Minister Kakani Govardhan Reddy Files Missing Case: మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి నిందితుడిగా ఉన్న ఫోర్జరీ కేసులో ఆధారాలు, సాక్ష్యాలు, ఇతర పత్రాలతో కూడిన ప్రాపర్టీ నెల్లూరు కోర్టు నుంచి చోరీకి గురైన కేసులో సీబీఐ దాఖలు చేసిన అభియోగపత్రాన్ని పరిశీలిస్తే ఎవరికైనా సరే ఇదేం పరిశోధన అని అనిపించకమానదు. ఈ దొంగతనం ఘటనతో కాకాణికి సంబంధమే లేదంటూ చెప్పిన విషయాలేవి తార్కికంగా లేవు. వాటి మధ్య పొంతన లేదు. కొన్ని మరీ హాస్యాస్పదంగా ఉన్నాయి. సీబీఐ లాంటి ప్రఖ్యాత సంస్థ ఇలా దర్యాప్తు చేయడమేంటి అనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
చోరీ కేసులో నిందితులైన సయ్యద్ హయత్, ఖాజా రసూల్ చిల్లర దొంగతనాలు చేసుకుంటూ ఫుట్‌పాత్‌లపై నివసిస్తుంటారని, వారి వద్ద కనీసం మొబైల్ ఫోన్లూ లేవని అభియోగపత్రంలో ఒక పేరాలో సీబీఐ పేర్కొంది. కాకాణి గోవర్ధన్‌రెడ్డి, ఆయన సన్నిహితులు, పీఏల కాల్‌డేటా రికార్డులను తీసుకుని విశ్లేషించామని, వాటిల్లో వారు ఎక్కడా నిందితులతో మాట్లాడినట్లు లేదని మరో పేరాలో ప్రస్తావించింది.
దీన్నిబట్టి ఈ చోరీతో మంత్రికి ఎలాంటి సంబంధమూ లేదంటూ తేల్చేసింది. అసలు నిందితుల వద్ద మొబైల్ ఫోన్లే లేవని చెబుతూ, అదే సమయంలో వారితో కాకాణి, ఆయన సంబంధీకులెవరూ మాట్లాడినట్లు కాల్ డేటా రికార్డుల్లో ఎక్కడా లేదని పేర్కొనడం హాస్యాస్పదం కాదా? ఫోన్లే లేకపోతే కాల్‌డేటా రికార్డులు ఎలా లభిస్తాయి? ఈ ప్రశ్నకు సీబీఐ ఏం సమాధానం చెబుతుంది?
చోరీతో ఆయనకు సంబంధం లేదు - మంత్రి కాకాణి కేసులో మళ్లీ అదే కథ రిపీట్ చేసిన సీబీఐ
చోరీ ఘటనలో అరెస్టైన నిందితులు జైల్లో ఉన్నప్పుడు వారిని కొద్ది మంది బంధువులు తప్ప ఇతరులు కలవలేదని, బెయిల్ వచ్చినా ష్యూరిటీలు సమర్పించేవారు లేక విడుదల కాలేదని అందుకే ఈ ఘటనలో కుట్ర లేదనేది స్పష్టమవుతోంది అని సీబీఐ పేర్కొంది. కుట్రకు రూపకల్పన చేసినవారెవరైనా సరే ఆ నిందితుల్ని జైలుకు వెళ్లి కలుస్తారా? అలా కలిస్తే దొరికిపోతామని తెలియనంత అమాయకులా? వారికి ష్యూరిటీలు సమర్పించి బయటకు తీసుకొస్తే, దాని వెనుక ఎవరున్నారనేది తెలిసిపోదా?
