమాన్ని తలపెట్టింది. దీన్ని వైఎస్సార్సీపీ నేతలు నిలువరించే ప్రయత్నంలో రెండు పార్టీలూ ఘర్షణ పడ్డాయి. ఈ సమయంలో ఎమ్మెల్యేను కాస్త నిలువరించేందుకు ప్రయత్నించడమే సీఐ బదిలీకి కారణమైందని తెలుస్తోంది. ముద్దనూరు సీఐగా కడపలో వీఆర్‌లో ఉన్న కె. దస్తగిరిని నియమించారు.
భీమిలిలో వైఎస్సార్సీపీకి షాక్ - టీడీపీలో భారీ చేరికలు
జరిగింది ఇదీ: మండల కేంద్రమైన ముద్దనూరులో జనవరి 31వ తేదీన వైఎస్సార్సీపీ దౌర్జన్యకాండ తెలిసిందే. వైఎస్సార్సీపీ నుంచి తెలుగుదేశం పార్టీలోకి కొంతమంది మారారని, మరికొన్ని కుటుంబాలు చేరుతున్నాయని తెలుసుకున్న వైఎస్సార్సీపీ నేతలు దౌర్జన్యానికి తెగించారు. గతనెల జనవరి 19వ తేదీన కమలాపురంలో ''రా కదిలిరా'' బహిరంగ సభలో టీడీపీ అధినేత చంద్రబాబు సమక్షంలో ముద్దనూరుకు చెందిన శశిధర్ రెడ్డి పార్టీలో చేరారు.
ఆయన జమ్మలమడుగు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డికి సమీప బంధువు. ఇన్ని రోజులు మిన్నకుండిపోయిన వైఎస్సార్సీపీ నేతలు జనవరి 31వ తేదీన భయాందోళనకు గురయ్యారు. ఎందుకంటే ఆ రోజు జమ్మలమడుగు నియోజకవర్గ టీడీపీ ఇంఛార్జి భూపేష్ రెడ్డి సమక్షంలో మరో 30 కుటుంబాలు పార్టీలో చేరాల్సి ఉంది. ఎన్నికల సమయంలో ఒక్కొక్కరుగా పార్టీని వీడుతుండడంతో ఎమ్మెల్యే మేనమామ మునిరాజా రెడ్డి శశిధర్ రెడ్డి ఇంటికి వెళ్లి అక్కడున్న టీడీపీ నాయకులు, కార్యకర్తలపై దాడికి తెగబడ్డారు.
బెజవాడలో వైఎస్సార్సీపీ ఖాళీ ! - టీడీపీలోకి పార్టీ నగర అధ్యక్షుడు బొప్పన
విషయం తెలుసుకున్న భూపేష్ రెడ్డి శశిధర్ రెడ్డి ఇంటి వద్దకు వెళ్లగా వైఎస్సార్సీపీ కార్యకర్తలు కుర్చీలు విసిరి దాడికి పాల్పడ్డారు. వైసీపీ నేతల దాడిలో తెలుగుదేశం మండల అధ్యక్షుడు శివరామిరెడ్డి గాయపడ్డారు. ఈ ఘటనలో పోలీసులు అడ్డుకోలేకపోయారని ఆరోపిస్తూ ఎమ్మెల్యే తన రాజకీయ పలుకుబడిని ఉపయోగించి సీఐ నరేష్‌బాబును బదిలీ చేయించినట్లు ఆరోపణ వినిపిస్తోంది. ఇదే విషయాన్ని ఘర్షణ తలెత్తిన రోజు కూడా ఎమ్మెల్యే (MLA) బహిరంగంగానే విమర్శించారు.
ప్రస్తుతం పని చేస్తున్న సీఐ నరేష్‌బాబును అన్నమయ్య జిల్లా వీఆర్‌కు అటాచ్ చేయగా కడప నుంచి దస్తగిరిని ముద్దనూరు సీఐగా నియమించారు. ముద్దనూరులో జరిగిన ఘర్షణకు సంబంధించి తెలుగుదేశం పార్టీ, వైఎస్సార్సీపీ నాయకులపై కేసులు నమోదయ్యాయి. టీడీపీకి చెందిన 12 మంది, అధికార పార్టీకి చెందిన మరో 12 మందిపై కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు.
ఎన్నికల సమీపిస్తున్న వేళ - వైఎస్సార్సీపీ నుంచి టీడీపీలోకి భారీగా పెరుగుతున్న చేరికలు