Mistakes in Prakasam District Voter List : కొత్త ఓటర్ జాబితాలోను పాత తప్పులతో పౌరుల ప్రాథమిక హక్కుకు అధికార యంత్రాంగం ముప్పు తెస్తోంది. తప్పులు దొర్లాయి సవరణ చేయండి అంటూ పలువురు ఓటర్లు చేసిన దరఖాస్తులను పరిగణలోకి తీసుకొన్న దాఖలాలు కనిపించట్లేదు. ఓటర్ జాబితాల సవరణ నిమిత్తం ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేసి సవరణ చేశామని చెబుతున్నప్పటికీ అవే తప్పులు పునరావృతమై, నూతన ఓటరు జాబితాలో దర్శనమిస్తున్న పరిస్థితి ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గ వ్యాప్తంగా తప్పులు తడకలతో కూడిన ఓటర్ జాబితాలను చూస్తే అర్థమవుతుంది.
AP Voter List 2024 : కనిగిరి పట్టణంలోని ఇందిరా కాలనీలో 143వ పోలింగ్ బూతులో భార్యాభర్తలకు వేరువేరు డోర్ నెంబర్లతో ఓట్లు నమోదు చేశారు. 145వ పోలింగ్ కేంద్రంలో గతంలో తెలుగు ఓటరు జాబితాలో తమిళ అక్షరాలతో ఉన్న ఓటర్లను సవరణ చేయకుండా అదే విధంగా నూతనంగా విడుదల చేసిన జాబితాలో మరో మారు ప్రత్యక్షమయ్యాయి. అంతే కాకుండా అదే పోలింగ్ కేంద్రంలో ఓటర్ ఫొటోకు బదులు ఆధార్ కార్డులు దర్శనమిస్తున్నాయి.
తుది జాబితాలోనూ వైఎస్సార్సీపీ దొంగ ఓట్ల దందా
బతికున్న వారిని చనిపోయినట్లుగా చనిపోయిన వారిని బతికున్నట్లుగా చూపిస్తూ ఓటరు జాబితాలు విడుదల చేశారు. వెలిగండ్ల మండలంలోని కొట్టాలపల్లి 61వ పోలింగ్ కేంద్రంలో ఒకే పేరుతో రెండేసి ఓట్లు ఉండగా చౌడవరంలో కూడా ఒకే పేరుతో రెండేసి ఓట్లు దర్శనమిస్తున్నాయి. ఇలా చెప్పుకుంటూ పోతే నియోజకవర్గంలోని 6 మండలాల పరిధిలో అనేక తప్పులు తడకలతో కూడిన ఓటరు జాబితాను నూతనంగా విడుదల చేయడంతో పాటు ఒక ప్రాంతానికి చెందిన ఓటర్లను మరో ప్రాంతంలోకి మార్చడంతో రాబోయే ఎన్నికల్లో ఓట్లు ఎక్కడ వేయాలి అనే విషయంపై ఓటర్లు ఆందోళన చెందుతున్నారు.
కొత్త ఓటరు జాబితాలోనూ అదే నిర్లక్ష్యం - అవే పాత తప్పులు!
కనిగిరి నియోజకవర్గంలో నూతన జాబితా ప్రకారం కనిగిరి, పామూరు, చంద్రశేఖరపురం, వెలిగండ్ల, హనుమంతునిపాడు, పెద్ద చెర్లోపల్లి మండలాలలో మొత్తం 297 పోలింగ్ బూతులు ఉన్నాయి. గత ఏడాది అక్టోబర్లో ముసాయిదా ఓటర్ల జాబితాను అధికారులు విడుదల చేశారు. అధికారులు విడుదల చేసిన ఓటర్ జాబితాలో తప్పులు, అభ్యంతరాలపై నవంబర్ 4, 5 తేదీలలో, డిసెంబర్ 3, 4 తేదీలలో ప్రత్యేక శిబిరాలు నిర్వహించారు. ప్రతిపక్షాలు, స్థానిక నేతలు, పలువురు ఓటర్లు తప్పులను గుర్తించి ఆయా శిబిరాలలో ఉన్న బీఎల్ఓలకు అధికారులకు మృతుల వివరాలు, ఇతర ప్రాంతాలకు చెందిన వారివి, డబల్ ఎంట్రీలు, ఒకే ఇంటి సంఖ్యతో ఉన్న వాటిని గుర్తించి సరిచేయాలని ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదులను సవరణ చేశామని కల్లబొల్లి మాటలు చెప్పిన అధికారులు ఈ నెల 22న విడుదల చేసిన తుది జాబితాలో తప్పులు చాలా వరకు అలానే ఉండిపోవడంతో స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
సవరణ పేరుతో అధికారులు ప్రత్యేక శిబిరాలు నిర్వహించి తప్పులను సవరణ చేయకుండానే కాలం వెళ్ళదీశారని, ఇలాంటి ప్రత్యేక శిబిరాలు నిర్వహించడం ద్వారా ప్రజలకు ఓరిగే ప్రయోజనం ఏమిటని ఆవేదన వెళ్లబుచ్చుతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు వెంటనే స్పందించి మరో మారు తప్పులు తడకలతో కూడిన ఓటరు జాబితాలను బాధ్యతగా సవరణ చేసి రాబోయే ఎన్నికలకు సరైన ఓటర్ జాబితాలను విడుదల చేయాలని కనిగిరి నియోజకవర్గ ఓటర్లు కోరుకుంటున్నారు.
"ఓటర్ల జాబితాపై అభ్యంతరాలు తెలుపవచ్చు"