ఈ మాత్రం తార్కికంగా సీబీఐ ఎందుకు ఆలోచించలేదన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. కాకాణి నిందితుడిగా ఉన్న ఫోర్జరీ కేసు ప్రాపర్టీని బెంచ్ క్లర్క్ నాగేశ్వరరావు తన బీరువాలో భద్రపరిచారని, చోరీ జరిగిన రోజున దాని తాళం తెరిచి తిరిగి వేయడం మరిచిపోయారన్న సీబీఐ, దాన్ని ఆ బీరువాకే వదిలేశారని తెలిపింది. దీంతో చోరీకి వెళ్లిన నిందితులు ఆ బీరువాలోని ప్రాపర్టీని దొంగిలించారని అభియోగపత్రంలో పేర్కొంది.
ఈ వ్యవహారంలో నాగేశ్వరరావుది ఎలాంటి తప్పూ లేదని తేల్చేసింది. అసలు ఆ రోజే బీరువాకు తాళాలు వేయకుండా ఎందుకు వదిలేశారు? అందులోనే కాకాణి నిందితుడిగా ఉన్న కేసు ప్రాపర్టీ ఉండటమేంటి? దొంగతనానికి వచ్చినవారికి అవి మాత్రమే దొరకటమేంటి? అనేదానిపై సీబీఐ అభియోగపత్రంలో తగిన సమాధానాలు లేవు. నాగేశ్వరరావు ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగానే సీబీఐ ఈ నిర్ధారణకు వచ్చేసింది.
మంత్రి కాకాణీ గారూ.. మీకు నైతికత లేదా?
కాకాణి కాల్ డేటా రికార్డ్స్ విశ్లేషిస్తే ఎక్కడా ఈ చోరీ కేసుతో సంబంధమున్నట్లు కనిపించలేదని సీబీఐ పేర్కొంది. అంటే కాల్ డేటా రికార్డ్స్ మీద ఆధారపడి దర్యాప్తును తేల్చేయడం ఏమిటి? ఆయన్ను ఎవరైనా ప్రత్యక్షంగా కలిశారా? ఆయన తరఫు వ్యక్తులు ఎవరైనా నిందితుల్ని, లేదా కేసుతో సంబంధమున్న ఇతర వ్యక్తుల్ని కలిశారా అనే కోణంలో లోతుగా ఎందుకు దర్యాప్తు చేయలేదు?
కుట్రలకు పాల్పడేవారు ఎవరైనా వారి సొంత ఫోన్లు, పీఏల ఫోన్ల నుంచి మాట్లాడతారా? వేరే సిమ్‌లు తీసుకుని మాట్లాడి ఉండొచ్చు కదా! లేదా ఇతర మార్గాల్లో సంప్రదింపులు జరిపి ఉండొచ్చు కదా! మరి ఆ కోణాన్ని సీబీఐ ఎందుకు విస్మరించిందన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఫోర్జరీ కేసులో కాకాణి పాత్రకు సంబంధించిన ఆధారాలను చోరీకి పాల్పడ్డ నిందితులు కోర్టు ప్రాంగణంలోనే వదిలేశారు. ఆ కేసులో ఇతర నిందితులకు సంబంధించిన ఆధారాలను మాత్రమే దొంగతనం చేశారు. కాబట్టి ఈ చోరీ వెనుక కాకాణి లేనట్లేనని సీబీఐ తేల్చేసింది.
మొత్తంగా ఈ ఘటన వెనుక ఎవరున్నారు అనేది లోతుగా దర్యాప్తు చేయకుండా ఇలా పైపైన తేల్చేయడంలో ఆంతర్యమేంటి? కోర్టులో చోరీ ఘటన జరిగిన తర్వాత శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా పోలీసులు ఆ ఘటనా స్థలానికి అసలు డాగ్ స్క్వాడ్‌నే తీసుకెళ్లలేదు. ఘటనా స్థలంలో వేలిముద్రలు సేకరించినా అవి అస్పష్టంగా ఉన్నాయని, విశ్లేషించేందుకు ఉపయోగపడవని వదిలేశారు. సాంకేతిక ఆధారాలైన ఇవి లేకుండానే ఫలానా వారే నిందితులని ఎలా తేల్చేస్తారు అన్న ప్రశ్నకు సమాధానం దొరకని పరిస్థితి.