Minister Nara Lokesh Review on Rains: గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గంలో ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో మంత్రి నారా లోకేశ్ అధికారులతో ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. టీడీపీ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ద్వారా సమాచారం తెలుసుకుంటున్నారు. సహాయ చర్యలపై అధికారులకు పలు సూచనలు చేశారు. వరద ముంపునకు గురైన ప్రాంత వాసులకు తక్షణమే సహాయం అందించాలని ఆదేశించారు. వరద ముంపు ప్రాంతాల్లో ప్రజలకు ఆహారం, తాగునీరు అందిస్తూ సహాయ కార్యక్రమాల్లో పాల్గొనాల్సిందిగా పార్టీ శ్రేణులను కోరారు. తుపాను తీవ్రరూపం దాల్చుతున్నందున అధికారులంతా అందుబాటులో ఉండాలని, అవసరాన్ని బట్టి పునరావాస శిబిరాలు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.
అహార పొట్లాలు పంపిణీ: టిడ్కో ప్రాంతాన్ని వరద నీరు చుట్టుముట్టడంతో మంత్రి ఆదేశాల మేరకు 5 పొక్లైయిన్లతో యుద్ధప్రాతిపదికన కాలువ తవ్వి నీటిని డ్రైన్లోకి వదులుతున్నారు. మంత్రి లోకేశ్ సూచనతో పార్టీ కార్యకర్తలు వరదలలో చిక్కుకున్న వారికి అహార పొట్లాలు పంపిణీ చేశారు. మంగళగిరి, తాడేపల్లి, వడ్లపూడిలో వరద బాధితులకు ఆహారాన్ని అందించారు. మరోవైపు మంగళగిరి గండాలయపేటలో కొండచరియలు విరిగిపడి వృద్ధురాలు మృతి చెందారు.
అత్యవసరం అయితే తప్ప బయటకు రావొద్దు - ప్రజలకు మంత్రుల సూచన - Ministers Review on Heavy Rains
ముగ్గురు మృతిపై దిగ్భ్రాంతి: గుంటూరు ఛానల్ తెగి వరద ధాటికి కారు కొట్టుకుపోయిన ఘటనలో ముగ్గురు మృతి చెందారన్న వార్త తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని మంత్రి లోకేశ్ అన్నారు. ఉప్పలపాడు కాలవలో పడి ఎర్రబాలెంకు చెందిన టీచర్ రాఘవేంద్రరావు, ఉప్పలపాడుకు చెందిన విద్యార్థులు సౌరీష్ బాబు, మాన్విక్ దుర్మరణం చెందారు. మృతుల కుటుంబాలకు లోకేశ్ ప్రగాఢ సానుభూతి తెలిపారు. వారికి ప్రభుత్వం అన్ని విధాలా అండగా నిలుస్తుందని హామీ ఇచ్చారు.
టీడీపీ అండగా ఉంటుందనే భరోసా కల్పించాలి: భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఎటువంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని మంత్రి లోకేశ్ సూచించారు. ప్రభుత్వం, విపత్తు నిర్వహణ శాఖ అలెర్ట్ మెసేజ్‌లను గమనిస్తూ తగిన రక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కొండ చరియలు విరిగిపడే, ముంపునకు గురయ్యే లోతట్టు ప్రాంతాల ప్రజలు అధికార యంత్రాంగం సూచించిన సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలన్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రజాప్రతినిధులు, టీడీపీ నేతలు, కార్యకర్తలు సహాయక చర్యలకు తమ పూర్తి సహకారం అందించాలని సూచించారు. విపత్తుల కష్ట సమయంలో టీడీపీ ప్రజలకు అండగా ఉంటుందనే భరోసా కల్పించాలని మంత్రి లోకేశ్ తెలిపారు.
గుంటూరు జిల్లాలో కొట్టుకుపోయిన కారు - ముగ్గురు దుర్మరణం - CAR WASHED OUT THREE PEOPLE DIED