MLC Kavitha CBI Investigation : దిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్టై, తిహాడ్ జైలులో జ్యుడీషియల్ రిమాండ్‌లో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ప్రశ్నించేందుకు రౌస్ అవెన్యూ కోర్టు ఈ నెల 5న సీబీఐకి అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే దీనిని సవాల్ చేస్తూ 6న కవిత తరఫు న్యాయవాది న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. సీబీఐ తమకు దరఖాస్తు అందించలేదని కోర్టుకు వివరించారు. కవితను సీబీఐ ప్రశ్నించే అంశంపై విచారణ చేపట్టాలని కోరారు. ఈ పిటిషన్‌పై విచారించిన కోర్టు, కవిత వ్యాజ్యంపై జవాబు చెప్పాలని సీబీఐకి నోటీసులిస్తూ నేటికి వాయిదా వేసింది.
ఎమ్మెల్సీ కవితకు దక్కని ఊరట - మధ్యంతర బెయిల్‌ను నిరాకరించిన కోర్టు - MLC Kavitha Interim Bail Denied
రిప్లై దాఖలు చేయడం లేదు : నేడు మరోసారి ఈ పిటిషన్‌పై సీబీఐ ప్రత్యేక కోర్టు విచారించగా, కవితను ప్రశ్నించడంపై రిప్లై దాఖలు చేయడం లేదని సీబీఐ, కోర్టుకు తెలిపింది. శనివారం రోజే ఆమెను ప్రశ్నించామని వివరించింది. మరోవైపు సీబీఐ కౌంటర్ దాఖలు చేయకపోవడంపై ఆమె తరఫు న్యాయవాది మోహిత్ రావు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీనిపై తాము తమ వాదనలు వినిపిస్తామని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అయితే భవిష్యత్తులో కవితను ప్రశ్నించాల్సి వస్తే, ముందుగానే తమకు సమాచారం ఇవ్వాలని సీబీఐకి చెప్పామని న్యాయమూర్తి కవిత తరపు న్యాయవాదులకు సూచించారు. ఈ మేరకు తదుపరి విచారణ ఈ నెల 26 మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా వేశారు.
ప్రశ్నించేటప్పుడు షరతులు వర్తిస్తాయి : ఈ కేసుకు సంబంధించి తిహాడ్ జైలులో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ప్రశ్నించేందుకు అనుమతి ఇవ్వాలంటూ సీబీఐ రౌస్ అవెన్యూ కోర్టును సంప్రదించగా, న్యాయస్థానం షరతులతో కూడిన పర్మిషన్ మంజూరు చేసింది. ఆమెను ప్రశ్నించేందుకు ఒక రోజు ముందే జైలు అధికారులకు సీబీఐ అధికారులు సమాచారం ఇవ్వాలని ఆదేశించింది. విచారణ సమయంలో తప్పని సరిగా మహిళా కానిస్టేబుళ్లు ఉండాలని షరతు పెట్టింది. ఇదే సమయంలో ప్రశ్నించే సమయంలో ల్యాప్ టాప్, ఇతర స్టేషనరీ తీసుకొచ్చేందుకు సీబీఐకి ఓకే చెప్పింది.