Minister Konda Surekha Meeting on Forest Department : రాష్ట్రంలో పోడు రైతుల ప్రయోజనాలు దెబ్బతినకుండా, ఉపాధికి భంగం కలగకుండా మార్గదర్శకాలు అనుసరిస్తూ పోడు భూముల రక్షణకు కృషి చేయాలని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ అధికారులను ఆదేశించారు. అదే విధంగా పోడు భూముల్లో సాగు చేసుకుంటున్న రైతు కుటుంబాలు అటవీ శాఖ అధికారులకు ఎలాంటి హాని తలపెట్టవద్దని కోరారు. లేకుంటే క్రమశిక్షణా చర్యలకు గురవుతారని హెచ్చరించారు. హైదరాబాద్‌లోని సచివాలయంలో మంత్రి కొండా సురేఖ అధ్యక్షతన పోడు భూముల సమస్యలపై సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రి సీతక్క పాల్గొన్నారు. అటవీ శాఖ ముఖ్య కార్యదర్శి వాణి ప్రసాద్, అదనపు కార్యదర్శి కార్యదర్శి ప్రశాంతి, పీసీసీఎఫ్ డోబ్రియాల్ పాల్గొన్నారు.
పోడు భూములు సాగు చేసుకుంటున్న రైతుల హక్కులు కాపాడడం, అటవీ శాఖ భూములు కాపాడే విధులు నిర్వర్తిస్తున్న అటవీ అధికారులకు రక్షణ కల్పించడంలోనూ ప్రభుత్వం ఎంతో సమన్వయంతో ముందుకు సాగుతోందని మంత్రి సురేఖ అన్నారు. ప్రభుత్వ మార్గదర్శకాలను అనుసరించి ఏళ్లుగా పోడు భూములను సాగుచేసుకుంటున్న రైతు కుటుంబాల విషయంలో ఎలాంటి ఇబ్బంది లేదన్నారు. వ్యవసాయం పేరుతో మార్గదర్శకాలు, చట్టాలకు విరుద్ధంగా కొత్తగా పోడు భూములను ఆధీనంలోకి తీసుకున్నట్లైతే కఠిన చర్యలు చేపట్టాల్సి వస్తుందని హెచ్చరించారు.
అటవీ అధికారులపై గిరిజనుల దాడి సమీక్ష : శుక్రవారం నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలం కాల్పోల్ గ్రామంలో ఎఫ్ఆర్ఓ, సెక్షన్ ఆఫీసర్, బీట్ ఆఫీసర్లపై గిరిజనులు చేసిన దాడిని ప్రస్తావించారు. రాష్ట్ర ప్రజల ప్రయోజనాలకు ఎంత ప్రాధాన్యత ఇస్తామో రాష్ట్ర అటవీ సంపద, సహజ వనరుల పరిరక్షణకు అంతే ప్రాధాన్యత ఇస్తామని మంత్రి సురేఖ స్పష్టం చేశారు. బీఆర్‌ఎస్ హయాంలో అనర్హులకు పోడు భూముల కేటాయింపు జరిగిన విషయం తమ దృష్టికి వచ్చిందని తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన పోడు భూముల పంపిణీపై నివేదికను సమర్పించాలని మంత్రి సురేఖ అటవీశాఖ ఉన్నతాధికారులను ఆదేశించారు.
ఏళ్లుగా పోడు భూమి వివాదాలు చూస్తున్నా : తాను ప్రతిపక్షంలో ఉన్నా అధికార పక్షంలో ఉన్నా పోడు భూములపై వివాదాలను చూస్తూనే ఉన్నానని మంత్రి సీతక్క అన్నారు. అటవీ ప్రాంతాల్లో కొత్తగా వెలుస్తున్న గ్రామాల్లో అభివృద్ధి పనులకు ప్రభుత్వ మార్గదర్శకాలు అనుసరించి అటవీ శాఖ అభ్యంతరాలు వ్యక్తం చేస్తుంది. కానీ ఏళ్లుగా కొనసాగుతున్న గ్రామాల్లో అభివృద్ధి పనులను కొనసాగించేలా అధికారులకు ఆదేశాలివ్వాలని మంత్రి సురేఖను కోరారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలో చేపడుతున్న అభివృద్ధి పనులు, పథకాల అమలులో అటవీశాఖ మార్గదర్శకాలు ప్రతిబంధకంగా మారుతున్నాయన్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపి పోడు భూముల సమస్యపై కచ్చితమైన పరిష్కారాన్ని రాబట్టేలా చర్యలు చేపట్టాలని మంత్రి సీతక్క తెలిపారు.