Minister Ponnam Prabhakar Fires on Bandi Sanjay: ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నికైన ప్రభుత్వాలను కూల్చేసిన వారే ధర్మం గురించి, ప్రజాస్వామ్యం గురించి మాట్లాడితే దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉంటుందని బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఎద్దేవా చేశారు. కరీంనగర్ శాతవాహన వర్సిటీలో ఏర్పాటు చేసిన వన మహోత్సవంలో పాల్గొని మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన బీజేపీ దేశవ్యాప్తంగా ప్రజాస్వామ్యబద్దంగా ఎన్నికైన ప్రభుత్వాలను కూల్చేసిందని, ఎంత మంది ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించారో బండి సంజయ్ చెప్పాలని పొన్నం సవాల్ విసిరారు.
డిసెంబర్ 3 వరకు ఎమ్మెల్యేలను చేర్చుకోవాలన్న ఆలోచనే తమ ప్రభుత్వానికి లేదని పొన్నం పేర్కొన్నారు. ప్రభుత్వాన్ని కూల్చుతామని అంటుంటే, నిలబెట్టడానికి బీఆర్ఎస్ ఎమ్మెల్యులు వస్తున్నారన్నారు. ప్రభుత్వాన్ని కూలుస్తామని అటు బీజేపీ, బీఆర్ఎస్ నాయకులు బహిరంగంగా ప్రకటనలు చేస్తుంటే చూస్తూ ఊరుకోమంటారా అని ప్రశ్నించారు. తాము ధర్మం తప్పడం లేదని, రాజనీతి చేస్తున్నామని పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. కులగణనపై మరో రెండు రోజుల్లో నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు.
"బీజేపీ ఇప్పటి వరకు ఎన్ని ప్రభుత్వాలను కూల్చింది. ఎన్నికైన ప్రభుత్వాలను కూల్చేసిన వారే ధర్మం గురించి, ప్రజాస్వామ్యం గురించి మాట్లాడితే దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉంటుంది. బీఆర్ఎస్, బీజేపీ కలిసి ప్రభుత్వాన్ని కూల్చుతామంటే చూస్తూ ఊరుకోవాలా? డిసెంబర్ 3 వరకు ఇతర పార్టీల ఎమ్మెల్యేలను చేర్చుకునే ఆలోచనే మాకు లేదు. ప్రభుత్వాన్ని కూల్చుతామని మీరంటుంటే నిలబెట్టడానికి వారు వస్తున్నారు. మేం ధర్మం తప్పలేదు. ప్రభుత్వ సుస్థిరత కోసమే చేరికలు." - పొన్నం ప్రభాకర్, మంత్రి
బండి సంజయ్ సవాల్ : అభివృద్ధిని చూసి కాంగ్రెస్‌లో చేరుతున్నామని బీఆర్ఎస్ నాయకులు చెపుతున్నారని, నిజంగా మీరు అభివృద్ధి చేస్తున్నట్లు భావిస్తే మీ పార్టీలో చేరిన ఎమ్మెల్యేలందరితో రాజీనామా చేయించి ఉప ఎన్నికల్లో ప్రజా తీర్పు కోరే దమ్ముందా? అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఇటీవల కాంగ్రెస్ నేతలకు సవాల్ విసిరిన విషయం తెలిసిందే. దీంతో స్పందించిన మంత్రి పొన్నం ఘాటు వాఖ్యలు చేశారు. బీజేపీ, బీఆర్ఎస్ నాయకులు కలిసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టాలని కుట్ర చేశారని, అందుకే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కాంగ్రెస్‌లోకి ఆహ్వానిస్తున్నామని తెలిపారు.
కరీంనగర్ అభివృద్ధిపై మంత్రి పొన్నం, ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌తో చర్చిస్తా : బండి సంజయ్