More Than 2 Lakh Students Are Away From Education During Jagan Regime : వైఎస్సార్సీపీ అధికారంలో ఉండగా అమలు చేసిన అడ్డగోలు నిర్ణయాలతో రాష్ట్రంలో 2 లక్షలకు పైగా విద్యార్థులు చదువుకు దూరమయ్యారు. ఫలితంగా ఈ సంఖ్యను తగ్గించి చూపేందుకు అడ్డదారులు తొక్కారు. బడి బయట పిల్లలుంటే చర్యలు తీసుకుంటామని టీచర్లను బెదిరించారు. డ్రాప్ బాక్సుల్లో ఉన్న వారిని వెంటనే బడిలో ఉన్నట్లు చూపాలంటూ ఆదేశాలిచ్చారు. దీంతో అప్పట్లో బడి బయట ఉన్న పిల్లలందర్నీ బడిలోనే ఉన్నట్లుగా లెక్కలు చూపారు. ఈ జాబితాలో కర్నూలు, ప్రకాశం, విశాఖ జిల్లాలు మొదటి మూడు స్థానాల్లో ఉన్నాయి.
నాడు నేడు పేరుతో పాఠశాలలను కార్పొరేట్ స్కూళ్లను తలదన్నేలా తీర్చిదిద్దుతామని ప్రపంచ స్థాయి విద్యను పేద విద్యార్థులకు చేరువచేస్తామని పదేపదే ఊదరగొట్టిన నాటి ముఖ్యమంత్రివన్నీ ప్రగల్భాలేనని తేలిపోయింది. వైఎస్సార్సీపీ ప్రభుత్వ అరాచకాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. నాటి జగన్ సర్కారు అడ్డగోలు నిర్ణయాలతో రాష్ట్రంలో ఏకంగా 2 లక్షల 2వేల 791 మంది పిల్లలు చదువుకు దూరమైనట్లు కూటమి ప్రభుత్వం గుర్తించింది.
వారందరూ ఎక్కడున్నారో తెలుసుకొని తిరిగి పాఠశాలల్లో చేర్పించాలంటూ ఆదేశాలిచ్చింది. ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు చదువు మధ్యలో మానేసిన వారు 3లక్షల 58 వేల 218 మంది ఉండగా ఇందులో పదో తరగతి తర్వాత వారు లక్షా 55 వేల 427 మంది ఉన్నట్లు గుర్తించారు. పదో తరగతి పూర్తి చేసినందున వారిని మినహాయించి1 నుంచి 10 తరగతుల్లో చదువు మానేసిన 2లక్షల 2 వేల మందిని గుర్తించాలని కూటమి సర్కారు ఆదేశాల్లో పేర్కొంది.
వైఎస్సార్సీపీ హయాంలో 2022 అక్టోబరులో లక్షా 73 వేల 416 మంది బడి మానేసినట్లు అధికారులు గుర్తించారు. వారిని గుర్తించి, బడుల్లో చేర్పించాలని గ్రామ, వార్డు సచివాలయాల డైరెక్టర్‌కు సూచించారు. వాలంటీర్లతో సర్వే చేయించారు. చాలామంది ఆచూకీ లభించలేదు. వాలంటీర్లపై ఉన్నతాధికారులు ఒత్తిడి చేయడంతో వీరు ఎక్కడో చోట చదువుతున్నట్లు, దూర విద్య అభ్యసిస్తున్నట్లు, ఇతర ప్రాంతాలకు వెళ్లిపోయినట్లు రాసేసి, ముగించారు. 2023-24 విద్యా సంవత్సరంలోనూ బడి బయట పిల్లల సంఖ్య వెలుగు చూసింది.
విద్యార్థుల అకడమిక్ పురోగతిని ఎప్పటికప్పుడు ట్రాక్ చేసేలా 'అపార్'
గతేడాది సెప్టెంబరు 4 లోపు బడి ఈడు పిల్లలు బడి బయట ఉంటే రాజీనామా చేస్తానంటూ అప్పట్లో ప్రవీణ్ ప్రకాష్ ప్రకటన చేశారు. బడి నుంచి వెళ్లిపోయిన వారి పేర్లను రిజిస్టర్‌లో రాయాలంటూ ప్రైవేటు పాఠశాలలపై ఒత్తిడి తీసుకొచ్చారు. డ్రాప్ బాక్సులో పిల్లల సంఖ్య ఉంటే చర్యలు తీసుకుంటామంటూ ప్రభుత్వ ప్రధానోపాధ్యాయులను బెదిరింపులకు గురిచేశారు. దీంతో పిల్లలు బడి నుంచి వెళ్లిపోయినా ఉన్నట్లే లెక్కలు చూపారు. ఇలా ప్రభుత్వ బడుల్లో చదువుతున్న విద్యార్థుల సంఖ్యను ఎక్కువగా చూపారు.
బడి మానేసిన పిల్లల సంఖ్యలో మొదటి మూడు స్థానాల్లో కర్నూలు, ప్రకాశం, విశాఖపట్నం జిల్లాలు ఉన్నాయి. కర్నూలు మొదటి స్థానంలో ఉండగా పార్వతీపురం మన్యం చివరి స్థానంలో ఉంది. కర్నూలులో అత్యధికంగా 18 వేల 261 మంది బడికి దూరమయ్యారు. ఇక్కడ పనుల కోసం వలసలు వెళ్లే వారి సంఖ్య ఎక్కువ. వైఎస్సార్సీపీ ప్రభుత్వం హయాంలో సీజనల్ హాస్టళ్లు ఏర్పాటు చేయకపోవడంతో చాలామంది తల్లిదండ్రులు పిల్లల్ని తమతోపాటు బయట ప్రాంతాలకు తీసుకెళ్లిపోయారు.
మూడు, నాలుగు నెలల తర్వాత తిరిగొచ్చినా పిల్లలు బడికి రాని పరిస్థితి. ఈ నేపథ్యంలో పాఠశాల విద్యా శాఖ విద్యార్థుల వివరాలను ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది. బడిమానేసిన పిల్లల సంఖ్యలో ప్రకాశం జిల్లా రెండో స్థానంలో ఉంది. జిల్లాలో 14వేల 230 మంది చదువుకు దూరమయ్యారు. విశాఖపట్నంలో 12వేల 203 మంది బడి మానేశారు.
కమీషన్ల కక్కుర్తి - కాంట్రాక్టు కోసం బడిని పడగొట్టారు - Big Scam In Nadu Nedu