Minister Nara Lokesh Visakha Tour : విశాఖలో మంత్రి నారా లోకేశ్ పర్యటన రెండో రోజు కొనసాగుతోంది. జిల్లా పార్టీ కార్యాలయంలో వివిధ నియోజకవర్గాల నుంచి వచ్చిన నాయకులు, కార్యకర్తలు, ప్రజలను లోకేశ్ కలిశారు. సమస్యల పరిష్కార వేదికైన ప్రజాదర్బార్ నిర్వహించి ప్రజల నుంచి నేరుగా విజ్ఞప్తులు స్వీకరించారు. అందరినీ ఆప్యాయంగా పలకరించి వారితో కలిసి ఫొటోలు దిగారు. ఈ క్రమంలో ప్రజల నుంచి తీసుకున్న వినతులను పరిశీలించి ఆ వినతులను సంబంధిత శాఖలకు పంపి పరిష్కారానికి కృషి చేస్తానని లోకేశ్ వారికి హామీ ఇచ్చారు.
విద్యార్థులకు అందుతున్న సౌకర్యాలు, లోటుపాట్లపై ఆరా: బడిబాట కార్యక్రమంలో భాగంగా విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ విశాఖ జిల్లాలో పాఠశాలలను సందర్శించారు. భీమిలి కస్తూర్బా బాలికల పాఠశాలకు వెళ్లిన ఆయన స్కూల్ కమిటీ సభ్యులతో సమావేశం అయ్యారు. తరగతి గదులు, లైబ్రరీ, సైన్స్ లేబోరేటరీ, మధ్యాహ్న భోజన వంటశాలను పరిశీలించారు.
ఆ తర్వాత రాష్ట్రంలోనే ఎక్కువ మంది విద్యార్థులు ఉన్న చంద్రంపాలెం హైస్కూల్‌కు లోకేశ్ వెళ్లారు. ఆవరణలోని సరస్వతి దేవి విగ్రహానికి పూలమాల వేశారు. అనంతరం విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించారు. విద్యార్థులకు అందుతున్న సౌకర్యాలు, లోటుపాట్లపై ఆరా తీశారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ స్కూళ్లలో విద్యా ప్రమాణాల పెంపు, మెరుగైన వసతుల కల్పనే లక్ష్యమని లోకేశ్ తెలిపారు. ఈ పర్యటనలో లోకేశ్ వెంట టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్, భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్ ఉన్నారు.