Man Arrest In Temple Chariot Fire Incident in Anantapur : అనంతపురం జిల్లాలో రాములవారి ఆలయ రథానికి నిప్పు పెట్టిన ఘటనపై 24 గంటల్లో కేసును ఛేదించామని ఎస్పీ జగదీశ్ తెలిపారు. రాయదుర్గం నియోజకవర్గం కనేకల్లు మండలం హనకనహల్ గ్రామంలో శ్రీరాముని రథాన్ని పెట్రోల్ పోసి ఈశ్వర్‌రెడ్డి కాల్చారని వెల్లడించారు. హనకనహల్ గ్రామంలో ఈ నెల 23న (Sep 23) శ్రీరాముని రథానికి నిప్పు పెట్టారు. స్థానిక గ్రామానికి చెందిన ఎర్రిస్వామిరెడ్డి సోదరులు రూ.20 లక్షలు వెచ్చించి 2022లో రథం చేయించారని జిల్లా ఎస్పీ జగదీశ్ తెలియజేశారు.
దీనికోసం గ్రామస్థుల నుంచి ఎలాంటి విరాళాలు సేకరించ లేదని తెలిపారు. ఈ రథం విషయంలో అన్నదమ్ముల మధ్య వివాదం నడుస్తోందని పేర్కొన్నారు. ఈ క్రమంలో జరిగిన వివాదంలో రథానికి ఎర్రిస్వామిరెడ్డి కుమారుడు ఈశ్వర్‌రెడ్డి నిప్పుపెట్టాడని తెలిపారు. ఆదివారం అర్ధరాత్రి పెట్రోల్ పోసి నిప్పుపెట్టినట్లు విచారణలో అతడు అంగీకరించాడని వెల్లడించారు. అతడు ప్రస్తుతం వైఎస్సార్సీపీ కార్యకర్త. ఈ విషయంలో రాజకీయ కోణం లేదని పేర్కొన్నారు. శ్రీరాముని రథానికి నిప్పు అంశంలో మరేవరైనా ఉన్నారా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. ఈ అంశంపై ఈశ్వర్‌రెడ్డిని అరెస్ట్ చేశామని వెల్లడించారు.
కణేకల్లు మండలం హనకనహాళ్‌లోని ఆలయ రథానికి ఈ నెల 23న గుర్తుతెలియని వ్యక్తులు నిప్పంటించడం కలకలం రేపింది. షెడ్డులో మంటలు, పొగ వ్యాపించడంతో స్థానికులు అప్రమత్తం అయ్యారు. ఎగిసి పడుతున్నా మంటలు ఆర్పి వేశారు. అప్పటికే శ్రీరాముని రథం కొంతమేర కాలిపోయింది. తిరుమల లడ్డూ ప్రసాదం వివాదం నేపథ్యంలో ఈ సంఘటనను సీఎం చంద్రబాబు సీరియస్‌గా తీసుకున్నారు. సమగ్రంగా దర్యాప్తు చేయాలని పోలీసులను ఆదేశించారు.