Mother Milk Benefits to Babies in Telugu : పిల్లలకు వ్యాధులు దరిచేరకుండా వారికి అయిదేళ్లపాటు సాముహిక వ్యాధి నిరోధక టీకాలు పంపిణీ చేస్తారు. ముర్రుపాలు శిశువుకు తొలిటీకా లాంటివని వైద్యనిపుణులు సూచిస్తున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రతి సంవత్సరం ఆగస్టు 1వ తేదీ నుంచి 7తేదీ వరకు వరకు తల్లిపాల వారోత్సవాలు నిర్వహిస్తోంది. ఈ సంవత్సరం 'క్లోజింగ్ ద గ్యాప్ బ్రస్ట్ ఫీడింగ్ సపోర్ట్ ఫల్ ఆల్' అనే నినాదంతో కార్యక్రమాలు చేపట్టనుంది.
ముర్రుపాల లాభాలు : తల్లిపాలు బిడ్డ ఎదుగుదలకు ఎంతో దోహదపడతాయి. రోగనిరోధకశక్తి పెంపొందించడానికి ఉపయోగపడ్తాయి. పుట్టిన గంటలోపు బిడ్డకు ముర్రుపాలు ఇస్తే ఎంతో ప్రయోజనకారిగా ఉంటాయని వైద్యులు చెబుతున్నారు. బాలింతలు తప్పనిసరిగా వాటి ఆవశ్యకతను తెలుసుకోవాల్సని అవసరం ఉంది. శిశు మరణాల రేటును తగ్గించటమే లక్ష్యంగా తల్లిపాల ప్రాధాన్యతపై ఆరోగ్యశాఖ కార్యక్రమాలు చేపట్టింది.
సిబ్బందికి ప్రోత్సాహం : ప్రభుత్వాసుపత్రుల్లో బాలింతలకు, గర్భిణీ స్త్రీలకు ముర్రుపాలపై అవగాహన కల్పిస్తున్నారు. ప్రసవం జరిగిన గంటలోపు శిశువుకు ముర్రుపాలు పట్టించేందుకు ప్రయత్నిస్తున్నారు. బాలింతలకు గైనకాలజిస్ట్లు కౌన్సిలింగ్ ఇస్తున్నారు. నర్సింగ్ ఆఫీసర్లు వార్డులకు వెళ్లి తల్లిపాల ప్రాముఖ్యతపై అవగాహన కల్పిస్తున్నారు. డబ్బాపాల వల్ల పిల్లలకు జరిగే నష్టాలను తెలియజేస్తున్నారు. ఇలా తెలియజేస్తున్నందుకు ఒక్కో ప్రసవానికి రూ.20 ఆసుపత్రి సిబ్బందికి ప్రభుత్వం చెల్లిస్తోంది. గతేడాది ఖమ్మం సర్వజనాసుపత్రిలో 7వేల ప్రసవాలు జరగ్గా ఆరు నెలలకు రూ.56వేల నిధులు ఇటీవల విడుదల చేశారు.
అండాశయం, రొమ్ము కాన్సర్ నివారించవచ్చు : తల్లిపాలలో ఎన్నో పోషక పదార్థాలు కలిగి ఉంటాయి. కనీసం ఆరు నెలల వరకు తల్లిపాలు మాత్రమే తాగించాలని వైద్యులు సూచిస్తున్నారు. రెండేళ్ల వరకైనా పాలివ్వాలి. డబ్బా పాలతో ప్రయోజనాలు చాలా తక్కువే. బిడ్డకు పాలివ్వటం వల్ల తల్లులకు మానసిక ఆందోళన తగ్గుతుంది. అండాశయం, రొమ్ము కాన్సర్ వంటి ఆరోగ్య సమస్యలను నివారించవచ్చుని వైద్యనిపుణులు చెబుతున్నారు. ఒబెసిటీ సమస్యను అధిగమించొచ్చు. ఎముకలు గుళ్లబారవని డాక్టర్ ఎల్.చందన తెలిపారు.
తల్లిపాల కోసం ప్రత్యేకంగా బ్యాంకు : పుట్టిన ప్రతి బిడ్డను బతికించాలి అందుకు తల్లిపాలు ఎంతో ముఖ్యమని వైద్య పరిశోధనల్లో తేలింది. ఈ నేపథ్యంలో మానవ పాల బ్యాంకుల ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఖమ్మం సర్వజనాసుపత్రిలో 2022లో దీన్ని ఏర్పాటు చేసింది. ఇక్కడ తల్లుల పాలను సేకరించి ఆరోగ్య సమస్యలతో చికిత్స పొందుతున్న నవజాతి శిశువులకు అందిస్తారు.
శిశుగృహల్లో ఉండే అనాథ పిల్లలకు సరఫరా చేస్తారు. ఇలాంటివి చేయడం వల్ల బరువు తక్కువ పిల్లలూ త్వరగా కోలుకుంటున్నారు. దీనికోసం పదిమంది సిబ్బంది బ్యాంకులో పని చేస్తున్నారు. బిడ్డకు రొమ్ముపాలు పట్టించడానికి ఇబ్బంది పడుతున్న తల్లుల నుంచి మిషన్ ద్వారా పాలు తీసి పిల్లలకు ఇస్తారు. కొంత మంది తల్లుల రొమ్ముల్లో పాలు అధికంగా ఉంటాయి. అలాంటి వారి నుంచి స్వచ్ఛందంగా పాలు సేకరించి శుద్ధిచేసి నిల్వ చేస్తారు. ఆరునెలల పాటు వాటిని పిల్లలకు తాగించవచ్చని వైద్యులు చెబుతున్నారు.