Minister Komatireddy Inspected Uppal Elevated Corridor Works : ఉప్పల్- నారపల్లి మార్గంలో ఎలివేటెడ్ కారిడార్ పనులను ఆదివారం సాయంత్రం రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్, అధికారులతో కలిసి పరిశీలించారు. 2018లో ప్రారంభమైన ఎలివేటెడ్ కారిడార్ పనులు ఇప్పటికీ పూర్తి కాలేదని, నిర్మాణ పనుల వల్ల రహదారి గుంతల మయంగా మారి ప్రయాణికులు ఇక్కట్లు పడుతున్నారని స్థానికులు మంత్రి దృష్టికి తెచ్చారు.
ఈ సందర్భంగా ఆర్‌అండ్‌బీ అధికారుల తీరుపై మంత్రి కోమటిరెడ్డి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఆరేళ్లలో 6 కిలోమీటర్ల ఫ్లైఓవర్ పనులు పూర్తి చేయలేదంటే సిగ్గు చేటని వ్యాఖ్యానించారు. నారపల్లి నుంచి ఉప్పల్ వరకు రహదారి నిర్మాణానికి ఎంత ఖర్చు అవుతుందో చెప్పాలని అధికారులను మంత్రి ఆదేశించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నడిచేది ప్రజలు కట్టే పన్నుతోనేనని, వంతెన నిర్మాణంలో ఆర్‌అండ్‌బీ అధికారులు పూర్తిగా విఫలమయ్యారని మంత్రి మండిపడ్డారు.
Komatireddy Venkat Reddy On Uppal Flyover : ఈ చర్చలో పాల్గొనేందుకు మీరు అర్హులు కారని అధికారులపై కోమటిరెడ్డి ఫైర్ అయ్యారు. త్వరితగతిన నిర్మాణ పనులు పూర్తి చేయడానికి మీ దగ్గర ఉన్న ప్రణాళిక ఏంటని ప్రశ్నించారు. గుత్తేదారుపై పూర్తి నెపం నెట్టడం కాదన్న ఆయన, మీరు చేయాల్సిన పనిని మీరు సక్రమంగా చేయలేక పోయారన్నారు.
జీహెచ్‌ఎంసీ, ఫారెస్ట్, కాంట్రాక్టర్ అంటూ సాకులు చెప్పొద్దని మండిపడ్డారు. ఈనెల 8వ తేదీ నుంచి కన్స్ట్రక్షన్ వర్క్స్ తిరిగి ప్రారంభిస్తామని నేషనల్ హైవే ఆర్వో తెలిపారు. సెప్టెంబరు చివరి కల్లా ఎలివేటెడ్ కారిడార్ టెండర్ పనులు పూర్తి చేయాలని, పనులు ప్రారంభించిన రెండున్నరేళ్లలోగా పై వంతెన పనులు పూర్తి కావాలని మంత్రి ఆదేశించారు. ఆర్‌అండ్‌బీ శాఖ ఆఫీసర్లు అధిక సమయం ఫ్లైఓవర్ పనులకే కేటాయించాలని సూచించారు.
నవంబర్‌లో అంబర్‌పేట ఫ్లైఓవర్ పనులు ప్రారంభిస్తాం : దశాబ్ద కాలంపాటు బీఆర్ఎస్ పాలనలో హైదరాబాద్‌ను విశ్వనగరం చేస్తామని కల్లబొల్లి మాటలు చెప్పారని మంత్రి అన్నారు. ఆరేళ్లలో 6 కి.మీ కారిడార్ పూర్తి చేయలేకపోవడం తెలంగాణకు అవమానకరమని ఈ విషయంలో కేటీఆర్ సిగ్గుపడాలన్నారు. హైదరాబాద్-విజయవాడ హైవేతో పాటు ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్‌పై దృష్టి పెట్టాలని కేంద్రమంత్రి గడ్కరీకి విజ్ఞప్తి చేశామని తెలిపారు.
ఈ కారిడార్ అంశంపై గతంలో ఎంపీగా ఉన్నప్పుడు రేవంత్‌రెడ్డి పార్లమెంట్‌లో పదిసార్లు ప్రశ్నించారని గుర్తుచేశారు. ఆదివారం అయినా సరే అధికారులందరూ వచ్చి ఈ కారిడార్ అంశంపై రోడ్ మ్యాప్ ఇవ్వాలని తాను కోరినట్లు చెప్పుకొచ్చారు. పది రోజుల్లో ఉప్పల్ నుంచి ఔటర్ రింగ్‌రోడ్డుకు కలిసే వరకు బీటీ రోడ్డు పనులు ప్రారంభిస్తామన్నారు. నవంబరు మొదటి మాసంలో ఫ్లైఓవర్ పనులు మొదలుపెట్టి 18- 20 నెలల్లో పూర్తి చేస్తామని వివరించారు.
డిసెంబరులో మూసీ పనులు మొదలుపెడతామని, గత ప్రభుత్వం చేసిన అప్పులకు రూ.7వేల కోట్లు వడ్డీ కడుతున్నామని ధ్వజమెత్తారు. నవంబర్‌లో అంబర్‌పేట ఫ్లైఓవర్ ప్రారంభించేందుకు కసరత్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఓఆర్‌ఆర్ కట్టింది కాబట్టే ఐటీ కంపెనీలు హైదరాబాద్‌కు వచ్చాయని మంత్రి కోమటిరెడ్డి అన్నారు.