Nadendla on Tirupati Laddu Ghee Controversy : తిరుమల లడ్డూలో కల్తీ వ్యవహారం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ విషయంపై రాజకీయ పార్టీల నేతలు, ప్రజాసంఘాలు స్పందిస్తున్నాయి. ఇందుకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి. లడ్డూ అపవిత్రంపై ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఏడుకొండలవాడా క్షమించు అంటూ కోరారు. ఈ క్రమంలోనే 11 రోజులపాటు ప్రాయశ్చిత్త దీక్ష చేయాలని పవన్ కల్యాణ్ నిర్ణయించారు.
ఇందులో భాగంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఆదివారం నాడు ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టారు. 11 రోజులపాటు దీనిని కొనసాగించనున్నారు. దీక్ష పూర్తయ్యాక తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారిని ఆయన దర్శించుకోనున్నారు. మరోవైపు పవన్ కల్యాణ్ చేపట్టిన ప్రాయశ్చిత్త దీక్షకు సంఘీభావంగా ఇవాళ గుంటూరు జిల్లా తెనాలిలో మహాయాగం నిర్వహించారు. ఈ యాగంలో మంత్రి నాదెండ్ల మనోహర్ వెంకటేశ్వరస్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించి పాల్గొన్నారు.
Nadendla Fires on YSRCP : టీటీడీ విషయంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం అహంకారంతో వ్యవహరించిందని మంత్రి నాదెండ్ల మండిపడ్డారు. గత పాలకులకు టీటీడీ టికెట్లు అమ్ముకోవడంపై ఉన్న శ్రద్ధ ప్రసాదంపై తీసుకోలేదని విమర్శించారు. ఐదేళ్లుగా నాణ్యత లేని లడ్డూలు తయారుచేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సంబంధం లేని వ్యక్తులను పాలక మండలిలో నియమించారని ఆక్షేపించారు. ఆలయ అభివృద్ధికి నిజాయతీగా పనిచేసే వారినే నియమిస్తామని చెప్పారు. టీటీడీ ప్రక్షాళన జరగాల్సిన సమయం ఆసన్నమైందని నాదెండ్ల మనోహర్ వ్యాఖ్యానించారు. ఈ యాగంలో జనసేన, టీడీపీ, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
మరోవైపు తిరుమల స్వామివారి లడ్డూలో కల్తీ నెయ్యి వ్యవహారంపై టీటీడీ చేపట్టిన ప్రాయశ్చిత్త కార్యక్రమాలు ముగిశాయి. సంప్రోక్షణ చర్యల్లో భాగంగా ఆలయ యాగశాలలో శాంతి హోమం నిర్వహించారు. లడ్డూపోటు, విక్రయశాలలో వాస్తుశుద్ధి చేపట్టారు. ఇటీవల జరిగిన దోషాలు తొలగిపోవాలని శాంతి హోమం చేశామని టీటీడీ తెలిపింది. ప్రసాదం కల్తీ జరిగిందని భక్తులు ఆందోళన చెందవద్దని సూచించింది. పవిత్రోత్సవాల ముందు జరిగిన దోషం, పవిత్రోత్సవాలతో పోయిందని వివరించింది. ఇకపై లడ్డూ ప్రసాదాలపై ఎలాంటి అనుమానాలు వద్దని పేర్కొంది. తెలిసీ తెలియక జరిగిన దోషాలు శాంతిహోమం, ప్రోక్షణతో పోయాయని టీటీడీ వెల్లడించింది.